Telugu Global
Telangana

'క్యూనెట్'కు సానియా ప్రచారాన్ని తప్పుబట్టిన వీసీ సజ్జనార్

'క్యూనెట్'కు ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ప్రచారం చేయడంపై పలువురు వినియోగదారులు మండిపడుతున్నారు.

క్యూనెట్కు సానియా ప్రచారాన్ని తప్పుబట్టిన వీసీ సజ్జనార్
X

దేశంలో మల్టీలెవెల్ మార్కెటింగ్ (ఎంఎల్ఎం)కు వ్యతిరేకంగా చట్టాలు ఉండటంతో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ (డీఎస్‌సీ) పేరుతో వ్యాపారం నిర్వహిస్తున్న 'క్యూనెట్'పై ఈడీ కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. 'క్యూనెట్'లో చేరి తమ ఉత్పత్తులు విక్రయిస్తే భారీగా లాభాలు వస్తాయని చెప్తూ మదుపరులను భారీగా మోసం చేసింది. అంతే కాకుండా ఉత్పత్తుల విక్రయానికి మహిళల చేత అసభ్యకరమైన పనులకు కూడా ఏజెంట్లు ప్రోత్సహించారు. తాము పెట్టుబడి పెడుతున్న డబ్బులు అన్నీ షెల్ కంపెనీల ద్వారా చేతులు మారుతున్న విషయం కూడా స్కీమ్‌లో చేరే వారికి తెలియదు. దీంతో 'క్యూనెట్' పట్ల అప్రమత్తంగా ఉండాలని ఈడీ ప్రకటన విడుదల చేసింది. అంతే కాకుండా ఆ సంస్థకు చెందిన 36 బ్యాంకు ఖాతాలను కూడా ఫ్రీజ్ చేసింది.

'క్యూనెట్'కు ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ప్రచారం చేయడంపై పలువురు వినియోగదారులు మండిపడుతున్నారు. వెంటనే ఈ సంస్థకు ప్రచారం చేయడం మానుకోవాలంటూ పలు చోట్ల మదుపర్లు బ్యానర్లు కట్టారు. మోసకారులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కూడా స్పందించారు. సానియా మీర్జా ఇలా ప్రచారం చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఎంఎల్ఎం కంపెనీలకు సెలెబ్రిటీలు ప్రచారం చేయడం, మద్దతు తెలపడం సరికాదని హితవు పలికారు.

ఇలాంటి సంస్థల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతింటోందని, మధ్యతరగతి, పేదలు ఈ స్కీముల కారణంగా తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన గుర్తు చేశారు. గతంతో సైబరాబాద్ సీపీగా ఉన్న సమయంలో 'క్యూనెట్'తో పాటు ఇలాంటి ఇతర సంస్థలపై సజ్జనార్ కఠిన చర్యలు తీసుకున్నారు. అందుకే ఇలాంటి స్కీముల జోలికి ఎవరూ వెళ్లవద్దని ఆయన సూచిస్తున్నారు. 2019 జనవరిలో 'క్యూనెట్' మోసాలు వెలుగులోకి వచ్చాయి. అప్పుడు సైబరాబాద్ సీపీగా ఉన్న సజ్జనార్ ప్రత్యేకంగా ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్‌ను ఏర్పాటు చేసి ఆ సంస్థపై కఠిన చర్యలు తీసుకున్నారు. పలువురు మోసగాళ్లను అరెస్టు కూడా చేశారు.

అప్పటి నుంచి 'క్యూనెట్' తమ కార్యకలాపాలను కొంత కాలం ఆపేసింది. కానీ, తాజాగా మరోసారి మదుపరులను చేర్చుకోవడం మొదలు పెట్టింది. ఈడీ కూడా 'క్యూనెట్'కు చెందిన రూ.90 కోట్లను ఫ్రీజ్ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

First Published:  30 Jan 2023 3:28 AM GMT
Next Story