Telugu Global
Telangana

ఇవేం కష్టాలురా నాయనా.. తల పట్టుకుంటున్న రాజగోపాల్ రెడ్డి

ఎన్నికలు వచ్చిన సంగతి మునుగోడు పరిధిలోని వృద్ధులు, మహిళలకు తెలుసు. కానీ రాజగోపాల్ రెడ్డి పార్టీ మారినట్లు కానీ, బీజేపీ తరపున పోటీ చేస్తున్నట్లు కానీ పెద్దగా వారికి రిజిస్టర్ కాలేదు.

ఇవేం కష్టాలురా నాయనా.. తల పట్టుకుంటున్న రాజగోపాల్ రెడ్డి
X

మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అనుకోని కష్టాలు ఎదురయ్యాయి. వాటిని ఎలా పరిష్కరించాలో కూడా ఆయనకు అర్థం కావడం లేదు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి కుటుంబం తెలియని వారుండరు. మొదటి నుంచి కాంట్రాక్టర్లుగా ఉన్న వీరిద్దరూ.. కాంగ్రెస్ పార్టీ కారణంగా రాజకీయాల్లో ఎదిగారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో అన్న వెంకటరెడ్డి నల్గొండ జిల్లాలో తిరుగులేని శక్తిగా ఎదిగారు. ఆ తర్వత తమ్ముడు రాజగోపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రజలకు చేరువయ్యారు. మొన్న వెంకటరెడ్డి వ్యాఖ్యానించినట్లు.. జిల్లాలో కోమటిరెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీనే. దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఈ కుటుంబం కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. మునుగోడులో మహిళలు, వృద్ధులు కూడా కోమటిరెడ్డి పేరు చెప్పగానే కాంగ్రెస్ అనే అంటుంటారు. ఇప్పుడు ఇదే రాజగోపాల్‌కు పెద్ద అడ్డంకిగా మారింది.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు బీజేపీలో చేరి మునుగోడు ఉపఎన్నికను ఎదుర్కుంటున్నారు. నియోజకవర్గంలో తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. అయితే, ఎన్నికలు వచ్చిన సంగతి సెగ్మెంట్ పరిధిలోని వృద్ధులు, మహిళలకు తెలుసు. కానీ ఆయన పార్టీ మారినట్లు కానీ, బీజేపీ తరపున పోటీ చేస్తున్నట్లు కానీ పెద్దగా వారికి రిజిస్టర్ కాలేదు. రాజగోపాల్ రెడ్డి ఇంకా కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నట్లు భావిస్తున్నారు. దీంతో ప్రచారానికి వెళ్లిన బీజేపీ కార్యకర్తలకు అనుకోని అవాంతరాలు ఎదురవుతున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తామర పువ్వు గుర్తుకు ఓటెయ్యాలని చెబుతుంటే.. మాకు తెలుసు కోమటిరెడ్డిది హస్తం గుర్తు అని అంటున్నారు. చదువుకోని, రాజకీయాలపై అవగాహన లేని వ్యక్తులు కూడా కోమటిరెడ్డిది హస్తం గుర్తే అని చెబుతుండటంతో తలలు పట్టుకుంటున్నారు.

క్షేత్రస్థాయిలో ఉన్న ఈ ఇబ్బందిని రాజగోపాల్ రెడ్డితో పాటు బీజేపీ పెద్దలకు చెప్పారు. ఇప్పుడు ఎంత ప్రయత్నించినా వారి మనసును మార్చే దారి దొరకడం లేదు. ఎవరైనా పువ్వు గుర్తు అని చెబితే.. మాకు అబద్దాలు చెప్పకు, ఎవరికి ఓటెయ్యాలో మాకు తెలుసని పెద్దోళ్లు చెప్తుంటే బీజేపీ కార్యకర్తలకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరినా.. ఆయన హైదరాబాద్‌లో ప్రెస్ మీట్లు పెట్టడానికే పరిమితం అయ్యారు. ఉపఎన్నిక షెడ్యూల్ వచ్చే వరకు అసలు నియోజకవర్గంలో పర్యటించలేదు. ఇప్పుడు అకస్మాతుగా పువ్వు గుర్తుకు అంటూ ప్రచారం చేసినా జనాల్లో పెద్దగా స్పందన రావడం లేదని తెలుస్తోంది. కోమటిరెడ్డిపై అభిమానం కాస్తా కాంగ్రెస్‌ను గెలిపిస్తుందా అనే కొత్త అనుమానాలు మొదలయ్యాయి. ఇంత డబ్బు పంచుతున్నా.. చివరకు వెళ్లి హస్తం గుర్తుకు ఓటేస్తారేమో అనే ఆందోళన రాజగోపాల్ రెడ్డికి తలనొప్పిగా మారింది.

బరిలో మరో కోమటిరెడ్డి..

ఒకవైపు కాంగ్రెస్ అభిమానం, హస్తం గుర్తు ఇబ్బంది పెడుతుంటే.. మరోవైపు చివరి రోజు కోమటిరెడ్డి ఇంటి పేరున్న వ్యక్తి నామినేషన్ వేయడం కొత్త తలనొప్పిని తీసుకొచ్చింది. నల్గొండ జిల్లా కేంద్రానికి చెందిన యువ ఎంబీబీఎస్ డాక్టర్ కోమటిరెడ్డి సాయితేజ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. రాష్ట్రంలో రైతులు, పేదలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. నా వంతు వారికి ఏమైనా చేయాలని అనిపించింది. అందుకే ఎమ్మెల్యేగా పోటీ చేయాలని బరిలోకి దిగాను అని కోమటిరెడ్డి సాయితేజ రెడ్డి అంటున్నారు. చండూరు మండలం బస్టాండ్ నుంచి ఎన్నికల అధికారి కార్యాలయం వరకు ఎద్దుల బండిపై భారీ ఊరేగింపుతో వచ్చి ఆయన నామినేషన్ వేయడం విశేషం. వోటింగ్ మిషన్‌లో కోమటిరెడ్డి అనే రెండు ఇంటి పేర్లు ఉంటే చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉందని.. ఇది కూడా కోమటిరెడ్డి రాజగోపాల్‌కు పెద్ద ఎదురు దెబ్బే అని అంటున్నారు. ఈ రెండు మూడు రోజుల్లో ఆయనను బుజ్జగించే ప్రయత్నం ఏమైనా జరుగుతుందేమో చూడాలి.

First Published:  15 Oct 2022 3:34 AM GMT
Next Story