Telugu Global
Telangana

బీజేపీలో ఉన్నప్పుడు నేను సీతలా కన్పించా..!

తనపై జరిగిన ఐటీ దాడుల వెనక కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఉన్నారని విమర్శించారు వివేక్. సోదాల పేరుతో తనను 12 గంటలసేపు ప్రచారానికి వెళ్లకుండా అడ్డుకున్నారని ఆరోపించారు.

బీజేపీలో ఉన్నప్పుడు నేను సీతలా కన్పించా..!
X

ఐటీ నోటీసులు, ఈడీ సోదాలపై మరోసారి స్పందించారు కాంగ్రెస్ పార్టీ చెన్నూర్ అభ్యర్థి వివేక్ వెంకట స్వామి. బీజేపీ నేత ఈటల రాజేందర్‌ భూముల కోసమే తాను గతంలో రూ. 27 కోట్లు చెక్కుల రూపంలో ఇచ్చానని, ఆ భూముల వ్యవహారంలో తనకు నోటీసులు ఇచ్చిన ఐటీ అధికారులు... ఆయనకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ లో ఉన్నానని తనను బెదిరించేందుకు నోటీసులిచ్చిన ఐటీ, బీజేపీలో ఉన్నాడనే ఉద్దేశంతోనే ఈటలకు నోటీసులు ఇవ్వలేదని విమర్శించారు. బీజేపీలో ఉన్నప్పుడు తనను సీతలా చూసిన ఆ పార్టీ నేతలు... కాంగ్రెస్‌లో చేరాక రావణుడిలా చూస్తున్నారని మండిపడ్డారు.

తనపై జరిగిన ఐటీ దాడుల వెనక కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఉన్నారని విమర్శించారు వివేక్. బీఆర్ఎస్ ఓటమి భయంతో తనపై దాడులు చేయించిందన్ననారు. గతంలో హుజూరాబాద్, మునుగోడులో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం తాను అహర్నిశలు కృషి చేశానని.. అది మనసులో పెట్టుకుని బీఆర్ఎస్ ఈ పని చేసిందని చెప్పారు. సోదాల పేరుతో తనను 12 గంటలసేపు ప్రచారానికి వెళ్లకుండా అడ్డుకున్నారని వివేక్‌ ఆరోపించారు.

తాను నిజాయతీగా వ్యాపారం చేస్తున్నానని, ఇప్పటివరకు రూ. 10 వేల కోట్ల మేర పన్నులు చెల్లించానని చెప్పారు వివేక్‌. తన మిత్రుడి కంపెనీని చట్టప్రకారం, నిబంధనల మేరకే తాను చూసుకుంటున్నానని అన్నారు. ఆ కంపెనీ షేర్లు అమ్మితే ఇటీవల లాభం వచ్చిందని, అందులో కొంత మొత్తం పన్నుగా కూడా చెల్లించామన్నారు. తప్పుడు ఆరోపణలతో బీజేపీ, బీఆర్‌ఎస్‌ కలసి తనను అరెస్టు చేయాలని కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు వివేక్.


First Published:  24 Nov 2023 1:53 AM GMT
Next Story