Telugu Global
Telangana

ప్రచారం పిచ్చి పీక్స్.. ఆస్పత్రిలో మోదీ ఫొటో లేదని చిందులేసిన కేంద్రమంత్రి

రేషన్ షాపులో మోదీ ఫొటో లేదంటూ నిన్న నిర్మలా సీతారామన్ రెచ్చిపోతే, ఈరోజు ఆస్పత్రిలో ఆయన ఫొటో లేదని మహేంద్రనాథ్ పాండే హడావిడి చేశారు. చూస్తుంటే కేంద్ర మంత్రులు, మోదీ ఫొటోల కోసమే తెలంగాణలో పర్యటిస్తున్నట్టు అనిపిస్తోంది.

ప్రచారం పిచ్చి పీక్స్.. ఆస్పత్రిలో మోదీ ఫొటో లేదని చిందులేసిన కేంద్రమంత్రి
X

తెలంగాణలో పర్యటిస్తున్న కేంద్రమంత్రులు ప్రధాని మోదీ ఫొటోల కోసం రచ్చ చేస్తున్నారు. నిన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ రేషన్ షాపులో మోదీ ఫొటో లేదని ఐఏఎస్ అధికారిపై ఎగిరిపడ్డారు. నేడు మరో మంత్రి మహేంద్రనాథ్ పాండే ఆస్పత్రిలో మోదీ ఫొటో లేదంటూ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మోదీ ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలని హుకుం జారీ చేశారు.

ఏం జరిగిందంటే..?

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పాత పాలమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్ర నాథ్ పాండే సందర్శించారు. బీజేపీ నాయకులు డీకే అరుణ, జితేందర్ రెడ్డి కూడా ఆయన వెంట ఉన్నారు. ఆసుపత్రిలో రోగులను పరామర్శించడంతోపాటు, సదుపాయాల గురించి ఆరా తీశారు. అక్కడి వరకు బాగానే ఉంది, ఆ తర్వాతే మొదలైంది అసలు పేచీ. కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రంలోకి వచ్చిన ఆయన, అక్కడ ఫ్లెక్సీపై మోదీ ఫొటో లేకపోవడంతో షాకయ్యారు. దేశమంతా మోదీ ఫొటోలు పెడుతున్నామని, ఇక్కడ మాత్రం ఆయన ఫొటో ఎందుకు లేదని సిబ్బందిని నిలదీశారు. వెంటనే మోదీ ఫొటో పెట్టాలని చెప్పారు. దేశమంతా మోదీని గౌరవిస్తుంటే తెలంగాణలో మాత్రం ఆయన్ను అగౌరవ పరుస్తున్నారంటూ ఫీలయ్యారు మంత్రి మహేంద్ర నాథ్ పాండే.

టీకా సర్టిఫికెట్ చూడండి..

కొవిడ్ వ్యాక్సిన్ విషయంలో ఇప్పటికే మోదీ ప్రచారం పీక్స్ కి చేరింది. టీకా సర్టిఫికెట్ లో మోదీ బొమ్మ వేసి మరీ జారీ చేస్తున్నారు. మహబూబ్ నగర్ ఆస్పత్రిలో కూడా టీకా కేంద్రంలో మోదీ బొమ్మతోటే సర్టిఫికెట్ ఇస్తున్నారు. సర్టిఫికెట్ పై బొమ్మ ఉంది కదా, మరి ఫ్లెక్సీలో లేదేంటి అనేది కేంద్ర మంత్రి లాజిక్. అక్కడికేదో మోదీయే కొవిడ్ వ్యాక్సిన్ కనిపెట్టినట్టు, ఆయన సొంత ఖర్చుతో టీకా వేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చారాయన. వ్యాక్సినేషన్ అనేది ప్రభుత్వ విధి. కానీ, ఇక్కడ ఉచిత వ్యాక్సిన్ మోదీ పుణ్యమేననే ప్రచారం జరుగుతోంది.

రేషన్ షాపులో మోదీ ఫొటో లేదంటూ నిన్న నిర్మలా సీతారామన్ రెచ్చిపోతే, ఈరోజు ఆస్పత్రిలో ఆయన ఫొటో లేదని మహేంద్రనాథ్ పాండే హడావిడి చేశారు. చూస్తుంటే కేంద్ర మంత్రులు, మోదీ ఫొటోల కోసమే తెలంగాణలో పర్యటిస్తున్నట్టు అనిపిస్తోంది. ఎక్కడెక్కడ మోదీ ఫొటోలు లేవో అక్కడ రచ్చ మొదలు పెడుతున్నారు. మోదీ భక్తిని చాటుకుంటున్నారు.

First Published:  3 Sep 2022 9:31 AM GMT
Next Story