Telugu Global
Telangana

మే 16 నుంచి ఇంటర్ స్టేట్ ఈ-బస్సులు.. రంగం సిద్ధం చేస్తున్న టీఎస్ఆర్టీసీ

మియాపూర్ డిపోలో ఫాస్ట్ చార్జింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేశారు. అలాగే ఈ-బస్సులు తప్పకుండా సూర్యపేటలో స్టాప్ కలిగి ఉంటాయి.

మే 16 నుంచి ఇంటర్ స్టేట్ ఈ-బస్సులు.. రంగం సిద్ధం చేస్తున్న టీఎస్ఆర్టీసీ
X

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) తొలి విడత ఈ-బస్సులను ఈ నెల 16న ప్రారంభించనున్నది. అంతర్‌రాష్ట్ర రూట్లలో 50 ఈ-బస్సులను నడపాలని సంస్థ గతంలోనే నిర్ణయించింది. దీనికి సంబంధించిన 5 బస్సులు అందుబాటులోకి వచ్చాయి. వీటిని హైదరాబాద్-విజయవాడ రూట్లో నడపాలని అధికారులు నిర్ణయించారు.

ఈ-గరుడు పేరుతో విజయవాడకు ఈ నెల 16 నుంచి నడపనున్నారు. పూర్తి ఎయిర్ కండిషన్డ్ బస్సులైన వీటి టికెట్ రేట్లు రాజధాని కంటే కాస్త ఎక్కువగా, గరుడ బస్సుల కంటే కాస్త తక్కువగా ఉంటాయని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ బస్సులు మియాపూర్ డిపోలో ఉన్నాయని.. ఒక్కో బస్సు ఫుల్ చార్జింగ్ కావడానికి 4 గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.

మియాపూర్ డిపోలో ఫాస్ట్ చార్జింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేశారు. అలాగే ఈ-బస్సులు తప్పకుండా సూర్యపేటలో స్టాప్ కలిగి ఉంటాయి. ఇక్కడ కూడా తప్పకుండా చార్జింగ్ పెట్టుకుంటాయని అధికారులు తెలిపారు. ప్రతీ రౌండ్ ట్రిప్‌లో సూర్యాపేట దగ్గర ఈ-బస్సులు చార్జింగ్ చేసుకొని బయలు దేరుతాయని అన్నారు. ఒక్కో బస్సు ఫుల్ చార్జింగ్ అయితే 300-350 కిలోమీటర్లు తిరుగుతాయి. అయితే సిటీ ట్రాఫిక్, ఇతర పరిస్థితులను బట్టే.. ప్రతీ సారి సూర్యపేటలో చార్జింగ్ చేసుకునే ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. ఒలెక్ట్రా కంపెనీ సరఫరా చేస్తున్న ఈ-బస్సుల మెయింటనెన్స్‌ను ఈవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ చేపడుతుందని అధికారులు వెల్లడించారు.

విలేజ్ బస్ ఆఫీసర్ల వ్యవస్థ ప్రారంభం..

ఆర్టీసీపై ప్రజల్లో మరింత నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంచేందుకు విలేజ్ బస్ ఆఫీసర్ల వ్యవస్థను సంస్థ ఎండీ సజ్జనార్ ప్రారంభించారు. మొదటి విడతలో 1730 మంది బస్ ఆఫీసర్లను నియమించారు. వీరు ఆర్టీసీకి బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటారు. ప్రజలకు, సంస్థకు మధ్య అనుసంధానకర్తలుగా వ్యవహరిస్తారు. ఆక్యుపెన్సీ రేషియో పెంచడానికి వీళ్లు పాటుపడనున్నారు.

First Published:  12 May 2023 5:44 AM GMT
Next Story