Telugu Global
Telangana

బీజేపీకి తుల ఉమ రాజీనామా.. నెక్స్ట్‌ ఆ పార్టీలోకి..!

బీజేపీ అప్పగించిన ప్రతి పనిని విజయవంతం చేసేందుకు కృషి చేశానన్నారు తుల ఉమ. తన సేవను గుర్తించి వేములవాడ టికెట్ ఇచ్చారని, అయితే చివరి నిమిషంలో బీఫాం మరొకరికి ఇచ్చి తనను అవమానించారని లేఖలో పేర్కొన్నారు.

బీజేపీకి తుల ఉమ రాజీనామా.. నెక్స్ట్‌ ఆ పార్టీలోకి..!
X

వేములవాడ టికెట్ ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తీసుకోవడంతో తీవ్ర అసంతృప్తికి గురైన తుల ఉమ.. బీజేపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు బీజేపీ స్టేట్ చీఫ్‌ కిషన్ రెడ్డికి లేఖ రాశారు. తనకు అన్యాయం చేసినందుకు బీజేపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

బీజేపీ అప్పగించిన ప్రతి పనిని విజయవంతం చేసేందుకు కృషి చేశానన్నారు తుల ఉమ. తన సేవను గుర్తించి వేములవాడ టికెట్ ఇచ్చారని, అయితే చివరి నిమిషంలో బీఫాం మరొకరికి ఇచ్చి తనను అవమానించారని లేఖలో పేర్కొన్నారు. ఇది కేవలం తనకు జరిగిన అవమానం కాదని.. యావత్‌ గొల్ల కురుమ జాతికి జరిగిన అవమానంగా అభివర్ణించారు. బీజేపీలో కమిట్మెంట్‌తో పనిచేసే కార్యకర్తలు ఉన్నారని, కానీ వారందరి ఉత్సాహాన్ని తప్పుడు నిర్ణయాలతో నీరుగారుస్తున్నారని మండిపడ్డారు. ఓ ఉద్యమకారురాలిగా, ఓ బీసీ బిడ్డగా వేములవాడ నియోజకవర్గ ప్రజలకు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా జడ్పీ ఛైర్‌పర్సన్‌గా సేవ చేసుకునే భాగ్యం తనకు లభించిందన్నారు. ఈ ప్రాంత ప్రజలతో తనకు ఉన్న అనుబంధాన్ని ఎమ్మెల్యే టికెట్లు తెంపలేవన్నారు తుల ఉమ. కార్యకర్తలు, అనుచరులు, ప్రజల అభిప్రాయం మేరకు త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.




ఇక తుల ఉమ సొంతగూటికి చేరతారని తెలుస్తోంది. ఇప్పటికే ఉమతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్‌లో మాట్లాడినట్లు తెలుస్తోంది. కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్‌ కుమార్ సైతం తుల ఉమ ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. సముచిత ప్రాధాన్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పని చేసిన తుల ఉమ.. 2014-19 మధ్య ఉమ్మడి కరీంనగర్ జిల్లా జడ్పీ ఛైర్‌పర్సన్‌గా పనిచేశారు. తర్వాత ఎమ్మెల్సీ పదవి ఆశించిన తుల ఉమకు నిరాశే ఎదురైంది. దీంతో బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి.. ఈటల వెంట బీజేపీ కండువా కప్పుకున్నారు.

First Published:  13 Nov 2023 5:21 AM GMT
Next Story