Telugu Global
Telangana

తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం.. భట్టిపై వీహెచ్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో బీసీ ఓట్లు కాంగ్రెస్ కి అక్కర్లేదా అని ప్రశ్నించారు వీహెచ్. బీసీలకు పార్టీలో అన్యాయం జరుగుతోందని ఆరోపించారు.

తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం.. భట్టిపై వీహెచ్ సంచలన వ్యాఖ్యలు
X

లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ లో సీట్ల కుంపటి రాజుకునేలా ఉంది. ముఖ్యంగా ఖమ్మం సీటు విషయంలో అప్పుడే రచ్చ మొదలైంది. ఆ సీటుకి ప్రధాన పోటీదారుగా ఉన్న రేణుకా చౌదరికి రాజ్యసభ అవకాశం రావడంతో ఇప్పుడా స్థానంకోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ గెలిచే గ్యారెంటీ సీటు ఖమ్మం అనే ప్రచారం ఉంది. అటు రాహుల్ గాంధీని ఖమ్మంనుంచి పోటీ చేయించాలని రాష్ట్ర కాంగ్రెస్ ఆలోచిస్తున్నా, అది సాధ్యమయ్యేలా లేదు. ఈలోగా ఆశావహులు ఎవరికి వారే ఖమ్మంపై కర్చీఫ్ వేసి కూర్చున్నారు. సీనియర్ నేత వి.హన్మంతరావు ఖమ్మం సీటు విషయంలో తాజాగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను టార్గెట్ చేస్తూ వీహెచ్ విమర్శలు ఎక్కుపెట్టారు.

ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన వీహెచ్.. ఖమ్మం సీటు విషయంలో భట్టి విక్రమార్క తనకు అడ్డు తగులుతున్నారని ఆరోపించారు. తనకు భట్టి ద్రోహం చేస్తున్నారన్నారు వీహెచ్. అయితే ఆయన తనకు సీటు రాకుండా ఎందుకు అడ్డుకుంటున్నారో తెలియదంటున్నారు వీహెచ్. మొదట సీటు ఇస్తానన్నారని, కానీ ఇప్పుడు పట్టించుకోవడం లేదని విమర్శలుగుప్పించారు. ఈరోజు భట్టి డిప్యూటీ సీఎంగా ఉన్నారంటే దానికి తానే కారణం అని చెప్పారు వీహెచ్. అసలు భట్టిని మొదట్లో ఎమ్మెల్సీని చేసింది తానేనని చెప్పుకొచ్చారు.

కాంగ్రెస్ కి బీసీల ఓట్లు వద్దా..

తనను తాను బీసీలకు ప్రతినిధిగా చెప్పుకుంటున్న వీహెచ్.. తెలంగాణలో బీసీ ఓట్లు కాంగ్రెస్ కి అక్కర్లేదా అని ప్రశ్నించారు. బీసీలకు పార్టీలో అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. బీసీలను కేవలం ఓట్లు వేసే మిషన్లుగానే పరిగణిస్తున్నారా అని ప్రశ్నించారాయన. తాను ఖమ్మంకు లోకల్ కాదని కొంతమంది అంటున్నారని, అక్కడ గతంలో కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచినవారిలో చాలామంది లోకల్ కాదనే విషయం గుర్తుంచుకోవాలన్నారు వీహెచ్. పార్టీకోసం పదవులు ఆశించకుండా పనిచేసిన తనకు న్యాయం చేయాలని అన్నారాయన. తన కుటుంబం నుంచి ఎవరూ రాజకీయాల్లో లేరని, తాను పార్టీ మారే వ్యక్తిని కాదని, చనిపోయే వరకు కాంగ్రెస్ లోనే ఉంటానని చెప్పారు వీహెచ్. మరి వీహెచ్ మొర అధిష్టానం ఆలకిస్తుందో లేదో చూడాలి.

First Published:  10 March 2024 9:06 AM GMT
Next Story