Telugu Global
Telangana

యూనివర్సిటీల అద్యాపకుల నియామకం బిల్లు రెండు నెలలుగా పెండింగ్ లో పెట్టిన గవర్నర్

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలోని బృందం వారం రోజుల క్రితం గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్‌ను స్వయంగా కలిసి ఆమె లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేసినప్పటికీ తెలంగాణ విశ్వవిద్యాలయాల ఉమ్మడి రిక్రూట్‌మెంట్ బోర్డు బిల్లు ఆమోదానికి ఆలస్యం జరుగుతూనే ఉంది. బిల్లుకు ఆమోదం తెలపడంలో జాప్యం వల్ల నిరుద్యోగ యువత, ఉపాధ్యాయ ఉద్యోగాలు ఆశించే వారు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

యూనివర్సిటీల అద్యాపకుల నియామకం బిల్లు రెండు నెలలుగా పెండింగ్ లో పెట్టిన గవర్నర్
X

తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయాలలో ఉపాధ్యాయ నియామకాల కోసం వేలాది మంది ఆశావహులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నప్పటికీ, తెలంగాణ విశ్వవిద్యాలయాల ఉమ్మడి రిక్రూట్‌మెంట్ బోర్డు బిల్లుకు ఆమోదం తెలప‌డంలో రాజ్‌భవన్ గత రెండు నెలలుగా జాప్యం చేస్తూనే ఉంది.

విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలోని బృందం వారం రోజుల క్రితం గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్‌ను స్వయంగా కలిసి ఆమె లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేసినప్పటికీ ఆలస్యం జరుగుతూనే ఉంది. బిల్లుకు ఆమోదం తెలపడంలో జాప్యం వల్ల నిరుద్యోగ యువత, ఉపాధ్యాయ ఉద్యోగాలు ఆశించే వారు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నియమ నిబంధనలకు లోబడే రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో నియామకాలు జరుగుతాయని విద్యాశాఖ మంత్రి బృందం గవర్నర్‌కు వివరించింది.

విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ఉపాధ్యాయులు,ఇతర అకడమిక్ సిబ్బంది నియామకానికి కనీస అర్హతలపై - UGC నిబంధనల యొక్క టేబుల్ 3 కూడా బిల్లులో పొందుపరచబడిందని గవర్నర్ కు విద్యాశాఖ మంత్రి తెలియజేశారు.

గత రిక్రూట్‌మెంట్‌లలో జరిగినట్టు బహుళ ఉద్యోగ ఆఫర్‌లు చేతిలో ఉన్న ఒక అభ్యర్థిని యూనివర్సిటీ ఎంపిక చేసుకుంటే, విశ్వవిద్యాలయాలలో పోస్టులు ఎలా ఖాళీగా ఉంటాయో ఉన్నత విద్యా శాఖ అధికారులు గవర్నర్‌కు వివరించారు. ఇప్పుడు తీసుకొచ్చిన యూనివర్సిటీల ఉమ్మడి రిక్రూట్‌మెంట్ వల్ల అది జరగదని వారు చేప్పారు.

అయితే, బిల్లులో పొందుపరిచిన నిబంధనలపై గవర్నర్ UGC నుండి ప్రతిస్పందనను కోరినట్లు అధికారులు తెలిపారు. "గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత ఒక నెలలోపు విశ్వవిద్యాలయాలలో 2,000 ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్‌లు జారీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము" అని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

తెలంగాణ విశ్వవిద్యాలయాల కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు మాదిరిగానే బీహార్లో 1960ల నుంచే ప్రత్యేక కమిషన్ ద్వారా విశ్వవిద్యాలయాలలో ఉపాధ్యాయ పోస్టులకు నియామకాలను నిర్వహిస్తోంది.

ఇప్పటి వరకు రాష్ట్రంలోని యూనివర్సిటీలు సొంతంగా రిక్రూట్‌మెంట్లు నిర్వహించడం వల్ల అవినీతికి, ఆస్కారం ఏర్పడిందని, అంతే కాకుండా, ఈ రిక్రూట్‌మెంట్‌లు కొన్ని సందర్భాల్లో చట్టపరమైన అడ్డంకులను ఎదుర్కొన్నాయని, ఫలితంగా నియామకాలు ఆలస్యమయ్యాయని అధికారులు వాదిస్తున్నారు.

ఎలాంటి అవినీతి లేకుండా పారదర్శకతతో ఎంపిక ప్రక్రియను చేపట్ట‌డానికి, రాష్ట్ర ప్రభుత్వం ఈ బోర్డును ఏర్పాటు చేసింది, ఇది వైద్య విశ్వవిద్యాలయం మినహా 15 విశ్వవిద్యాలయాలలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల నియామకాలను నిర్వహిస్తుంది.

నోటిఫికేషన్ జారీ చేయడం నుండి ఇంటర్వ్యూలు నిర్వహించడం వరకు, మొత్తం నియామక ప్రక్రియ బోర్డే చేస్తుంది. అర్హతగల అభ్యర్థులకు స్క్రీనింగ్ రాత పరీక్ష నిర్వహించబడుతుంది. పరీక్షలో మెరిట్, రోస్టర్ పాయింట్ల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేయబడిన వారిని ఇంటర్వ్యూలకు పిలుస్తారు.

UGC నిబంధనలకు అనుగుణంగా వైస్ ఛాన్సలర్, సబ్జెక్ట్ నిపుణులతో కూడిన ప్యానెల్ ఇంటర్వ్యూలను నిర్వహిస్తుంది. " ఏ బోర్డ్‌కు ఇంటర్వ్యూ కోసం పంపబడతారో అభ్యర్థులకు ముందుగా తెలియని విధంగా ఇంటర్వ్యూ విధానం రూపొందించబడింది" అని ఓ అధికారి తెలిపారు.

ఎంపికైన అభ్యర్థులు వారు చేరాలనుకునే యూనివర్శిటీకి తమ ప్రాధాన్యత ఇవ్వాలని కోరతారు. మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, ప్రిఫరెన్స్ ఆధారంగా, అభ్యర్థులకు విశ్వవిద్యాలయం కేటాయించబడుతుంది. సంబంధిత యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నియామకాలను ఆమోదించనుంది.

First Published:  20 Nov 2022 3:09 AM GMT
Next Story