Telugu Global
Telangana

తెలంగాణ తప్పులు వెదికేందుకు నిర్మలమ్మ ఆపసోపాలు..

తెలంగాణపై అంత అక్కసు ఎందుకని, గతంలో కేసీఆర్, కేటీఆర్ సంధించిన ప్రశ్నలకు ఆర్థిక మంత్రి ఎప్పుడు సమాధానం చెబుతారంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.

తెలంగాణ తప్పులు వెదికేందుకు నిర్మలమ్మ ఆపసోపాలు..
X

తెలంగాణ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో పుట్టే ప్రతి బిడ్డపై లక్ష రూపాయల అప్పు ఉందని అన్నారామె, తెలంగాణలో అమలవుతున్న పథకాలపై విమర్శలు ఎక్కుపెట్టారు, కేంద్ర పథకాల పేర్లు మారుస్తున్నారని, రాష్ట్రంలో రైతుల అప్పులు తీర్చలేదని విమర్శించారు. కేసీఆర్ కేంద్రమంత్రిలాగా భారత యాత్రలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. అయితే ఈ విమర్శలకు అప్పుడే సోషల్ మీడియాలో కౌంటర్లు మొదలయ్యాయి. తెలంగాణపై అంత అక్కసు ఎందుకని, గతంలో కేసీఆర్, కేటీఆర్ సంధించిన ప్రశ్నలకు ఆర్థిక మంత్రి ఎప్పుడు సమాధానం చెబుతారంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. కేంద్రం తప్పుల్ని కవర్ చేసుకోవ‌డానికి నిర్మలమ్మ ఆపసోపాలు పడుతున్నారని కౌంటర్లిచ్చారు.

తప్పులెన్నువారు..

తప్పులెన్నువారు తమ తప్పులెరగరు అన్నట్టుగా తెలంగాణ అప్పుల గురించి ఆందోళన చెందుతున్న కేంద్రం తన పరిధి ఏంటో తాను గుర్తించిందా అనే ప్రశ్న వినపడుతోంది. అప్పుల్లో భారత్ ఎప్పుడో పరిధి దాటింది, ఆర్థికరంగం కుదేలైంది. జీడీపీ తగ్గిపోయి, రూపాయి విలువ పడిపోయి.. ఇప్పుడు భారత్, బంగ్లాదేశ్ కంటే దీనస్థితికి వచ్చి చేరింది. కనీసం సైన్యానికి ఇచ్చేందుకు జీతాలులేక అగ్నిపథ్ అంటూ కవర్ చేసుకుంటున్న స్థితి భారత్ ది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ల రేటు గురించి ఎప్పుడూ మాట్లాడని నిర్మలమ్మ, జీఎస్టీ బాదుడుతో ప్రజలను ఇబ్బంది పెట్టడం అలవాటైపోయిన నిర్మలమ్మ ఇప్పుడిలా తెలంగాణ తప్పులెన్నడం ఏంటని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.

తెలంగాణలో రైతుబంధు వచ్చిన తర్వాతే, కేంద్రం పీఎం కిసాన్ ప్రవేశ పెట్టింది. తెలంగాణలో దళితబంధు ఉంది, కేంద్రానికి ఆ ఊసే లేదు. తెలంగాణలో ఇంటింటికీ మంచినీరు అందుతోంది, కేంద్రం మాటలే కానీ చేతల్లో ఆ పని చేయలేకపోయింది. మోదీ 2014 ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు కాలేదనేది వాస్తవమే అయినా.. వాటిపై మాట్లాడని నిర్మలా సీతారామన్, తెలంగాణ గురించి వేలెత్తి చూపించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

పర్యటనల గురించి మీరా చెప్పేది..?

ఇటీవల తెలంగాణపై బీజేపీ నేతల దండయాత్రలు చూస్తునే ఉన్నారు. అమిత్ షా, నడ్డా.. ఇలా పిలిస్తే అలా పలికేలా ఉన్నారు. ఇక కేంద్ర మంత్రులు కూడా అవకాశం వచ్చినప్పుడల్లా హైదరాబాద్ లో దర్శనమిస్తున్నారు. బీజేపీ సమావేశాల సమయంలోనే కాదు, అంతకు ముందు, ఆ తర్వాత కూడా బీజేపీ జాతీయ నేతలు తెలగాణకు క్యూ కడుతున్నారు. ఇదంతా దేనికోసం. తెలంగాణలో బీజేపీ బలం పెంచుకోడానికే కదా. అలాంటి బీజేపీ.. కేసీఆర్ బీహార్ వెళ్తే ఉలిక్కిపడటం దేనికి..? పక్క రాష్ట్రాల్లో పర్యటించాలంటే కేంద్రమంత్రి అనే హోదాయే కావాలా..? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మరో రాష్ట్ర ముఖ్యమంత్రితో కలిస్తే.. కేంద్రానికి అంత భయమెందుకు..? బీజేపీలో ఎలాగూ అలాంటి స్వాతంత్రం లేదు, కనీసం సమాఖ్య స్ఫూర్తిని అయినా దృష్టిలో ఉంచుకోవాలి కదా అనే విమర్శలు వినపడుతున్నాయి. మొత్తమ్మీద కేసీఆర్ పర్యటనపై బీజేపీ కాస్త ఆలస్యంగా స్పందించినట్టయింది. కామారెడ్డి పర్యటనలో ఉన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. తెలంగాణ ప్రభుత్వంపై తమ అక్కసునంతా ఇలా వెళ్లగక్కారు.

First Published:  2 Sep 2022 2:22 AM GMT
Next Story