Telugu Global
Telangana

కంటి వెలుగు రెండో విడతకు అనూహ్య స్పందన.. త్వరలోనే 1కోటి దాటనున్న సంఖ్య

మొదటి రోజే కంటి వెలుగు కార్యక్రమంలో 1.60 లక్షల మందికి పరీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకు 47 రోజుల్లో 96.07 లక్షల మందికి కంటి పరీక్షలు చేయించుకున్నారు.

కంటి వెలుగు రెండో విడతకు అనూహ్య స్పందన.. త్వరలోనే 1కోటి దాటనున్న సంఖ్య
X

తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'కంటి వెలుగు' రెండో విడత కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఖమ్మంలో నాలుగు రాష్ట్రాల సీఎంల చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభమైన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో 16,000కు పైగా కేంద్రాలను ఏర్పాటు చేసి.. 1500 బృందాలను ఈ కార్యక్రమం కోసం నియమించింది. కంటి వెలుగు కార్యక్రమం ద్వారా ఆసుపత్రుల్లో ఇతర సేవలకు ఆటంకాలు కలుగకుండా సిబ్బందిని అడ్జెస్ట్ చేసింది.

మొదటి రోజే కంటి వెలుగు కార్యక్రమంలో 1.60 లక్షల మందికి పరీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకు 47 రోజుల్లో 96.07 లక్షల మందికి కంటి పరీక్షలు చేయించుకున్నారు. త్వరలోనే ఈ సంఖ్య 1 కోటికి చేరుకుంటుందని అధికారులు చెబుతున్నారు. కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభానికి ముందే 100 పని దినాల్లో 1.70 కోట్ల మందికి పరీక్షలు చేయాలని లక్ష్యంగా పెట్టారు. అయితే 50 రోజులు కూడా కాకముందే దాదాపు ఒక కోటికి దగ్గరకు ఈ సంఖ్య చేరింది. జూన్ 15 నాటికి ఈ సంఖ్య 2 కోట్లకు చేరవచ్చని, ప్రభుత్వ లక్ష్యం కంటే ఎక్కువ మందే ఈ శిబిరాల్లో పరీక్షలు చేయించుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంలో ఇప్పటి వరకు 45 లక్షల మంది పురుషులు, 50 లక్షల మంది స్త్రీలు, 3,112 మంది ట్రాన్స్‌జెండర్లు పరీక్ష చేయించుకున్నారు. ఇక 15.65 లక్షల మందికి ఉచితంగా రీడింగ్ గ్లాసెస్ పంపిణీ చేశారు. మరో 11.68 లక్షల మందికి ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ (వారి సైట్‌కు అనుగుణంగా తయారు చేసిన అద్దాలు) అందించారు. అయితే పరీక్షలు చేయించుకున్న వారిలో 68.73 లక్షల మందికి ఎలాంటి కంటి జబ్బులు లేవని నిర్ధారించారు. రీడింగ్ గ్లాసెస్, ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్‌తో పాటు ఇతర కంటి ఇన్‌ఫెక్షన్లతో బాధపడే వారికి ఏ, డీ, బీ కాంప్లెక్స్ ట్యాబ్లెట్స్.. ఐ డ్రాప్స్ పంపిణీ చేశారు.

రాష్ట్రంలోని ప్రజలు కంటి సంబంధిత వ్యాధులతో బాధపడకూడదనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఈ బృహత్తర కార్యక్రమాన్ని రూపొందించారు. చాలా మంది డబ్బులు లేక, సరైన అవగాహన లేక కంటి వ్యాధులను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇలాంటి వారి కోసమే ఈ కార్యక్రమం రూపొందింది. ప్రతీ గ్రామంలో కంటి వెలుగు శిబిరాలు ఏర్పాటు చేస్తూ.. ప్రతీ ఒక్కరికి కంటి పరీక్షలు చేస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇలాంటి కార్యక్రమాన్ని అమలు చేయలేదు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు లాంటి కార్యక్రమాలు ప్రతీ రాష్ట్రంలో జరగాలని ఢిల్లీ సీఎం కేజ్రివాల్ కూడా వ్యాఖ్యానించారు.

2018లో మొదటి విడత కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించినప్పుడు 1.5 కోట్ల మందికి పరీక్షలు నిర్వహించి 50 లక్షల ఉచిత రీడింగ్ గ్లాసెస్ పంపిణీ చేశారు. కానీ రెండో విడతలో మాత్రం కేవలం అద్దాల పంపిణీతో ఆగిపోలేదు. అవసరం అయితే సర్జరీలు కూడా ఉచితంగా చేస్తున్నారు. అలాగే క్లిష్టమైన కంటి జబ్బులు, హై పవర్ గ్లాసెస్ అవసరమైన వారికి కూడా ఉచితంగా సేవలు అందిస్తున్నారు. ఇలాంటి వారిని ప్రభుత్వ కంటి వైద్యశాలలు.. ఇతర ఆసుపత్రులకు పంపించి చికిత్స అందిస్తున్నారు.

First Published:  2 April 2023 1:47 AM GMT
Next Story