Telugu Global
Telangana

మునుగోడు బీజేపీలో రెండు వర్గాలు.. సఖ్యత లేని శ్రేణులు

రాజగోపాల్ వర్గం ఓవైపు, స్థానిక బీజేపీ కార్యవర్గం మరోవైపు చెరోదారి పట్టాయి. ఎక్కడా సఖ్యత లేదు, సామరస్యం లేదు. అసలు రాజగోపాల్ రెడ్డిని పూర్తిస్థాయిలో బీజేపీ నేతగా అంగీకరించలేకపోతున్నాయి ఆ పార్టీ శ్రేణులు.

మునుగోడు బీజేపీలో రెండు వర్గాలు.. సఖ్యత లేని శ్రేణులు
X

దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచిన ఉత్సాహంతో.. అదే ఊపులో ఉప ఎన్నికలు తమకు సెంటిమెంట్‌గా ఉపయోగపడతాయనుకుంటోంది బీజేపీ. మునుగోడు ఉప ఎన్నికల్లో గెలుపు తమదేనంటూ ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే ఈసారి పరిస్థితి బీజేపీకి అనుకూలంగా లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి దూసుకుపోతారనుకున్నా, ఆయనతో బీజేపీ శ్రేణులు కలసి నడుస్తాయనుకున్నా కుదరలేదు. రాజగోపాల్ వర్గం ఓవైపు, స్థానిక బీజేపీ కార్యవర్గం మరోవైపు చెరోదారి పట్టాయి. ఎక్కడా సఖ్యత లేదు, సామరస్యం లేదు. అసలు రాజగోపాల్ రెడ్డిని పూర్తిస్థాయిలో బీజేపీ నేతగా అంగీకరించలేకపోతున్నాయి ఆ పార్టీ శ్రేణులు.

ఎవరి యాత్రలు వారివే..

తెలంగాణలో ప్రస్తుతం బీజేపీ యాత్రల సీజన్ నడుస్తోంది. ఓవైపు కేంద్ర మంత్రులు పిలిస్తే పలుకుతామంటున్నారు. మరోవైపు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నారు. ఈనెల 22న దీనికి ముగింపు పలకబోతున్నారాయన, ఆ తర్వాత మునుగోడులో కలియదిరగాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. ప్రజాఘోష అనే పేరుతో మోటర్ బైక్ ర్యాలీ మరోవైపు జరుగుతోంది. ప్రధాని నరేంద్రమోదీ పుట్టినరోజు సందర్భంగా ఈనెల 17న సేవాపక్షం అనే కార్యక్రమాన్నీ మొదలు పెట్టారు. ఇలా ఎవరికి వారే వారి వారి కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు.

రాజగోపాల్ రెడ్డితోనే పేచీ..

వాస్తవానికి రాజగోపాల్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నుంచి వచ్చినవారంతా ఒక వర్గంగా ఉన్నారు. స్థానిక బీజేపీ నేతలు వీరితో కలవలేకపోతున్నారు. బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ జి.వివేక్‌తో గతంలో కాంగ్రెస్‌లోనే పాత పరిచయం ఉన్నా కూడా ప్రస్తుతం ఎవరి గ్రూప్ వారికి విడిగా ఉంది. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వస్తున్న వారికి అధిష్టానం సాదరంగా స్వాగతం పలుకుతున్నా, ఎప్పటి నుంచో బీజేపీని నమ్ముకుని ఉన్నవారికి మాత్రం ఈ వ్యవహారాలు మింగుడుపడటంలేదు. తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు తెలంగాణలో ఉన్న అవసరం వేరు. మునుగోడు ఉప ఎన్నికను ముందు పెట్టుకుని ఇంకా రాజగోపాల్ రెడ్డి తమ వర్గంతోనే ప్రచారం చేస్తున్నారు. కండువా బీజేపీదే అయినా, ఆయన చుట్టుపక్కల కరడుగట్టిన కాంగ్రెస్‌వాదులే ఉన్నారు. ఆయన ప్రచారంలో స్థానిక బీజేపీ నేతలు కలవడం లేదు. దీంతో మునుగోడు బీజేపీలో సమన్వయలేమి స్పష్టంగా తెలుస్తోంది. ఉప ఎన్నికల్లో గెలుపు అసాధ్యం అని రుజువవుతోంది.

First Published:  21 Sep 2022 9:43 AM GMT
Next Story