Telugu Global
Telangana

వడ కొంటే నూనె ఫ్రీ.. వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఆఫర్!

విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య వందేభారత్ సూపర్ ఫాస్ట్ ట్రెయిన్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

వడ కొంటే నూనె ఫ్రీ.. వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఆఫర్!
X

వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఏంటీ.. వడ కొంటే నూనె ఫ్రీ ఏంటి? అని ఆశ్చర్యపోతున్నారా? అయినా ట్రెయిన్‌లో నూనె ఎందుకు ఫ్రీగా ఇస్తారు? రైల్వే శాఖ ఈ ఆఫర్ ఎప్పుడు ప్రకటించిందా అని బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారా? కాసేపు ఆగండి. మీ డౌట్‌ను ఇప్పుడే తీరుస్తాం. వడ కొంటే నూనె ఫ్రీ అని మేం చెప్పడం కాదు. వందే భారత్‌లో జర్నీ చేసిన ప్రయాణికులు చెబుతున్నారు. రైల్వే శాఖపై కోపంతో ఇలా సెటైర్లు వేస్తున్నారు.

ఇటీవలే విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య వందేభారత్ సూపర్ ఫాస్ట్ ట్రెయిన్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. వేగంగా గమ్య స్థానానికి చేర్చడమే కాకుండా, ఎన్నో అద్భుతమైన సౌకర్యాలు కూడా ఉన్నాయి. అయితే ఈ రైల్లో ఇచ్చే ఫుడ్ విషయంలో మాత్రం ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంత లగ్జరీ ట్రెయిన్‌లో నాసిరకం వంటకాలను సప్లయ్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

వైజాగ్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ ప్రయాణికుడు జర్నీ టైంలో ఆకలేసి వడ ఆర్డర్ చేశాడు. రైల్లోని క్యాటరింగ్ సిబ్బంది అతడికి సప్లై చేసిన వడను చూసి అవాక్కయ్యాడు. ఆయిల్‌లో ముంచి తీసినట్లుగా కనపడింది. గులాబ్ జామ్‌ను చక్కెర పాకంలో నానబెట్టిన విధంగానే.. వడను నూనెలో నానబెట్టి ఇచ్చినట్లుగా ఉన్నది. ఆ ప్రయాణికుడు సదరు వడను గట్టిగా పిసకగా గంటెడు నూనె బయటకు వచ్చింది. ఇలాంటి వడను ఎలా తింటారంటూ సదరు ప్రయాణికుడు సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

ఆ ప్రయాణికుడు పెట్టిన ఫొటో వైరల్‌గా మారింది. వందేభారత్‌లో వడ కొంటే నూనె ఫ్రీ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇలాంటి వడ రోజుకు ఒకటి తింటే ఆ మనిషి ఆరోగ్యం మటాష్ అంటూ మరి కొందరు సెటైర్లు వేస్తున్నారు. భారీగా టికెట్ ధర ఉన్నా.. క్వాలిటీ ఫుడ్ అందించకపోవడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. అదన్నమాట సంగతి.




First Published:  4 Feb 2023 5:41 AM GMT
Next Story