Telugu Global
Telangana

కామారెడ్డిలో పోటీపై విజయశాంతి స్పందన

కామారెడ్డిలో కేసీఆర్ పై పోటీ చేసేందుకు విజయశాంతి సుముఖంగా ఉన్నారా, లేదా అనే విషయం మాత్రం తేలడంలేదు. అయితే మీడియాలో రెండు రోజులుగా జరుగుతున్న ప్రచారంపై మాత్రం తాను స్పందించాల్సి వచ్చిందని చెబుతున్నారు విజయశాంతి.

కామారెడ్డిలో పోటీపై విజయశాంతి స్పందన
X

సీఎం కేసీఆర్ గజ్వేల్ తో పాటు కామారెడ్డిలో కూడా పోటీ చేస్తానని ప్రకటించడంతో ఇప్పుడు ఆ నియోజకవర్గం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. 2009 నుంచి అక్కడ గంప గోవర్దన్ వరుసగా గెలుస్తూ వచ్చారు. 2012 తర్వాత ఆ స్థానాన్ని బీఆర్ఎస్ కంచుకోటగా మార్చారు. ఇప్పుడు అక్కడ సీఎం కేసీఆర్ పోటీ చేయాలనుకుంటున్నారు. గజ్వేల్ తోపాటు కామారెడ్డిలో కూడా ఆయనే పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే కేసీఆర్ కి ప్రత్యర్థులెవరు..? ఏరికోరి కేసీఆర్ ని ఢీకొనడానికి ఎవరు సాహసిస్తారు..? పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత వచ్చే సారి కేసీఆర్ పై పోటీచేస్తా, ప్రతీకారం తీర్చుకుంటానన్న ఈటల రాజేందర్ ఇప్పుడు సైలెంట్ అయ్యారు. రేవంత్ రెడ్డి కూడా పార్టీ ఎక్కడ ఆదేశిస్తే అక్కడ పోటీ చేస్తానంటున్నారే కానీ, కేసీఆర్ ని ఢీకొంటానని చెప్పలేకపోతున్నారు. కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలూ.. కేసీఆర్ కి పోటీగా కీలక నేతల్ని బరిలో దింపే అవకాశాలు లేవు. అయితే అనూహ్యంగా కేసీఆర్ ప్రత్యర్థిగా బీజేపీ నేత విజయశాంతి పేరు వినిపించడం విశేషం. కేసీఆర్ కి పోటీగా ఆమె కామారెడ్డి నుంచి బరిలో దిగుతారని అంటున్నారు. ఈ వార్తలపై నేరుగా ఆమే స్పందించడం విశేషం.

కామారెడ్డిలో కేసీఆర్ పై పోటీ చేసేందుకు విజయశాంతి సుముఖంగా ఉన్నారా, లేదా అనే విషయం మాత్రం తేలడంలేదు. అయితే మీడియాలో రెండు రోజులుగా జరుగుతున్న ప్రచారంపై మాత్రం తాను స్పందించాల్సి వచ్చిందని చెబుతున్నారు విజయశాంతి. కామారెడ్డి అసెంబ్లీనుంచి తన పోటీ విషయాన్ని పార్టీ నిర్ణయిస్తుందని తెలివిగా సమాధాం చెప్పారామె. బీజేపీ కార్యకర్తలెవరైనా పార్టీ ఆదేశాలను మాత్రమే పాటిస్తారని, అదే తమ విధానం అని అన్నారు.

ఏది ఏమైనా కామారెడ్డి, గజ్వేల్ రెండు నియోజకవర్గాలలో బీజేపీ గెలుపు, తెలంగాణ భవిష్యత్తుకు తప్పనిసరి అవసరం అంటున్నారు విజయశాంతి. ఆ రెండు చోట్ల పార్టీ గెలవాలని కోరుకుంటున్న నాయకులు చాలామందే ఉన్నారు కానీ.. అక్కడ పోటీ చేయడానికి మాత్రం ఎవరికీ ధైర్యం చాలడంలేదు. పోయి పోయి కేసీఆర్ పై పోటీ చేస్తే రిజల్ట్ ఏంటనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదంటున్నాయి బీఆర్ఎస్ వర్గాలు.

First Published:  24 Aug 2023 9:30 AM GMT
Next Story