Telugu Global
Telangana

బీఆర్ఎస్ ని గెలిపిస్తే వేములవాడ దత్తత తీసుకుంటా..

బక్క పలచని కేసీఆర్ ని కొట్టేందుకు ఎక్కడెక్కడినుంచో నేతలు వస్తున్నారని, కానీ సింహం సింగిల్ గానే వస్తుందని.. పందులు మాత్రమే గుంపులు గుంపులుగా వస్తాయన్నారు కేటీఆర్.

బీఆర్ఎస్ ని గెలిపిస్తే వేములవాడ దత్తత తీసుకుంటా..
X

బీఆర్ఎస్ ని గెలిపిస్తే వేములవాడ దత్తత తీసుకుంటా..

వేములవాడలో ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ ని కాదని, చెల్మెడ లక్ష్మీనరసింహారావుని బీఆర్ఎస్ బరిలో దింపింది. చెల్మెడ తరపున వేములవాడకు ప్రచారం కోసం వచ్చారు మంత్రి కేటీఆర్. బీఆర్ఎస్ ను మరోసారి గెలిపిస్తే ఆ నియోజకవర్గాన్ని తాను దత్తత తీసుకుంటానన్నారు. గెలిపించకపోతే మాత్రం ఇక్కడకు రాను అంటూ సరదాగా వ్యాఖ్యానించారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు మంత్రి కేటీఆర్. దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ అంటూ ఇటీవల రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేశారాయన. రాహుల్ ఛాలెంజ్ కి తాను సిద్దంగా ఉన్నానని చెప్పారు. ఢిల్లీ దొరలకు, తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్న ఎన్నికల్లో ఎవరు గెలిచేది డిసెంబర్ లో చూద్దామన్నారు కేటీఆర్.

హైదరాబాద్ లో ఇడ్లీ సాంబార్ గ్యో బ్యాక్ అంటూ అప్పుడు ఉద్యమం జరిగిందని గుర్తు చేశారు కేటీఆర్. ముదనష్టపు కాంగ్రెస్ 370 మంది తెలంగాణ ఉద్యమకారులను బలిదానం కోరిందని చెప్పారు. 2001 నుండి 2014 వరకు అన్నం తిన్నాడో, అటుకులు బుక్కాడో.. కేసీఆర్ ఉద్యమం చేసి తెలంగాణ తీసుకొచ్చారని అన్నారు. ఈ ఎన్నికలు తమ కోసం కాదని, తెలంగాణ ప్రజల కోసం అని చెప్పారు. ఇక్కడ తమ పోరాటం నిలబడ్డ వ్యక్తి తో కాదని, కాంగ్రెస్ తో మాత్రమేనని వివరించారు కేటీఆర్.

బక్క పలచని కేసీఆర్ ని కొట్టేందుకు ఎక్కడెక్కడినుంచో నేతలు వస్తున్నారని, కానీ సింహం సింగిల్ గానే వస్తుందని.. పందులు మాత్రమే గుంపులు గుంపులుగా వస్తాయన్నారు కేటీఆర్. డీకే శివకుమార్ ఇక్కడికి వచ్చి కర్నాటకలో కరెంటు సంగతులు చెప్పి మన నెత్తిన పాలుపోసి వెళ్లాడని, అందుకే ఆయన్ను ఇక ప్రచారానికి కాంగ్రెస్ పిలవడం లేదని చెప్పారు. బేకర్ గాళ్లు మనకు అవసరమా? అని ప్రశ్నించారు. ఇక్కడ లక్ష్మీనరసింహావుని గెలిపిస్తున్నామని ప్రజలు అనుకోవద్దని, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి వేసే ఓటు కేసీఆర్ ని గెపిలించడానికేనని చెప్పారు కేటీఆర్.

First Published:  6 Nov 2023 10:11 AM GMT
Next Story