Telugu Global
Telangana

రేపే నిమజ్జనం.. అన్ని విగ్రహాలూ సాగర్‌కే..

హైదరాబాద్ లో వినాయక నిమజ్జనానికి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది, ట్యాంక్ బండ్‌పై క్రేన్లు సిద్ధం చేసింది. 12వేలమంది పోలీసుల పహారా మధ్య కట్టుదిట్టంగా శుక్రవారం నిమజ్జనోత్సవం జరగ‌నుంది.

రేపే నిమజ్జనం.. అన్ని విగ్రహాలూ సాగర్‌కే..
X

హైదరాబాద్ లో వినాయక నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం ఉదయం నుంచి నిమజ్జన సందడి మొదలుకానుంది. ట్యాంక్ బండ్ పై ఇప్పటికే భారీ క్రేన్లు రెడీ చేశారు. ఎన్టీఆర్ మార్గ్, అప్పర్ ట్యాంక్ బండ్ పై 22 క్రేన్లు అందుబాటులోకి తెచ్చారు. హుస్సేన్‌ సాగర్‌ లో వినాయక నిమజ్జనం సందర్భంగా ఆ ప్రాంతంలో 12వేల మంది పోలీస్ సిబ్బంది మోహరించ‌నున్నారు. సాగర్ చుట్టూ ఉన్న 200 సీసీ కెమెరాలతోపాటు, అదనంగా మరికొన్ని కెమెరాలను ఏర్పాటు చేశారు. వ్యర్థాల తొలగింపు కోసం 20 జేసీబీలను అదనంగా అందుబాటులోకి తెస్తున్నారు.

అన్ని విగ్రహాలూ హుస్సేన్ సాగర్ లోకే..

హుస్సేన్ సాగర్ లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు నిమజ్జనం చేయకూడదనే నిబంధన ఉన్నా.. ఈ ఏడాదికి మాత్రం అన్ని విగ్రహాలూ సాగర్ వైపే దారి తీసేలా కనిపిస్తున్నాయి. నిమజ్జనం విషయంలో బీజేపీ మత రాజకీయాలను ఎగదోయాలని చూసింది. దీంతో ప్రభుత్వం ఎవరికీ ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసింది. మట్టితో చేసిన ఖైరతాబాద్ భారీ వినాయకుడి విగ్రహంతోపాటు, మిగతా పెద్ద విగ్రహాలన్నీ సాగర్ వైపే కదలబోతున్నాయి.

ఈసారి నిమజ్జనం కోసం హైదరాబాద్ కార్పొరేషన్ పరిధిలో ఎక్కడికక్కడ బేబీపాండ్ లు ఏర్పాటు చేశారు. కృత్రిమంగా ఏర్పాటు చేసిన బేబీ పాండ్స్ లో ఈ ఏడాది ప్రయోగాత్మకంగా విగ్రహాల నిమజ్జనం జరుగుతుంది. ఈ విధానం విజయవంతమైతే.. వచ్చే ఏడాది నుంచి విరివిగా ఇలాంటి ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే హుస్సేన్ సాగర్ వరకు మేళ తాళాలతో, ఊరేగింపుగా విగ్రహాలను తీసుకెళ్లడం హైదరాబాద్ వాసులకు సరదా. దీంతో బేబీ పాండ్స్ వినియోగం ఎంతవరకు ఉంటుందనేది వేచి చూడాలి.

First Published:  8 Sep 2022 9:30 AM GMT
Next Story