Telugu Global
Telangana

దళితబంధుపై విజిలెన్స్ విచారణ.. లబ్ధిదారుల్లో ఆందోళన

దళితబంధు పథకం ద్వారా వచ్చిన డబ్బులు ఎలా ఖర్చు చేశారు, ఏమేం చేశారు, ఏయే వ్యాపారాలు చేస్తున్నారంటూ విజిలెన్స్ అధికారులు తాండూరు నియోజకవర్గంలోని లబ్ధిదారులను ప్రశ్నించి వివరాలు సేకరిస్తున్నారు.

దళితబంధుపై విజిలెన్స్ విచారణ.. లబ్ధిదారుల్లో ఆందోళన
X

గతంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పథకం 'దళితబంధు'. ఒక్కో కుటుంబానికి రూ.10లక్షల ఆర్థిక సాయం అందించింది ప్రభుత్వం. ఆ సాయం ద్వారా చాలామంది రుణ విముక్తులయ్యారు, సొంత వ్యాపారాలు మొదలు పెట్టుకున్నారు, ఇల్లు కట్టుకున్నారు, బిడ్డల చదువుకోసం ఆ డబ్బు ఉపయోగించుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితబంధు పథకాన్ని కొనసాగించరనే విషయం దాదాపుగా స్పష్టమైంది. అయితే ఆల్రడీ ఆ పథకం ద్వారా లబ్ధిపొందిన కుటుంబాల వద్ద వివరాలు సేకరించడం మొదలు పెట్టడంతో ఆందోళన మొదలవుతోంది. విజిలెన్స్ అధికారులు ఈ పథకంపై ఆరా తీస్తున్నారు. వికారాబాద్‌ జిల్లాలో 10 రోజుల నుంచి ఎంక్వైరీ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ పథకంలో నిధులు దుర్వినియోగం అయ్యాయనేది కాంగ్రెస్ నేతల ప్రధాన ఆరోపణ.

వికారాబాద్‌ జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో 'దళితబంధు' పథకం అమలైంది. తొలి విడతలో 358 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున జిల్లాకు మొత్తం రూ.35.80 కోట్లు విడుదల చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. వికారాబాద్‌లో 100, తాండూరులో 100, పరిగిలో 80, కొడంగల్‌లో 60, చేవెళ్ల నియోజకవర్గంలో 18 యూనిట్లను అధికారులు గ్రౌండింగ్‌ చేశారు. ఇదే జిల్లాలో రెండో విడత దళితబంధు అమలుకోసం గత ప్రభుత్వం రూ.60 కోట్లు విడుదల చేసింది కూడా. అంతలో ఎన్నికల షెడ్యూల్‌ రావడంతో ఆ ప్రక్రియ మధ్యలోనే ఆగిపోయింది.

'దళితబంధు'కోసం గత ప్రభుత్వం విడుదల చేసిన రూ.60కోట్లు ఖర్చు చేయాలని, లబ్ధిదారులకు కేటాయించాలంటూ వికారాబాద్ వాసులు కొన్నిరోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో వారికి కనీస సమాచారం ఇవ్వలేదు ప్రభుత్వం. పోనీ వికారాబాద్ లో ఈ పథకం అమలు చేస్తే, రాష్ట్రవ్యాప్తంగా డిమాండ్లు వినిపిస్తాయనేది కాంగ్రెస్ అనుమానం. అందుకే పూర్తిగా పథకాన్ని పక్కనపెట్టినట్టు తెలుస్తోంది. ఈలోగా విజిలెన్స్ విచారణ అంటూ హడావిడి చేయడంతో లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారు. దళితబంధు పథకం ద్వారా వచ్చిన డబ్బులు ఎలా ఖర్చు చేశారు, ఏమేం చేశారు, ఏయే వ్యాపారాలు చేస్తున్నారంటూ విజిలెన్స్ అధికారులు తాండూరు నియోజకవర్గంలోని లబ్ధిదారులను ప్రశ్నించి వివరాలు సేకరిస్తున్నారు. 'దళితబంధు' ఆయా వర్గాల్లో వెలుగులు నింపిందని, అలాంటి పథకంపై బురదజల్లేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం విజిలెన్స్ విచారణ చేపట్టిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.

First Published:  6 April 2024 2:20 AM GMT
Next Story