Telugu Global
Telangana

పార్లమెంటు సాక్షిగా కేంద్రం అబద్దాలు ప్రచారం చేస్తోంది

మంత్రి మాట‌ల‌ను స‌రిదిద్దుకోకుంటే పార్ల‌మెంట్‌లో ప్రివిలేజ్ మోష‌న్ ప్రవేశపెడతామ‌ని వినోద్ కుమార్ హెచ్చరించారు. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల్లో ఒకదానికి జాతీయ హోదా కల్పించాలని 2018 జూలై 20న కరీంనగర్‌ ఎంపీగా ప్రధాని మోడీని, కేంద్రాన్ని తాను స్వయంగా కోరినట్టు వినోద్‌కుమార్‌ తెలిపారు.

పార్లమెంటు సాక్షిగా కేంద్రం అబద్దాలు ప్రచారం చేస్తోంది
X

కాళేశ్వరం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఎన్నడూ అడగలేదని పార్లమెంట్‌లో తప్పుడు ప్రకటనలు చేసిన కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్‌ తుడుపై టీఎస్‌ ప్లానింగ్‌ బోర్డు ఉపాధ్యక్షుడు బీ వినోద్‌ కుమార్‌ మండిపడ్డారు.

మంత్రి మాట‌ల‌ను స‌రిదిద్దుకోకుంటే పార్ల‌మెంట్‌లో ప్రివిలేజ్ మోష‌న్ ప్రవేశపెడతామ‌ని వినోద్ కుమార్ హెచ్చరించారు. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల్లో ఒకదానికి జాతీయ హోదా కల్పించాలని 2018 జూలై 20న కరీంనగర్‌ ఎంపీగా ప్రధాని మోడీని, కేంద్రాన్ని తాను స్వయంగా కోరినట్టు వినోద్‌కుమార్‌ తెలిపారు.

తన ప్రకటన పార్లమెంటు రికార్డుల్లో ఉందని తెలియజేస్తూ, దేశంలోని ఏ ప్రాజెక్టుకూ కేంద్రం జాతీయ హోదా ఇవ్వదని అప్పటి జలశక్తి మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారని చెప్పారు.

అయితే, గడ్కరీ ప్రకటన తర్వాత, కేంద్ర ప్రభుత్వం రెండు ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చింది, ఉత్తరప్రదేశ్‌లోని కెన్-బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టుకు రూ. 45,000 కోట్లు, కర్నాటకలోని అప్పర్ బద్రా ప్రాజెక్టుకు రూ. 15,000 కోట్లు కేటాయించింది.

కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన ఐదు రోజుల్లోనే ప్రధానమంత్రికి, ఇతర కేంద్ర మంత్రులకు వినతిపత్రం అందించారు. గతంలో నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు కూడా పలుమార్లు అప్పటి జలశక్తి మంత్రి ఉమాభారతికి వినతిపత్రాలు అందజేశారు.

అయితే పార్లమెంటును, దేశ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు మంత్రి ప్రయత్నించాడని వినోద్ కుమార్ మండిపడ్డారు.

First Published:  19 March 2023 2:37 AM GMT
Next Story