Telugu Global
Telangana

బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశంసించిన కేంద్రం

దేశవ్యాప్తంగా కూడా భూగర్భ జలాలు 2.62శాతం పెరిగినట్లు కేంద్ర జల్‌ శక్తి శాఖ వెల్లడించింది. గత ఏడాది 437.6 BMC మేర ఉన్న భూగర్భ జలాలు ఈ ఏడాది 449.08 BMCలకు చేరినట్లు కేంద్ర నివేదిక తెలిపింది.

బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశంసించిన కేంద్రం
X

బీఆర్ఎస్ ప్రభుత్వ కృషిని మరోసారి కేంద్రం ప్రశంసించింది. భూగర్భ జలాల పెరుగుదలలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవ, దాని వల్ల వచ్చిన ఫలితాలను అభినందించింది. దేశవ్యాప్తంగా భూగర్భ జలాల పెరుగుదలలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. తెలంగాణలో జలవనరుల నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చూపించిన చొరవతోనే ఈ ఘనత సాధ్యమైనట్టు నివేదిక విడుదల సమయంలో కేంద్రం తెలిపింది.

2022తో పోలిస్తే తెలంగాణలో భూగర్భ జలాలు 8.79 శాతం పెరిగాయి. గత ఏడాది 21.27 బిలియన్ క్యూబిక్ మీటర్లు(BMC) ఉన్న భూగర్భ జలాలు 2023లో 23.14 BMCకు చేరాయి. ప్రతి ఏడాదీ భూగర్భం నుంచి తోడుకొని వాడుకొనే నీటి నిల్వలు కూడా 19.25 నుంచి 20.92 BMCలకు (8.67శాతం) పెరిగినట్లు నేషనల్‌ కంపైలేషన్‌ ఆన్‌ డైనమిక్‌ గ్రౌండ్‌ వాటర్‌ రిసోర్సెస్‌ ఆఫ్‌ ఇండియా - 2023 నివేదిక పేర్కొంది. అదే సమయంలో భూగర్భ జలాల వాడకం మాత్రం 41.6శాతం నుంచి 38.65 శాతానికి తగ్గినట్లు తెలిపింది. మిషన్‌ కాకతీయ వంటి పథకాల ద్వారా ప్రభుత్వం నీటి సంరక్షణ చర్యలు చేపట్టడం వల్ల ఈ ఘనత సాధ్యమైందని కేంద్రం ప్రశంసించింది. సాగునీటి అవసరాలకు ఉపరితల జలాల లభ్యత పెరగడం, మిషన్‌ భగీరథ పథకం ద్వారా సురక్షిత మంచినీరు సరఫరా చేపట్టడం, రాష్ట్రవ్యాప్తంగా గత ఏడాది సమృద్ధిగా వర్షాలు కురవడం భూగర్భ జలాలు పెరగడానికి ప్రధాన కారణాలుగా నివేదిక పేర్కొంది.

దేశవ్యాప్తంగా భూగర్భ జలాల పెరుగుదల..

దేశవ్యాప్తంగా కూడా భూగర్భ జలాలు 2.62శాతం పెరిగినట్లు కేంద్ర జల్‌ శక్తి శాఖ వెల్లడించింది. గత ఏడాది 437.6 BMC మేర ఉన్న భూగర్భ జలాలు ఈ ఏడాది 449.08 BMCలకు చేరినట్లు కేంద్ర నివేదిక తెలిపింది. నికరంగా 11.48 BMC మేర దేశంలో భూగర్భ జలాలు పెరిగాయి. దేశంలో అత్యధికంగా తెలంగాణ, పశ్చిమబెంగాల్‌, అసోం, ఛత్తీస్‌గ‌ఢ్‌, కర్నాటక, గుజరాత్‌, బీహార్‌ లో భూగర్భ జలాలు పెరిగాయి.

*

First Published:  2 Dec 2023 4:34 AM GMT
Next Story