Telugu Global
Telangana

2018లో ఓటమికి కారణమైన టీఆర్ఎస్ నేతను పార్టీలో చేర్చుకున్న సీఎం కేసీఆర్.. దానికీ ఒక్క లెక్కుంది!

రాబోయే మునుగోడు ఉప‌ఎన్నికలో టీఆర్ఎస్ గెలవాలంటే బలమైన నాయకుడి మద్దతు అవసరమ‌ని కేసీఆర్ గ్రహించారు. ఈ క్రమంలోనే వేనేపల్లి వెంకటేశ్వరరావును ప్రగతి భవన్‌కు పిలిచారు.

2018లో ఓటమికి కారణమైన టీఆర్ఎస్ నేతను పార్టీలో చేర్చుకున్న సీఎం కేసీఆర్.. దానికీ ఒక్క లెక్కుంది!
X

రాజకీయాల్లో సీఎం కేసీఆర్ వ్యూహాలు అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. ఉద్యమ పార్టీని నడిపినా.. రాజకీయ పార్టీగా టీఆర్ఎస్‌ను బలోపేతం చేసినా కేసీఆర్ మార్కు కనపడుతుంది. అసలు కేసీఆర్ వేసే ప్రతీ అడుగుకు ఒక లెక్క ఉంటుంది. ఆ లెక్కలేంటో ఆయన సన్నిహితులకు కూడా అంత త్వరగా అర్థం కావంటే అతిశయోక్తి కాదు. తాజాగా మునుగోడుకు సంబంధించి పార్టీ పరంగా తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. 2018లో మునుగోడు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఓడిపోయి.. రాజగోపాల్ గెలవడానికి పరోక్ష కారణమైన వ్యక్తిని తాజాగా పార్టీలో చేర్చుకున్నారు.

మునుగోడు నియోజకవర్గానికి చెందిన వేనేపల్లి వెంకటేశ్వరరావు తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీలో ఉండేవారు. అయితే ఉద్యమం ఉధృతంగా సాగుతున్న వేళ ఆయన టీడీపీకి గుడ్ బై చెప్పి గులాబీ కండువా కప్పుకున్నారు. మొదటి నుంచి మంత్రి హరీశ్ రావు వర్గం నేతగా ఆయనకు పార్టీలో గుర్తింపు ఉంది. 2014లో కూసుకుంట ప్రభాకర్ రెడ్డి గెలుపున‌కు ఆయన కృషి చేశారు. అయితే 2018 ఎన్నికల సమయంలో ప్రభాకర్ రెడ్డిపై నియోజకవర్గంలో ప్రతికూలత మొదలైంది. సొంత పార్టీ నేతలే ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు. ఈ క్రమంలో వేనేపల్లి వెంకటేశ్వరరావు టీఆర్ఎస్ తరఫున‌ మునుగోడు టికెట్ ఆశించారు. తనకే టికెట్ దక్కుతుందని గ్రౌండ్ లెవల్ వర్క్ కూడా చేసుకున్నారు. అయితే సిట్టింగులకే సీట్లు అని కేసీఆర్ ప్రకటించడంతో.. వేనేపల్లి ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యింది.

2018లో కూడా కూసుకుంట్లకే టికెట్ దక్కడంతో వేనేపల్లి తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. నియోజకవర్గంలోని మునుగోడు, నాంపల్లి, చండూరు మండలాల్లో వేనేపల్లికి బలమైన అనుచరగణం ఉంది. ఆ మండలాల్లో వేనేపల్లి బాగా ప్రభావితం చేయగలరు. ఈ నేపథ్యంలో 2018లో రెబెల్‌గా పోటీ చేయడానికి సిద్దపడ్డారు. ఒక భారీ బహిరంగ సభ నిర్వహించి విజయవంతం చేశారు. ఇది సీఎం కేసీఆర్‌కు ఆగ్రహం తెప్పించింది. పార్టీ నిర్ణయాన్ని, అందులో తాను డిసైడ్ చేసిన అభ్యర్థిని కాదని వ్యతిరేకంగా మీటింగ్ పెట్టడంపై మండిపడ్డారు. వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. వేనేపల్లి అనుచరులు, అభిమానులు ఆ ఎన్నికల్లో కూసుకుంట్ల ఓటమికి పరోక్షంగా పని చేశారని.. అందుకే రాజగోపాల్ రెడ్డి గెలిచారని స్థానికులు చెప్తుంటారు.

తాజాగా మునుగోడుకు ఉపఎన్నిక రావడంతో వేనేపల్లి మరోసారి తెరపైకి వచ్చారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై ఇప్పటికీ స్థానికంగా వ్యతిరేకత ఉంది. దీంతో రాబోయే ఎన్నికలో టీఆర్ఎస్ గెలవాలంటే బలమైన నాయకుడి మద్దతు అవసరం అని కేసీఆర్ గ్రహించారు. ఈ క్రమంలోనే స్వయంగా ప్రగతి భవన్‌కు పిలిచారు. పార్టీకి సహకరించాలని కోరారు. అంతే కాకుండా సస్పెన్షన్ ఎత్తివేశారు. రాబోయే రోజుల్లో పార్టీలో మంచి స్థానం కల్పిస్తానని కూడా హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. వేనేపల్లి కూడా సీఎం చెప్పినట్లే చేస్తానని మాటిచ్చారు. మొత్తానికి మునుగోడులో టీఆర్ఎస్ గెలుపున‌కు అడ్డంగా ఉన్న సమస్యలన్నింటినీ స్వయంగా కేసీఆర్ చక్కబెడుతున్నారు. ఇది స్థానిక క్యాడర్‌లోనూ ఉత్సాహాన్ని తీసుకొస్తోంది.

First Published:  14 Aug 2022 9:53 AM GMT
Next Story