Telugu Global
Telangana

ఒరిజినల్‌ కార్డు లేకుంటే.. డబ్బు చెల్లించాల్సిందే..

ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకోవాలంటే ఫొటో, అడ్రస్‌ ఉన్న ఒరిజినల్‌ గుర్తింపు కార్డు తప్పనిసరిగా చూపించాలని టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ సోమవారం ‘ఎక్స్‌’ మెసేజ్‌ ద్వారా తెలిపారు.

ఒరిజినల్‌ కార్డు లేకుంటే.. డబ్బు చెల్లించాల్సిందే..
X

ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసే మహిళా ప్రయాణికులు ఒరిజినల్‌ గుర్తింపు కార్డు చూపించాల్సిందేనని టీఎస్‌ఆర్టీసీ స్పష్టం చేసింది. అసలైన గుర్తింపు కార్డు లేకుంటే కచ్చితంగా డబ్బు చెల్లించి టికెట్‌ తీసుకోవాల్సిందేనని తెలిపింది. మహాల‌క్ష్మి పథకం తెలంగాణ ప్రాంత మహిళలకే వర్తిస్తుందని, ఇతర రాష్ట్రాల మహిళలు డబ్బు చెల్లించి టికెట్‌ తీసుకొని ప్రయాణించాలని స్పష్టం చేసింది.

పాన్‌ కార్డు చెల్లదు...

తెలంగాణలో ‘మహాలక్ష్మి’ పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అమలులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకోవాలంటే ఫొటో, అడ్రస్‌ ఉన్న ఒరిజినల్‌ గుర్తింపు కార్డు తప్పనిసరిగా చూపించాలని టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ సోమవారం ‘ఎక్స్‌’ మెసేజ్‌ ద్వారా తెలిపారు. గుర్తింపు కార్డులో ప్రయాణికురాలి ఫొటో, అడ్రస్‌ స్పష్టంగా కనిపించాలని పేర్కొన్నారు. అలా ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే ఏ అసలైన గుర్తింపు కార్డునైనా అనుమతిస్తామని ఆయన వివరించారు. పాన్‌ కార్డులో అడ్రస్‌ లేనందున అది ఉచిత ప్రయాణానికి చెల్లుబాటు కాదని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

ఫోన్లలో చూపిస్తే చెల్లదు...

ఒరిజినల్‌ గుర్తింపు కార్డులు చూపించాలని పదే పదే చెబుతున్నా.. ఇప్పటికీ కొందరు స్మార్ట్‌ ఫోన్లలో, ఫొటో కాపీలు, కలర్‌ జిరాక్స్‌లు చూపిస్తున్నారని టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి వచ్చిందని సజ్జనార్‌ పేర్కొన్నారు. దీనివల్ల సిబ్బంది ఇబ్బందులకు గురవడంతో పాటు ప్రయాణ సమయం కూడా పెరుగుతోందని తెలిపారు. ఫలితంగా ఇతర ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని పేర్కొన్నారు. మహిళా ప్రయాణికులందరూ అసలైన గుర్తింపు కార్డును చూపించి జీరో టికెట్‌ తీసుకోవాలని కోరుతున్నామని, అసలైన గుర్తింపు కార్డు లేకుంటే కచ్చితంగా డబ్బు చెల్లించి టికెట్‌ తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.



సిబ్బందితో వాదన సరికాదు...

పలువురు ప్రయాణికులు ఆర్టీసీ సిబ్బందితో వాదనకు దిగుతున్నారని, ఎలాగూ ఉచితమే కదా. జీరో టికెట్‌ ఎందుకు తీసుకోవడం? అని ప్రశ్నిస్తున్నారని సజ్జనార్‌ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ప్రయాణ సొమ్మును ఆర్టీసీకి చెల్లించాలంటే.. జీరో టికెట్ల లెక్క ఉంటేనే సాధ్యమవుతుందని వివరించారు. జీరో టికెట్‌ లేకుండా ప్రయాణిస్తే.. సంస్థకు నష్టం చేసిన వాళ్లవుతారని ఆయన తెలిపారు. అందువల్ల ప్రతి మహిళా జీరో టికెట్‌ తీసుకోవాల్సిందేనని వివరించారు. ఒకవేళ టికెట్‌ తీసుకోకుండా ప్రయాణిస్తే.. అది చెకింగ్‌లో గుర్తిస్తే సిబ్బంది ఉద్యోగం ప్రమాదంలో పడుతుందని తెలిపారు. అలాగే సదరు వ్యక్తికి రూ.500 జరిమానా విధించే అవకాశం ఉంటుందని సజ్జనార్‌ స్పష్టం చేశారు.

First Published:  9 Jan 2024 2:16 AM GMT
Next Story