Telugu Global
Telangana

దేశానికి సమగ్ర వ్యవసాయ విధానం తక్షణావసరం: నిరంజన్‌రెడ్డి

కేంద్రానికి రైతుల పట్ల దార్శనికత, సానుభూతి లేకపోవడం వల్ల మనదేశం ఇప్పటికీ పప్పులు, వంటనూనెలను దిగుమతి చేసుకోవాల్సి వస్తోందని తెలంగాణ‌ వ్యవసాయ శాఖ మంత్రి ఎస్ నిరంజన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

దేశానికి సమగ్ర వ్యవసాయ విధానం తక్షణావసరం: నిరంజన్‌రెడ్డి
X

దేశంలో వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణం సమగ్ర వ్యవసాయ విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని తెలంగాణ‌ వ్యవసాయ శాఖ మంత్రి ఎస్ నిరంజన్ రెడ్డి అన్నారు.

చిన్న, సన్నకారు రైతులు ఎక్కువగా వేసే పంటల ఉత్పత్తిని బలోపేతం చేసేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడాన్ని కేంద్రం ప్రోత్సహించాలని ఆయన అన్నారు.

శుక్రవారం హైదరాబాద్ లోని హైటెక్స్‌లో మూడు రోజుల కిసాన్ అగ్రి షో 2023ని ప్రారంభించిన నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ‌ ప్రభుత్వం ఎన్ని అభ్యర్థనలు చేసినప్పటికీ, మన వంటి వంటి వ్యవసాయ దేశానికి అవసరమైన‌ వ్యవసాయ విధానాన్ని కేంద్రం ఇంకా తీసుకురాలేదని మండిపడ్డారు.

కేంద్రానికి రైతుల పట్ల దార్శనికత, సానుభూతి లేకపోవడం వల్ల మనదేశం ఇప్పటికీ పప్పులు, వంటనూనెలను దిగుమతి చేసుకోవాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

వ్యవసాయ యాంత్రీకరణ, కొత్త ఆవిష్కరణలు, వ్యవసాయంలో ఆధునిక పద్ధతుల గురించి రైతులు తెలుసుకోవడానికి ఈ కిసాన్ అగ్రి షో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నిరంజన్ రెడ్డి తెలిపారు. ఇది సాగును మెరుగుపరచడానికి, పంట నష్టం,ఇన్‌పుట్ ఖర్చులను తగ్గించడానికి, పంట దిగుబడిని పెంచడానికి రైతులకు వీలు కల్పిస్తుందని ఆయన అన్నారు.

మూడు రోజులపాటు సాగే ఈ కిసాన్ అగ్రి షో 12,000 చ.మీ విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. ఈ షో లో 150 మందికి పైగా ఎగ్జిబిటర్లు తమ పరికరాలను ప్రదర్శించారు. ఈ షోకు తెలంగాణతో సహా పొరుగు రాష్ట్రాల నుండి కూడా 30,000 మంది కంటే ఎక్కువ మంది సందర్శకులు వస్తారని భావిస్తున్నారు.

First Published:  4 March 2023 1:54 AM GMT
Next Story