Telugu Global
Telangana

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసు.. తోటి ఉద్యోగులను ప్రలోభపెట్టిన రాజశేఖర్, ప్రవీణ్

రాజశేఖర్, ప్రవీణ్‌ల వ్యవహారాన్ని కార్యాలయంలో పని చేస్తున్న అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ షమీమ్, ఔట్ సోర్సింగ్ పద్దతిలో పని చేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్ రమేశ్‌లు పసిగట్టారు.

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసు.. తోటి ఉద్యోగులను ప్రలోభపెట్టిన రాజశేఖర్, ప్రవీణ్
X

టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ పేపర్ లీక్ కేసులో సిట్ అధికారులకు రోజుకో కొత్త విషయం తెలుస్తున్నది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న రాజశేఖర్, ప్రవీణ్‌లు తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్లారు. కమిషన్ కార్యాలయంలోని కాన్ఫిడెన్షియల్ రూమ్‌లలోని కంప్యూటర్ల ఐపీ అడ్రస్‌లు మార్చి.. బయటి నుంచి వాటిని హ్యాక్ చేశారు. అలా క్వశ్చన్ పేపర్లు దొంగిలించి బయట అమ్ముకున్నారు.

అయితే రాజశేఖర్, ప్రవీణ్‌ల వ్యవహారాన్ని కార్యాలయంలో పని చేస్తున్న అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ షమీమ్, ఔట్ సోర్సింగ్ పద్దతిలో పని చేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్ రమేశ్‌లు పసిగట్టారు. వాళ్లు పేపర్లు దొంగిలిస్తున్న విషయం తెలుసుకున్నారు. అయితే, వారిద్దరూ విషయాన్ని ఉన్నతాధికారులకు చెప్తారేమో అని భయపడిన రాజశేఖర్, ప్రవీణ్ ప్రలోభాలకు గురి చేశారు. మీకు ఫ్రీగా క్వశ్చన్ పేపర్ ఇస్తాము. చదవి పరీక్ష రాయండి. ఇంత కంటే పెద్ద జాబ్‌లు సంపాదించవచ్చని వారిని మచ్చిక చేసుకున్నారు.

సిట్ అధికారులు ఈ కేసులో కొత్తగా మరో ముగ్గురు నిందితులను ఐదు రోజుల పాటు ప్రశ్నించనున్నది. వీరిలో షమీమ్, రమేశ్‌తో పాటు మరో వ్యక్తి సురేష్ ఉన్నారు. సురేష్ తప్ప మిగతా ఇద్దరు టీఎస్పీఎస్సీ ఉద్యోగులే. ఈ షమీమ్, రమేష్ నుంచి న్యూజిలాండ్‌లో ఉన్న ప్రశాంత్‌కు, సైదాబాద్‌కి చెందిన సురేష్‌కు పేపర్ లీక్ చేసినట్లు తెలిసింది. వీళ్ళు ఇంకా ఎంతమందికి లీక్ చేశారనే కోణంలో ప్రస్తుతం సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే గ్రూప్ - 1 పరీక్ష రాసి, క్వాలిఫై కాని టీఎస్పీఎస్సీ ఉద్యోగులకు కూడా పేపర్ లీక్ విషయం తెలుసా అనే కోణంలోనూ సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయంలో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

First Published:  29 March 2023 10:01 AM GMT
Next Story