Telugu Global
Telangana

కేటీఆర్ చేతుల మీదుగా నేడు ఉప్పల్ స్కైవాక్ ప్రారంభం

660 మీటర్ల పొడవుతో ఉన్న ఈ స్కైవాక్ కి అనుసంధానంగా 9 లిఫ్ట్ లు ఏర్పాటు చేశారు. వందేళ్లపాటు సేవలందించే విధంగా పటిష్టంగా నిర్మాణం జరిగింది. 25కోట్ల రూపాయల ఖర్చుతో ఉప్పల్ స్కైవాక్ నిర్మించారు.

కేటీఆర్ చేతుల మీదుగా నేడు ఉప్పల్ స్కైవాక్ ప్రారంభం
X

హైదరాబాద్ లో మరో అద్భుత నిర్మాణంగా పేరు తెచ్చుకోబోతున్న ఉప్పల్ స్కైవాక్ ని ఈరోజు మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు. దేశంలో అత్యంత పొడవైన స్కైవాక్ ఇది. కాలు కిందపెట్టకుండా, ట్రాఫిక్ తో సంబంధం లేకుండా మొత్తం 6 లొకేషన్లు చుట్టిరావచ్చు. 660 మీటర్ల పొడవుతో ఉన్న ఈ స్కైవాక్ కి అనుసంధానంగా 9 లిఫ్ట్ లు ఏర్పాటు చేశారు. వందేళ్లపాటు సేవలందించే విధంగా పటిష్టంగా నిర్మాణం జరిగింది. 25కోట్ల రూపాయల ఖర్చుతో ఉప్పల్ స్కైవాక్ నిర్మించారు.


పెరుగుతున్న ట్రాఫిక్ తో పాదచారులు పడే ఇబ్బందుల్ని తొలగించేందుకు తెలంగాణ ప్రభుత్వం స్కైవాక్ లను నిర్మిస్తోంది. ఉప్పల్ జంక్షన్లో ఏ వైపు నుంచి ఎటు వెళ్లాలన్నా పాదచారులు కష్టపడేవారు. ఈ కష్టాలకు చెక్ పెడుతూ మెట్రో స్టేషన్, వివిధ బస్టాప్ లకు అనుసంధానంగా ఈ స్కైవాక్ ఏర్పాటు చేశారు. మెహదీపట్నంలో కూడా ఇదే తరహాలో స్కైవాక్ కి ప్రణాళికలు సిద్ధమైనా కంటోన్మెంట్ భూమి అడ్డుగా ఉంది. కంటోన్మెంట్ భూమి విషయంలో ఇప్పటికే కేంద్రానికి మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఆ భూమి అందుబాటులోకి వస్తే మెహదీపట్నంలో కూడా స్కైవాక్ అందుబాటులోకి వస్తుంది.

ఇప్పటికే నగరంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లు చాలా చోట్ల ఉన్నాయి. రద్దీ రోడ్లను దాటేందుకు చాలామంది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లను ఉపయోగించుకుంటుంటారు. అయితే ఉప్పల్ లాంటి జంక్షన్లలో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లతో పెద్దగా ఉపయోగం ఉండదు. ఓవైపు నుంచి ఇంకోవైపుకి వెళ్లాలంటే స్కైవాక్ లాంటి నిర్మాణాలు అవసరం. అందుకే ఈ భారీ స్కైవాక్ రూపుదిద్దుకుంది. తెలంగాణకు ఇది మరో ప్రత్యేకత కాబోతోంది.

First Published:  26 Jun 2023 2:26 AM GMT
Next Story