Telugu Global
Telangana

నిజామాబాద్ ఐటీ హబ్‌కు యూఎస్ఏ కంపెనీ.. కేటీఆర్‌తో క్రిటికల్ రివర్ ప్రతినిధుల భేటీ

క్రిటికల్ రివర్ సంస్థ ప్రతినిధులు కేటీఆర్‌తో సమావేశం అయినట్లు గ్లోబల్ ఎన్ఆర్ఐ కో-ఆర్డినేటర్ మహేశ్ బిగాల వెల్లడించారు.

నిజామాబాద్ ఐటీ హబ్‌కు యూఎస్ఏ కంపెనీ.. కేటీఆర్‌తో క్రిటికల్ రివర్ ప్రతినిధుల భేటీ
X

తెలంగాణలో ఐటీ రంగం హైదరాబాద్‌కు మాత్రమే పరిమితం కావొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం రాష్ట్రంలోని టైర్-2 నగరాల్లో కూడా ఐటీ టవర్లు నిర్మించింది. ఇటీవలే నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఐటీ హబ్‌ను ప్రారంభించారు. ఇప్పటికే పలు సంస్థలు అక్కడి నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నాయి. తాజాగా అమెరికాకు చెందిన క్రిటికల్ రివర్ అనే సంస్థ నిజామాబాద్ ఐటీ హబ్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది.

యూఎస్ఏలో పర్యటిస్తున్న ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పలు సంస్థల ప్రతినిధులతో కలిసి పెట్టుబడులు ఆకర్షించడానికి చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలో క్రిటికల్ రివర్ సంస్థ ప్రతినిధులు కేటీఆర్‌తో సమావేశం అయినట్లు గ్లోబల్ ఎన్ఆర్ఐ కో-ఆర్డినేటర్ మహేశ్ బిగాల వెల్లడించారు. క్రిటికల్ రివర్ సంస్థ వ్యవస్థాపకులు అంజి మారంతో కేటీఆర్ సమావేశమయ్యారు. మరో వారం రోజుల్లోనే నిజామాబాద్‌లో కంపెనీ ఏర్పాటు చేయడానికి ఓకే చెప్పినట్లు మహేశ్ బిగాల స్పష్టం చేశారు.

ఇప్పటికే క్రిటికల్ రివర్ కంపెనీ ప్రతినిధులు నిజామాబాద్ ఐటీ హబ్‌ను స్థానిక ఎమ్మెల్యే గణేశ్ బిగాలతో కలిసి సందర్శించారు. నిజామాబాద్ ఐటీ టవర్‌లో మౌలిక వసతులు, కనెక్టివితో పాటు ఇతర సౌకర్యాలు అన్నీ ఉన్నాయని.. అందుకే వారం రోజుల్లోనే అక్కడ బ్రాంచ్ పెట్టేందుకు సిద్ధపడుతున్నట్లు క్రిటికల్ రివర్ ప్రతినిధులు కేటీఆర్‌కు చెప్పారు.

క్రిటికల్ రివర్ సంస్థలకు ఇప్పటికే కాలిఫోర్నియా, హైదరాబాద్, విజయవాడలో 1000 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు వీరికి నిజామాబాద్‌లో కూడా మరో బ్రాంచ్ ప్రారంభం కానున్నది. క్రిటికల్ రివర్ సంస్థ నిజామాబాద్‌కు వస్తుండటం పట్ల కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ కూడా పాల్గొన్నారు.

First Published:  27 Aug 2023 6:19 AM GMT
Next Story