Telugu Global
Telangana

పైసలేవి..? తులం బంగారం ఏది..? బీజేపీ నాయకులకు షాక్..

ముందుగా ఒప్పుకున్నంత సొమ్ము తమ చేతికి రాలేదని కొందరు, అసలు తమకు డబ్బులే ఇవ్వలేదని మరికొందరు బీజేపీ నేతల ఇళ్లను చుట్టుముట్టారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

పైసలేవి..? తులం బంగారం ఏది..? బీజేపీ నాయకులకు షాక్..
X

ఓటుకి రూ.20 వేలు నగదు, మహిళలకు తులం బంగారం.. ఇవీ మునుగోడులో బీజేపీ తరపున జరుగుతున్న ప్రలోభాలు. ఇటీవల మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్‌ని పత్తి కూలీలు నిలదీసింది కూడా ఈ విషయంపైనే. బయట రూ.20 వేలు అని ప్రచారం జరుగుతుంటే ఆయన రూ.3 వేలు ముట్టాయా అని అడిగే సరికి మహిళలు కస్సుమన్నారు. తాజాగా కొరటికల్ గ్రామంలో ఇదే విషయంపై గొడవ జరుగుతోంది. ఓటుకు నోటు పంపిణీలో అవకతవకలు జరిగాయని, తమ చేతికి డబ్బు అందలేదని కొందరు గ్రామస్తులు బీజేపీ నేతల ఇళ్లను చుట్టుముట్టారు.

రాజగోపాల్ రెడ్డి తెలివిగా వారం ముందే ఎక్కడి డబ్బులు అక్కడ ఆన్‌లైన్ పేమెంట్ చేసేశారు. సరిగ్గా ఎన్నికల ముందు రోజు డబ్బులు ఓటర్ల చేతిలో పడాలనే పథకంతో పంపిణీ మొదలుపెట్టారు. మునుగోడు మండలంలోని కొరటికల్ గ్రామంలో ఉదయం నుంచి డబ్బు పంపిణీ మొదలైంది. అయితే అంతలోనే గొడవ మొదలైంది. ముందుగా ఒప్పుకున్నంత సొమ్ము తమ చేతికి రాలేదని కొందరు, అసలు తమకు డబ్బులే ఇవ్వలేదని మరికొందరు బీజేపీ నేతల ఇళ్లను చుట్టుముట్టారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

తలపట్టుకున్న నాయకులు..

గ్రామస్తులే ఓటుకి నోటు డిమాండ్ చేశారంటే సహజంగా నాయకులకు పండగే. కానీ ఇక్కడ ఈసీతో పెద్ద పేచీ ఉంది. ఎన్నికల కమిషన్ దృష్టిలో పడితే కేసు పెడతారేమోనని బీజేపీ నేతలు భయపడిపోతున్నారు. ఇంటి ముందు ఆందోళనకు వచ్చిన గ్రామస్తులకు సర్ది చెప్పలేక సతమతం అవుతున్నారు. ఒక్క కొరటికల్‌లోనే కాదు, చాలా మండలాల్లో ఇదే పరిస్థితి కనపడుతోంది. చీకటితోనే బీజేపీ నేతలు డబ్బుల పంపిణీకి వెళ్లగా, 10 గంటల తర్వాత అన్ని ప్రాంతాల్లో గొడవలు మొదలయ్యాయి. సోషల్ మీడియాలో ఓటుకి రూ.20 వేలు అంటూ ప్రచారం జరగడం, కొన్నిచోట్ల తులం బంగారం కూడా ఇస్తున్నారని అనడంతో.. వెయ్యి, రెండు వేలకు ఓటర్లు లొంగడం లేదు. ఇదెక్కడి గొడవ అంటూ బీజేపీ నేతలు తల పట్టుకుంటున్నారు. రూ.వెయ్యి, రెండు వేలు చేతిలో పెడితే ఓటు వెయ్యరని తేలిపోయినా ఏమీ చెయ్యలేని పరిస్థితి. మొత్తమ్మీద నోట్లపైనే పూర్తిగా ఆధారపడి ప్రచారాన్ని కూడా గాలికొదిలేసిన రాజగోపాల్ రెడ్డి చివరకు ఇలా బుక్కైపోయారు.

First Published:  2 Nov 2022 6:27 AM GMT
Next Story