Telugu Global
Telangana

భట్టిపై విసుర్లు.. రేవంత్ పై ప్రశంసలు

సీఎం రేవంత్ రెడ్డికి తాను మద్దతు ఇవ్వడం కొందరికి నచ్చడం లేదని అన్నారు వీహెచ్. సీఎం పనిచేస్తున్నారు కాబట్టే తాను సపోర్ట్ చేస్తున్నానని చెప్పారు.

భట్టిపై విసుర్లు.. రేవంత్ పై ప్రశంసలు
X

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముందు తనను ఖమ్మంలో పోటీ చేయమని చెప్పారని, ఇప్పుడు ఆయన భార్యకు టిక్కెట్ కావాలని అడుగుతున్నారని అన్నారు వి.హనుమంతరావు. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం పార్టీ హైకమాండ్ టికెట్ ఇస్తే కచ్చితంగా తన కోసం పని చేస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. భట్టి తనకు అడ్డొస్తున్నారని పరోక్షంగా ఆయనపై అసహనం వ్యక్తం చేశారు వీహెచ్. గాంధీభవన్ లో ప్రెస్ మీట్లు పెట్టేందుకు అనుమతి లేకపోవడంతో.. అవకాశం దొరికినప్పుడల్లా మీడియా ముందు తన గోడు వెళ్లబోసుకుంటున్నారాయన. ఖమ్మం సీటు విషయంలో మాత్రం తగ్గేది లేదంటున్నారు వీహెచ్.

సీటు అడిగా.. ఇవ్వకపోతే..!

ఖమ్మం సీటు విషయంలో వీహెచ్ మరీ అంత మొండి పట్టుదలకు పోవడంలేదు. తనకు టికెట్ కావాల్సిందేనంటున్న ఆయన.. ఇవ్వకపోయినా తానేం తిరుగుబాటు చేయనని స్పష్టం చేశారు. తనది కాంగ్రెస్ రక్తమని చెప్పారు వీహెచ్. 2019లోనే తాను ఖమ్మం నుంచి పోటీ చేయాలని ప్రయత్నం చేశానని చెప్పుకొచ్చారు. అక్కడ గ్రౌండ్ వర్క్ కూడా చేశానని, తనకు టికెట్ ఇస్తే కాంగ్రెస్ గెలిచినట్టేనని అన్నారు వీహెచ్.

అది కొందరికి నచ్చడంలేదు..

సోషల్ ఇంజినీరింగ్ విషయంలో బీజేపీ, బీఆర్ఎస్.. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయకుండా చూసుకోవాలని సూచించారు వీహెచ్. లోక్ సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. మోదీ ప్రభ తగ్గిపోతోందని, బీజేపీని ఎవరూ నమ్మడంలేదని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డికి తాను మద్దతు ఇవ్వడం కొందరికి నచ్చడం లేదని అన్నారు వీహెచ్. సీఎం పనిచేస్తున్నారు కాబట్టే తాను సపోర్ట్ చేస్తున్నానని చెప్పారు.

First Published:  11 April 2024 3:31 PM GMT
Next Story