Telugu Global
Telangana

తెలంగాణలో యూపీ ఫార్ములా.. బీజేపీ వ్యూహం ఫలించేనా?

బీజేపీ ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గంలో 11 వేల స్ట్రీట్ కార్నర్ సమావేశాలు నిర్వహిస్తోంది. దీని తర్వాత ప్రజా గోస - బీజేపీ భరోసా యాత్ర పేరుతో ప్రతీ మండలంలో బైక్ ర్యాలీలు నిర్వహించనున్నది.

తెలంగాణలో యూపీ ఫార్ములా.. బీజేపీ వ్యూహం ఫలించేనా?
X

తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా పాతాలని భావిస్తున్న బీజేపీ ఇందు కోసం అనేక వ్యూహాలు సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో బలంగా ఉన్న బీఆర్ఎస్‌ను ఓడించడం అంత తేలికైన విషయం కాదని బీజేపీకి తెలుసు. అందుకే గతంలో ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల సమయంలో అనుసరించిన వ్యూహాన్ని తెలంగాణలో అమలు చేస్తోంది. యూపీలో రెండో సారి అధికారంలోకి రావడానికి త్రిముఖ వ్యూహాన్ని సిద్ధం చేసి అమలు చేసింది. పోలింగ్ బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వివిధ దశల్లో సమావేశాలు, ర్యాలీలు, బహిరంగ సభలను నిర్వహించి అక్కడ మంచి ఫలితాన్నే రాబట్టింది. ఇప్పుడు ఇదే పద్దతిని తెలంగాణలో అమలు చేస్తోంది.

బీజేపీ ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గంలో 11 వేల స్ట్రీట్ కార్నర్ సమావేశాలు నిర్వహిస్తోంది. దీని తర్వాత ప్రజా గోస - బీజేపీ భరోసా యాత్ర పేరుతో ప్రతీ మండలంలో బైక్ ర్యాలీలు నిర్వహించనున్నది. 15 రోజుల్లో వీటిని పూర్తి చేసిన తర్వాత జిల్లా స్థాయి సభలు ఏర్పాటు చేయనున్నది. అవి కూడా పూర్తయిన తర్వాత రాష్ట్ర స్థాయిలో పార్టీ అగ్రనేతలతో భారీ బహిరంగ సభలకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ సభలకు ప్రధాని మోడీ కూడా వచ్చేలా ప్లాన్ చేస్తోంది. మొత్తానికి రాబోయే రెండు నెలల్లో రాష్ట్రంలోని ప్రతీ బూత్ స్థాయి కార్యకర్తను ఈ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేయనున్నది.

బూత్ స్థాయి నాయకులను ఇన్వాల్వ్ చేయడం వల్ల.. వాళ్లు మరింత చురుకుగా పని చేస్తారని.. రాబోయే ఎన్నికల్లో అది తప్పకుండా బీజేపీకి కలిసి వస్తుందని అంచనా వేస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యే లోపు ఇలా సభలు, ర్యాలీలు, సమావేశాలతో బీజేపీ బిజీగా ఉండబోతోంది. యూపీ ఫార్మాట్ తప్పకుండా తెలంగాణలో విజయవంతం అవుతుందని అంచనా వేస్తోంది.

కాగా, ఎన్ని సభలు, సమావేశాలు పెట్టినా బీజేపీకి ఉన్న అతి పెద్ద బలహీనత రాష్ట్రంలో సరైన నాయకత్వం లేకపోవడం, నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు దొరకక పోవడమే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇటీవల రాష్ట్ర నాయకులే బహిరంగంగా.. తమకు బలమైన అభ్యర్థులు లేరని ఒప్పుకున్నారు. తెలంగాణలో నాలుగైదు నియోజకవర్గాలను మినహా ఇస్తే.. మిగిలిన సెగ్మెంట్లలో బీజేపీకి బలమైన అభ్యర్థులు దొరకడం లేదు.

నిలబెట్టడానికి బలమైన, మంచి పాపులారిటీ కలిగిన అభ్యర్థులే లేని సమయంలో ఎన్ని వ్యూహాలు అమలు చేస్తే మాత్రం ఏం లాభమని పార్టీలో చర్చ జరుగుతున్నది. కేసీఆర్ వంటి బలమైన నేత, ఆయన వ్యూహాలను దాటి బీజేపీ ఆలోచించాల్సి ఉంటుందని బీజేపీలో చర్చ జరుగుతున్నది. కానీ కేవలం 10 నెలలే ఎన్నికలకు సమయం ఉన్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు బలమైన నేతలను తయారు చేసుకోవడం కూడా కష్టమే. ఇన్నాళ్లూ సమయం వృధా చేసి.. ఇప్పుడు త్రిముఖ వ్యూహం అంటూ క్షేత్ర స్థాయి కార్యకర్తలను పరుగులు పెట్టించినా లాభం ఉండదని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.

First Published:  12 Feb 2023 3:54 AM GMT
Next Story