Telugu Global
Telangana

ఉప్పల్ ఫలితం నేడే.. ఎమ్మెల్యే ఇంట్లో కీలక సమావేశం

బీఆర్ఎస్ టికెట్లు దక్కనివారికి కచ్చితంగా న్యాయం చేస్తామని, ప్రత్యామ్నాయ పదవులు ఉంటాయని చెబుతున్నా కూడా కొంతమంది ఆవేశపడుతున్నారు. ఆ లిస్ట్ లో భేతి ఉంటారా లేదా అనేది ఈరోజుతో తేలిపోతుంది.

ఉప్పల్ ఫలితం నేడే.. ఎమ్మెల్యే ఇంట్లో కీలక సమావేశం
X

ఉప్పల్ ఫలితం నేడే.. ఎమ్మెల్యే ఇంట్లో కీలక సమావేశం

బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన తర్వాత అసంతృప్తుల్లో అలజడి మొదలైంది. వారికి గాలమేసి పట్టుకోడానికి ప్రతిపక్షాలు కూడా విపరీతమైన ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. తాజాగా ఉప్పల్ నియోజకవర్గంలో కూడా ఇలాంటి ఘటనే జరగబోతున్నట్టు తెలుస్తోంది. ఉప్పల్ సిట్టింగ్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డికి ఈసారి టికెట్ నిరాకరించారు. ఆయన స్థానంలో బండారి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. దీంతో ఎమ్మెల్యే భేతి వర్గం ఇప్పటికే పలు దఫాలుగా మంతనాలు సాగించింది. ఈరోజు ఎమ్మెల్యే ఇంట్లో కీలక మీటింగ్ జరుగుతుంది. దీని తర్వాత ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముంది.

భేతి సుభాష్ రెడ్డి బీఆర్ఎస్ లో కీలక నేత. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నారు. అయితే ఈ దఫా ఉప్పల్ విజయావకాశాలు పరిశీలించిన సీఎం కేసీఆర్.. బండారి లక్ష్మారెడ్డికి అవకాశమిచ్చారు. టికెట్లు దక్కనివారికి కచ్చితంగా న్యాయం చేస్తామని, ప్రత్యామ్నాయ పదవులు ఉంటాయని చెబుతున్నా కూడా కొంతమంది ఆవేశపడుతున్నారు. ఆ లిస్ట్ లో భేతి ఉంటారా లేదా అనేది ఈరోజుతో తేలిపోతుంది.

టికెట్లు ప్రకటించడానికి ఒకరోజు ముందు ఎమ్మెల్సీ కవిత దగ్గర ఉప్పల్ పంచాయితీ జరిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఇద్దరూ కవితకు విన్నపాలు వినిపించారు. తమ ఇద్దరిలో ఒకరికి టికెట్ ఇప్పించాలని కోరారు. అప్పటి వరకూ టికెట్ కోసం ఇద్దరూ పోటీ పడినా, చివరకు కలసిపోయారు, బండారి లక్ష్మారెడ్డికి టికెట్ పోకుండా ఉంటే చాలనుకున్నారు. కానీ, కేసీఆర్ లిస్ట్ అప్పటికే రెడీ అయిపోయింది. కవిత కూడా వారికి ఎలాంటి హామీ ఇవ్వలేకపోయారు. చివరకు ఉప్పల్ అభ్యర్థిగా బండారి పేరు బయటకొచ్చింది. ఈ ప్రకటనతో బొంతు రామ్మోహన్ సర్దుకుపోయినా, ఎమ్మెల్యే భేతి మాత్రం జీర్ణించుకోలేకపోయారు. సన్నిహితులతో కొన్నిరోజులుగా మంతనాలు సాగిస్తున్నారు.

పార్టీ మారతారా..?

సన్నిహితులతో తర్జన భర్జన అనంతరం ఈరోజు ఫైనల్ మీటింగ్ అని భేతి అనుచరులు డిసైడ్ అయ్యారు. ఆయన ఇంట్లోనే ఈరోజు కీలక సమావేశం జరుగుతుంది. ఎమ్మెల్యే భేతి పార్టీ మారతారా..? లేక బీఆర్ఎస్ లోనే ఉండి తన అవకాశం కోసం వేచి చూస్తారా..? అనేది ఈరోజు తేలిపోతుంది.

*

First Published:  29 Aug 2023 1:30 AM GMT
Next Story