Telugu Global
Telangana

కారు దిగి కాంగ్రెస్‌లో చేరిన యువనేత.. హుజూరాబాద్‌లో త్రిముఖ పోరు

హుజూరాబాద్‌ నియోజకవర్గం మొదటి నుంచి బీఆర్ఎస్‌కు కంచుకోటగా ఉండేది. అయితే ఈటల రాజేందర్‌ పార్టీ మారడంతో నియోజకవర్గంలో సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి.

కారు దిగి కాంగ్రెస్‌లో చేరిన యువనేత.. హుజూరాబాద్‌లో త్రిముఖ పోరు
X

హుజూరాబాద్‌ బీఆర్ఎస్‌ కీలక నేత వొడితల ప్రణవ్‌ బాబు కారు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ప్రణవ్‌ పార్టీ మార్పు కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్‌తో వొడితల కుటుంబానిది విడదీయలేని బంధం. అలాంటి కుటుంబంలోని వ్య‌క్తి కాంగ్రెస్‌ పార్టీలో చేరడం నియోజకవర్గ ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసింది. కేసీఆర్‌కు ఎంతో సన్నిహితంగా ఉండే కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు అన్న రాజేశ్వర రావు మనవడే ప్రణవ్‌ బాబు. లక్ష్మీకాంతరావు కుమారుడు సతీష్‌బాబు ప్రస్తుతం హుస్నాబాద్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు.

హుజూరాబాద్‌ నియోజకవర్గం మొదటి నుంచి బీఆర్ఎస్‌కు కంచుకోటగా ఉండేది. అయితే ఈటల రాజేందర్‌ పార్టీ మారడంతో నియోజకవర్గంలో సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. దీంతో ప్రణవ్‌ బాబు తనకే టికెట్ వస్తుందని ఆశించారు. కానీ ఇదే టైమ్‌లో పాడి కౌశిక్‌ రెడ్డి కాంగ్రెస్‌ నుంచి బీఆర్ఎస్‌లో చేరడంతో ప్రణవ్‌ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. రాబోయే ఎన్నికల్లో కౌశిక్‌ రెడ్డికే పార్టీ అధిష్టానం టికెట్ కేటాయించింది. కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరడంతో హుజూరాబాద్‌ బై ఎలక్షన్‌లో NSUI లీడర్‌ బల్మూరి వెంకట్‌ను బరిలో ఉంచింది. అయితే రాబోయే ఎన్నికల్లో హుజూరాబాద్‌ నుంచి బరిలో దిగేందుకు బల్మూరి వెంకట్ అంతగా ఆసక్తి చూపట్లేదని సమాచారం. ఈ నేపథ్యంలోనే BRSలో అసంతృప్తితో ఉన్న వొడితల ప్రణవ్‌ను కాంగ్రెస్‌ నేతలు సంప్రదించారు. కాంగ్రెస్ నేతలు పార్టీలోకి ఆహ్వానించడం.. ప్రణవ్‌ ఢిల్లీ వెళ్లి ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకోవడం చకచకా జరిగిపోయాయి. హుజూరాబాద్‌ టికెట్ ఇస్తామని ప్రణవ్‌కు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

హుజూరాబాద్‌తో పాటు హుస్నాబాద్‌ నియోజకవర్గంపై వొడితల కుటుంబానికి మంచి పట్టుంది. ప్రణవ్ తాత వొడితల రాజేశ్వర రావు హుజూరాబాద్‌ నుంచి ఓ సారి ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, రాజ్యసభ సభ్యుడిగానూ సేవలందించారు. ప్రణవ్‌ చేరిక నియోజకవర్గంలో పార్టీకి ఊపు తేస్తుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఇక బీజేపీ తరఫున ఈటల రాజేందర్‌, బీఆర్ఎస్ తరఫున పాడి కౌశిక్‌ రెడ్డి పోటీ చేయడం ఖాయమే. దీంతో హుజూరాబాద్‌లో త్రిముఖ పోరు తప్పదనే టాక్ నడుస్తోంది.

First Published:  7 Oct 2023 1:28 PM GMT
Next Story