Telugu Global
Telangana

షర్మిల ఫ్లెక్సీని చెప్పులతో కొట్టిన హిజ్రాలు.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్

షర్మిల ఫ్లెక్సీని చెప్పులతో కొట్టిన హిజ్రాలు.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్
X

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలపై హిజ్రాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను కించ పరిచేలా వ్యాఖ్యలు చేయడంపై మండిపడుతున్నారు. ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా ఆమె ఫ్లెక్సీని చెప్పులతో కొట్టారు. వెంటనే తమకు క్షమాపణలు చెప్పకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. వివరాల్లోకి వెళితే..

వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల తన పాదయాత్రలో భాగంగా మహబూబాబాద్‌లో స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శంకర్ నాయక్‌ను పట్టుకొని 'కొజ్జా' అంటూ సంభోధించారు. హామీలు అమలు చేయని నువ్వు కదా కొజ్జా.. రైతు రుణ మాఫీ చేయని మిమ్మల్ని కొజ్జాలు అని కాకుండా ఎలా పిలవమంటారని ఘాటుగా వ్యాఖ్యానించారు.

ఆరు నెలల్లో పోడు పట్టాలు ఇవ్వని మీరు కొజ్జాలు కాకపోతే మరేమవుతారంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. షర్మిల వ్యాఖ్యలపై హిజ్రాల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మంగళవారం వరంగల్ హెడ్ పోస్టాఫీస్ జంక్షన్‌లో షర్మిల ఫ్లెక్సీని చెప్పులతో కొడుతూ నిరసన తెలిపారు. ఆ తర్వాత ఆ ఫ్లెక్సీని దగ్దం చేశారు. షర్మిల బహిరంగంగా క్షమాపణలు చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చిరించారు.

హిజ్రాల్లో చదువుకున్న వాళ్లు, విద్యావంతులు, మేధావులు ఉన్నారని.. సమాజంలోని మిగిలిన వర్గాల మాదిరిగానే హిజ్రాలు కూడా గౌరవ ప్రదంగా జీవిస్తున్నట్లు హిజ్రాల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు లైలా అన్నారు. హిజ్రాల గురించి మాట్లాడేటప్పుడు ముందు వారి జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని.. నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోమన్నారు. రాజకీయ నాయకులు రాజకీయాలు చేసుకోవాలి. అంతే కానీ తమ కమ్యూనిటీని కించపరిచి మాట్లాడితే ఊరుకోము అని లైలా చెప్పారు.


First Published:  21 Feb 2023 1:18 PM GMT
Next Story