Telugu Global
Telangana

ఉద‌య్‌పూర్ డిక్ల‌రేష‌న్‌.. కాంగ్రెస్‌లో కొత్త టెన్ష‌న్‌

సీనియ‌ర్ నేత‌, కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు కోదండ‌రెడ్డి ఉద‌య్‌పూర్ డిక్ల‌రేష‌న్ ప్ర‌కార‌మే టికెట్లివ్వాలంటూ టీపీసీసీకి సూచించారు.

ఉద‌య్‌పూర్ డిక్ల‌రేష‌న్‌.. కాంగ్రెస్‌లో కొత్త టెన్ష‌న్‌
X

కాంగ్రెస్ పార్టీ ఆశావహుల్లో రోజుకో కొత్త టెన్ష‌న్‌. ఇంటికి రెండు టికెట్లు కావాలంటూ కీల‌క‌నేత‌ల ప‌ట్టు ఓ ప‌క్క‌, బీసీల‌కు పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గానికో అసెంబ్లీ సీటు అయినా ఇవ్వాల‌న్న డిమాండ్ మ‌రో ప‌క్క‌, ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన ఆశావ‌హుల డిమాండ్లు ఇంకో పక్క తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఈ ప‌రిస్థితుల్లో టీపీసీసీ మాజీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి తెర‌పైకి తెచ్చిన ఉద‌య్‌పూర్ డిక్ల‌రేష‌న్ మ‌రో కొత్త టెన్ష‌న్ సృష్టిస్తోంది.

తెర‌పైకి తెచ్చిన కోదండ‌రెడ్డి

సీనియ‌ర్ నేత‌, కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు కోదండ‌రెడ్డి ఉద‌య్‌పూర్ డిక్ల‌రేష‌న్ ప్ర‌కార‌మే టికెట్లివ్వాలంటూ టీపీసీసీకి సూచించారు. 2022లో రాజ‌స్థాన్‌లోని ఉద‌య్‌పూర్‌లో కాంగ్రెస్ చేసిన డిక్ల‌రేష‌న్ ప్ర‌కారం ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన‌వారికి ప్ర‌త్యేక ప‌రిస్థితుల్లో త‌ప్ప ఎన్నిక‌ల్లో టికెట్లివ్వ‌కూడ‌దు. గ‌త ఎన్నిక‌ల్లో ఇత‌ర పార్టీల్లో పోటీచేసిన వారికి ఈ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ టికెట్ ఇవ్వ‌కూడ‌దు. పార్టీలో ఐదేళ్ల‌కు పైగా ప‌నిచేసిన కుటుంబాల‌వారే ఒక‌టికి మించి రెండు టికెట్లు అదీ ప్ర‌జాబ‌లం ఉంటేనే ఇచ్చేందుకు ఆలోచించాలి. ఇలా చాలా నిబంధన‌లున్నాయి.

వ‌ల‌స నేత‌ల‌కు షాకేగా!

ఉద‌య్‌పూర్ డిక్ల‌రేష‌న్ ప్ర‌కార‌మే న‌డుచుకోవాల‌ని ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి కూడా ప్ర‌స్తావిస్తున్నారు. ఆ లెక్క‌న చూస్తే ఇప్ప‌టికే రెండు టికెట్లు ఇస్తామ‌న్న రేఖానాయ‌క్ దంప‌తుల‌ను, నిన్న‌నే రేవంత్ వెళ్లి క‌లిసి ఆహ్వానించిన తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావుకు కూడా టికెట్లు ఇవ్వ‌కూడ‌దు. మైనంప‌ల్లి హ‌న్మంత‌రావు కూడా త‌న‌కు, త‌న కుమారుడికి టికెట్ ఇస్తే వ‌స్తామంటున్నార‌ని స‌మాచారం. ఉద‌య్‌పూర్ డిక్ల‌రేష‌న్ అని మ‌డిక‌ట్టుకు కూర్చుంటే ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన బ‌ల‌మైన టికెట్లు ఇవ్వలేరు. అప్పుడు పార్టీ విజ‌యావ‌కాశాలే ప్ర‌శ్నార్థ‌క‌మ‌వుతాయి క‌దా.. అని కాంగ్రెస్ క్యాడ‌ర్ త‌ల‌ప‌ట్టుకుంటోంది.

*

First Published:  1 Sep 2023 5:31 AM GMT
Next Story