Telugu Global
Telangana

రాధాకృష్ణకు విశ్వసనీయత లేదని ఏబీఎన్‌లోనే చెప్పేసిన తులసిరెడ్డి

రాధాకృష్ణ రాసిన రాతలకు విశ్వసనీయత లేదన్న ఈ కామెంట్స్‌ను తులసిరెడ్డి ఏబీఎన్ చానల్ డిబేట్‌లోనే చేశారు.

రాధాకృష్ణకు విశ్వసనీయత లేదని ఏబీఎన్‌లోనే చెప్పేసిన తులసిరెడ్డి
X

కాంగ్రెస్‌లో విలీనానికి సిద్ధమైన వైఎస్‌ షర్మిలకు కాంగ్రెస్ నేతల కామెంట్స్ మాత్రం ఇబ్బంది కలిగించేలా ఉన్నాయి. నిన్న రేణుకా చౌదరి.. నేడు తులసిరెడ్డి.. షర్మిలను తగ్గించేలా, చులకన చేసేలా వ్యాఖ్యలు చేశారు. అసలు షర్మిల కోసం మేం తాపత్రయపడటం ఏంటని తులసి రెడ్డి ప్రశ్నించారు. ఆమె కాంగ్రెస్‌లో చేరేందుకు తాపత్రయపడుతున్నారని వ్యాఖ్యానించారు. బెంగళూరు వెళ్లి డీకే శివకుమార్‌ను వైఎస్ షర్మిల కలిశారే గానీ.. డీకే వచ్చి షర్మిలను కలవలేదు కదా అని ప్రశ్నించారు.

రాహుల్ పుట్టిన రోజు నాడు షర్మిలనే శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారన్నారు. వైఎస్ జయంతి రోజు నివాళులర్పిస్తూ రాహుల్ గాంధీ ట్వీట్ చేస్తే.. ఆ ట్వీట్‌ ఏదో తనకే పర్సనల్‌గా చేసినట్టు భావించేసి.. రీట్వీట్‌ చేసి, రాహుల్ గాంధీ నాయకత్వంలోనే దేశానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని నమ్మిన నాయకుడు వైఎస్‌ఆర్ అంటూ షర్మిల కామెంట్ చేశారన్నారు. వీటిని పరిశీలిస్తే ఆమే కాంగ్రెస్‌లో చేరేందుకు తపిస్తున్నట్టుగా అర్థమవుతుందన్నారు.

షర్మిల కోసం కాంగ్రెస్‌ తపిస్తోందని.. ఆ విషయం తెలిసి జగన్ భయంతో కాంగ్రెస్‌ పెద్దల వద్దకు రాయబారం పంపారని.. దాంతో కాంగ్రెస్ పెద్దల ఆలోచన మారిందని, షర్మిల మీమాంసలో పడ్డారంటూ రాధాకృష్ణ తన వీకెండ్ కామెంట్‌లో రాశారని, ఆ వ్యాఖ్యలు నిజం కాదని తులసిరెడ్డి చెప్పారు. రాధాకృష్ణ ఇది వరకు చేసిన విశ్లేషణలు నిజం అయి ఉండవచ్చని.. కానీ మొన్న రాసిన దానికి మాత్రం విశ్వసనీయత లేదని తులసిరెడ్డి వ్యాఖ్యానించారు. రాధాకృష్ణ రాసిన రాతలకు విశ్వసనీయత లేదన్న ఈ కామెంట్స్‌ను తులసిరెడ్డి ఏబీఎన్ చానల్ డిబేట్‌లోనే చేశారు. అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్‌ కోసం తపించాల్సిన అవసరం జగన్‌కు కూడా లేదని తులసిరెడ్డి విశ్లేషించారు. ఒకవైపు చర్చలు తుది దశకు చేరాయని షర్మిలనే చెబుతుంటే.. రాధాకృష్ణ మాత్రం షర్మిల మీమాంసలో పడ్డారని రాశారని.. రెండింటికి పొంతన కుదరడం లేదన్నారు.

*

First Published:  4 Sep 2023 5:57 AM GMT
Next Story