Telugu Global
Telangana

పవన్ కళ్యాణ్ ట్వీట్ కు సజ్జనార్ జవాబు!

పాఠశాల విద్యార్థుల కోసం రంగారెడ్డి జిల్లాలోని ఓ రూట్ లో బస్సు వేయాలని తెల‍ంగాణ ప్రభుత్వాన్ని కోరుతూ జనసేన అధ్యక్షుడు , నటుడు పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. కొన్ని నిమిషాల్లో నే...ఆ రూట్ లో ఆల్ రెడీ బస్సు నడుపుతున్నామని ఆర్టీసీ ఎండి సజ్జన్నార్ జవాబిచ్చారు.

పవన్ కళ్యాణ్ ట్వీట్ కు సజ్జనార్ జవాబు!
X

ప్రజా సమస్యల మీద గొంతెత్తడం బాగానే ఉంటుంది కానీ సరైన సమాచారం లేకుండా మాట్లాడితేనే ఇబ్బందులొస్తాయి. అలా నోటికొచ్చింది మాట్లాడటం రాజకీయనాయకులకు అలవాటే. తర్వాత తాము మాట్లాడింది తప్పని తెలిసినా వాళ్ళేమీ పెద్దగా ఫీలవరు. రాజకీయ నాయకుడిగా మారిన నటుడు పవన్ కళ్యాణ్ కూడా అదే దారిలో నడుస్తున్నట్టున్నారు. సమాచారం పూర్తిగా తెలుసుకోకుండానే ఆయనీరోజు ఓ స్టేట్ మెంట్ ఇచ్చేశారు. వెంటనే చర్యలు చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశం లాంటి విజ్ఞ‌ప్తి చేశారు. అయితే దానికి జవాబిచ్చిన ఆర్టీసీ ఎండి సజ్జన్నార్, పవన్ కళ్యాణ్ ను ఏమీ విమర్శించకుండానే ఆయన సమాచార లోపాన్ని ఎత్తి చూపారు.

అసలు విషయమేంటంటే...

రంగారెడ్డి జిల్లాలోని ఓ రూట్ లో విద్యార్థుల కోసం ఒక ప్రత్యేక బస్సు నడపాలంటూ నటుడు పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞ‌ప్తి చేస్తూ ఓ ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ చేసిన కొన్ని నిమిషాల్లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఎండీ సజ్జనార్ స్పందించారు. ఇప్పటికే ఆ రూట్లో బస్సు నడుపుతున్నామని తెలియజేశారు.

''తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాలోని పల్లెచెల్క తండా, సరికొండ గ్రామాల విద్యార్ధులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు నా దృష్టికి వచ్చాయి. ఆ గ్రామీణ ప్రాంతాల నుంచి.. ముఖ్యంగా ఆడబిడ్డలు మడిపల్లి, మాల్, ఇబ్రహీంపట్నం వెళ్ళి చదువుకొంటున్నారు. విద్యా సంస్థలు విడిచిపెట్టాక బస్సులు లేక నడిచి వెళ్లాల్సి వస్తోంది. అటవీ ప్రాంతం కావడం తో పిల్లలు భయపడుతున్నారు. ఆర్టీసీ బస్సు సదుపాయం ఉన్నా సక్రమంగా నడపకపోవడం, తరచూ ఆ సర్వీసు రద్దు చేస్తుండటంతో పిల్లలు బిక్కుబిక్కుమంటూ నడిచి వెళ్తున్నారు. ఈ పరిస్థితిని మీడియా కూడా వెలుగులోకి తీసుకువచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం ఈ సమస్యపై స్పందించి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా బస్సు నడపాలి. బస్సు సదుపాయం లేదని, అటవీ ప్రాంతంలో నడిచేందుకు భయపడి విద్యార్థినులు చదువు మధ్యలో ఆపేసే పరిస్థితి రాకూడదు. ఈ దిశగా చర్యలు తీసుకోవాలి.'' అని జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.

పవన్ కళ్యాణ్ ట్వీట్ చేసిన కొద్ది సేపటికే స్పందించిన‌ ఆర్టీసీ ఎండీ సజ్జనార్.... ''షెడ్యూల్ ప్రకారం పాఠశాల విద్యార్థుల కోసం బస్సును క్రమం తప్పకుండా నడుపుతున్నాం. పాఠశాలలకు దసరా సెలవుల సందర్భంగా ఈ ట్రిప్పును ఆపేశాం. అయితే, పాఠశాలలు పునఃప్రారంభమైన తర్వాత, ఈ బస్సు పునరుద్ధరించబడింది. ట్రాఫిక్ రద్దీ కారణంగా నిన్న ఈ ట్రిప్ 1 గంట 30 నిమిషాలు ఆలస్యంగా నడిచింది'' అని ట్వీట్ చేశారు.

First Published:  12 Oct 2022 10:07 AM GMT
Next Story