Telugu Global
Telangana

గ్రూప్-1 పరీక్ష రద్దుపై నేడు అప్పీలు చేయనున్న టీఎస్‌పీఎస్సీ

నిరుడు అక్టోబర్ 16న తొలి సారి గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేశారు. కానీ ఈ ఏడాది జూన్ 11న నిర్వహించిన పరీక్ష సమయంలో బయోమెట్రిక్ అమలు చేయలేదు.

గ్రూప్-1 పరీక్ష రద్దుపై నేడు అప్పీలు చేయనున్న టీఎస్‌పీఎస్సీ
X

జూన్ 11న నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని గత వారం హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం కోర్టులో పరీక్ష నిర్వహించిన తీరు, పరీక్ష నిర్వహణకు చేపట్టిన జాగ్రత్తలు తదితర అంశాలతో అప్పీలు చేయనున్నది. డివిజన్ బెంచ్ వద్ద ప్రధానంగా 3 అంశాలను ప్రస్తావించాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించినట్లు తెలుస్తున్నది.

నిరుడు అక్టోబర్ 16న తొలి సారి గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేశారు. కానీ ఈ ఏడాది జూన్ 11న నిర్వహించిన పరీక్ష సమయంలో బయోమెట్రిక్ అమలు చేయలేదు. ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందనే విషయాన్ని టీఎస్‌పీఎస్సీ హైకోర్టుకు స్పష్టత ఇవ్వనున్నది. ఉద్యోగ నియమాక పరీక్షకు టీఎస్‌పీఎస్సీనే ప్రయోగాత్మకంగా బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇది తప్పనిసరి కాదని చెబుతున్నది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే యూపీఎస్సీ పరీక్షల్లోనూ ఈ విధానం లేదని చెప్తోంది.

నిరుడు తొలిసారి గ్రూప్-1 పరీక్ష నిర్వహించిన సమయంలో బయోమెట్రిక్ తీసుకునేటప్పుడు ఇబ్బందులు తలెత్తాయి. అభ్యర్థుల్లో చాలా మంది ఒకే సారి పరీక్షా కేంద్రాలకు రావడం, సమయం సరిపోకపోవడం వంటి ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో ఈ సారి బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయలేదు. దీనికి బదులుగా పరీక్షా కేంద్రాల వద్ద పకడ్బంధీగా మూడంచెల తనిఖీలు చేపట్టింది. పరీక్ష జరిగిన రోజు అందిన ప్రాథమిక సమాచారం మేరకే అభ్యర్థుల సంఖ్య చెప్పామని.. ఓఎంఆర్ పత్రాల స్కానింగ్ తర్వాతే కచ్చితమైన అభ్యర్థుల సంఖ్యను ప్రకటించినట్లు టీఎస్‌పీఎస్సీ చెప్తోంది.

ఇక ప్రిలిమ్స్‌కు 2,33,506 మంది పరీక్షకు హాజరయ్యారు. అందులో ముగ్గురి కోసం పరీక్షను మళ్లీ వాయిదా వేస్తే.. మిగిలిన 2,33,503 మంది ఇబ్బంది పడతారని డివిజన్ బెంచ్‌కు చెప్పనున్నది. ఇలా పరీక్ష వాయిదా వేయడం వల్ల ఆర్థిక భారం పడటంతో పాటు ఎంతో విలువైన సమయాన్ని అభ్యర్థులు కోల్పోతారని హైకోర్టుకు తెలియజేయనున్నది. గ్రూప్-1 ఉద్యోగానికి ప్రిలిమినరీ పరీక్షే ప్రధానం కాదని.. మెయిన్స్ పరీక్ష కూడా ఉందనే విషయాన్నే డివిజన్ బెంచ్ ముందు బలంగా వాదించాలని కమిషన్ నిర్ణయించినట్లు తెలుస్తున్నది.

First Published:  25 Sep 2023 1:48 AM GMT
Next Story