Telugu Global
Telangana

కార్మికులే విలీనం.. కార్పొరేషన్ అలాగే ఉంటుంది

ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే ప్రక్రియ ఎన్నికల కోడ్ వచ్చేలోగా పూర్తవుతుందని చెప్పారు చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశ పెడతామని అన్నారు. విలీనంపై ఇప్పటికే కమిటీ ఏర్పాటైందన్నారు.

కార్మికులే విలీనం.. కార్పొరేషన్ అలాగే ఉంటుంది
X

తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారబోతున్నారనే విషయం తెలిసిందే. అయితే కేవలం కార్మికులే ప్రభుత్వంలో కలుస్తారని, కార్పొరేషన్ అలాగే ఉంటుందని చెప్పారు ఆ సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్. ఏపీలో కూడా కార్పొరేషన్ అలాగే ఉందని, చైర్మన్, ఎండీ పోస్ట్ లు కూడా అలాగే ఉన్నాయని గుర్తు చేశారు. తెలంగాణలో కూడా ఆర్టీసీ కార్పొరేషన్ కు చైర్మన్, ఎండీ ఉంటారని.. జీతాలు మాత్రం ప్రభుత్వం ఇస్తుందన్నారు.

కార్మికులకు లాభం.. ప్రతిపక్షాలకు కష్టం..

కార్మికుల విలీనంపై వస్తున్న విమర్శలను కొట్టిపారేశారు చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్. ఈ విలీనంతో కార్మికుల జీతాలు 25నుంచి 30శాతం పెరుగుతాయని చెప్పారు. జీతాలు పెరిగితే కార్మికులకు లాభమే కదా అన్నారాయన. ప్రతిపక్షాలకు మాత్రం ఇది జీర్ణించుకోలేని అంశంగా మారిందని చెప్పారు. ఆస్తులకోసం ఆర్టీసీని విలీనం చేసుకుంటున్నారనేవి అర్థం లేని ఆరోపణలు అని కొట్టిపారేశారు. అలా మాట్లాడేవారికి సిగ్గు, బుద్ధి లేవన్నారు బాజిరెడ్డి.

కోడ్ వచ్చేలోగా విలీన ప్రక్రియ పూర్తి..

ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే ప్రక్రియ ఎన్నికల కోడ్ వచ్చేలోగా పూర్తవుతుందని చెప్పారు చైర్మన్. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశ పెడతామని అన్నారు. విలీనంపై ఇప్పటికే కమిటీ ఏర్పాటైందన్నారు. ప్రభుత్వంతో కలిశాం అనే ఉద్దేశంతో ఉద్యోగులు అలసత్వంగా ఉంటే కుదరదన్నారు. ఉద్యోగులు క్రమశిక్షణతో పనిచేయాలని, సంస్థను లాభాలబాటలో నడిచేలా చేయాలని పిలుపునిచ్చారు. ఇక ఆర్టీసీ ఆస్తుల విషయంలో ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలన్నారు. ఆస్తుల విభజన సమస్య సామరస్యంగా పరిష్కారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

First Published:  2 Aug 2023 12:19 PM GMT
Next Story