Telugu Global
Telangana

మునుగోడు టీఆర్ఎస్ నాయకుల రహస్య సమావేశం.. అక్కడ ఏం జరిగింది?

తెలంగాణ రాజకీయం అంతా ఇప్పుడు మునుగోడు చుట్టే తిరుగుతోంది.

మునుగోడు టీఆర్ఎస్ నాయకుల రహస్య సమావేశం.. అక్కడ ఏం జరిగింది?
X

తెలంగాణ రాజకీయం అంతా ఇప్పుడు మునుగోడు చుట్టే తిరుగుతోంది. త్వరలో జరుగనున్న ఉప ఎన్నికలో బీజేపీ తరపున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలో దిగనుండగా.. టీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి ఎవరు నిలబడతారనేది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ పార్టీ తరపున పాల్వాయి గోవర్థన్ రెడ్డి కూతురు పాల్వాయి స్రవంతి బరిలో ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. ఇక ఈ ఉపఎన్నికను అధికార టీఆర్ఎస్ కూడా సవాలుగా తీసుకున్నది. గత ఎన్నికల్లో సిట్టింగ్ సీటును కోల్పోయిన టీఆర్ఎస్.. ఈ ఉపఎన్నికలో తిరిగి దక్కించుకోవాలని భావిస్తోంది.

ఇటీవల కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రగతి భవన్‌కు వెళ్లడంతో.. ఆయనకే టికెట్ దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. 2014లో మునుగోడు నుంచి గెలిచిన ప్రభాకర్ రెడ్డి.. 2018లో మాత్రం రాజగోపాల్ చేతిలో ఓడిపోయారు. ఈ క్రమంలో మరోసారి ప్రభాకర్ రెడ్డికే ఛాన్స్ ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. అయితే మునుగోడు నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ నాయకులు ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇవ్వద్దొని కోరుతున్నారు. ఒకవేళ ఆయనకు టికెట్ ఇస్తే మాత్రం ఓడిస్తామని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. వారిని సముదాయించడానికి మంత్రి జగదీశ్ రెడ్డి ఇటీవల పలు సమావేశాలు నిర్వహించినా ఫలితం లేకపోయింది.

తాజాగా మునుగోడు మండల టీఆర్ఎన్ నాయకులు చౌటుప్పల్ సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో రహస్యంగా సమావేశమైనట్లు తెలుస్తున్నది. దండుమల్కాపురంలోని ఆందోల్ మైసమ్మ దేవాలయం ఫంక్షన్ హాల్‌లో జరిగిన సమావేశానికి మునుగోడులోని అన్ని మండలాలకు చెందిన 300 మంది నాయకులు హాజరయ్యారు. కూసుకుంట ప్రభాకర్ రెడ్డికి ఈ సారి టికెట్ కేటాయించవద్దని అందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేసుకున్నట్లు తెలుస్తున్నది. మునుగోడు టికెట్‌ను ఆయనకు తప్ప ఎవరికి ఇచ్చినా ఐక్యంగా పని చేసి గెలిపించుకుంటామని కూడా డిమాండ్ చేస్తున్నారు.

ఇక నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, ఆయన సోదరుడు కృష్ణారెడ్డి తాజాగా కేసీఆర్‌తో సమావేశం అయ్యారు. ఈ నెల 20న మునుగోడులో జరుగనున్న బహిరంగ సభ నిర్వహణ బాధ్యతలను వారిద్దరికీ అప్పగించినట్లు తెలుస్తోంది. సభను విజయవంతంగా నడిపించాలని కేసీఆర్ ప్రత్యేకంగా చెప్పినట్లు సమాచారం. సీఎంతో సోదరులిద్దరి సమావేశం ఇప్పుడు టీఆర్ఎస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

కంచర్ల భూపాల్‌రెడ్డి గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై రెండు సార్లు పోటీ చేశారు. 2014లో భూపాల్‌రెడ్డి టీడీపీలో ఉండేవారు. అప్పటి ఎన్నికల్లో నల్గొండ స్థానాన్ని పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించడంతో.. భూపాల్ రెడ్డి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత సోదరుడు కృష్ణారెడ్డితో కలసి భూపాల్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో జాయన్ అయ్యారు. 2018లో టీఆర్ఎస్ టికెట్‌పై పోటీ చేసిన భూపాల్ రెడ్డి.. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన వెంకటరెడ్డిని ఓడించారు. అప్పటి ఎన్నికల్లో మునుగోడులో రాజగోపాల్ రెడ్డి ఓటమికి కూడా ఇద్దరు సోదరులు గట్టిగానే ప్రయత్నించారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఓడిపోయినా.. 2014 ఎన్నికల కంటే ఎక్కువ ఓట్లు రావడానికి కంచర్ల సోదరులే కారణమనే వాదన కూడా ఉన్నది.

అందుకే మునుగోడు నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా ఈ సారి కంచర్ల కృష్ణారెడ్డికి అవకాశం ఇస్తారనే చర్చ జరుగుతున్నది. కోమటిరెడ్డి బ్రదర్స్‌ను ఎదుర్కునే సత్తా కంచర్ల బ్రదర్స్‌కు ఉన్నదని కేసీఆర్ కూడా భావిస్తున్నారు. అయితే ఈ నెల 20న జరిగే బహిరంగ సభలో కేసీఆర్ పార్టీ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నది. టీఆర్ఎస్ నాయకుల డిమాండ్ మేరకు కొత్త అభ్యర్థిని ప్రకటిస్తారా? లేదంటే కూసుకుంట్లకే అవకాశం ఇస్తారా అనేది తేలాల్సి ఉన్నది. అప్పటి వరకు కూసుకుంట్ల, కంచర్ల అభ్యర్థిత్వాలపై సస్పెన్స్ కొనసాగుతుంది.

First Published:  13 Aug 2022 4:25 PM GMT
Next Story