Telugu Global
Telangana

నవదీప్ ఇంట్లో సోదాలు.. ఏం దొరికాయంటే..?

ప్రస్తుతానికి పోలీసులు నవదీప్ ని అరెస్ట్ చేసే అవకాశం లేదు. ఆయన్ను అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలివ్వడంతో పోలీసులు ఆ విషయంలో వేచి చూసే ధోరణిలో ఉన్నారు. సోదాలతో సరిపెట్టారు.

నవదీప్ ఇంట్లో సోదాలు.. ఏం దొరికాయంటే..?
X

మాదాపూర్‌ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం ఇది. హీరో నవదీప్ ఇంట్లో నార్కోటిక్ బ్యూరో సోదాలు చేపట్టింది. ఆ సమయంలో నవదీప్ ఇంట్లో లేడని తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి పోలీసులు నవదీప్ ని అరెస్ట్ చేసే అవకాశం లేదు. ఆయన్ను అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలివ్వడంతో పోలీసులు ఆ విషయంలో వేచి చూసే ధోరణిలో ఉన్నారు. ప్రస్తుతానికి సోదాలతో సరిపెట్టారు. అయితే నవదీప్ ఇంట్లో ఏమేం దొరికాయి అనే విషయంలో మాత్రం సమాచారం బయటకు రానివ్వలేదు.

రామ్ చంద్ తో లింకులు..

మాదాపూర్‌ లోని ఫ్రెష్‌ లివింగ్‌ అపార్ట్‌ మెంట్స్‌ లో జరిగిన ఓ పార్టీతో ఈ వ్యవహారం బయటపడింది. అప్పట్లో ఓ ఫైనాన్షియర్ ని అరెస్ట్ చేయడంతో సినీ ఇండస్ట్రీతో ఉన్న సంబంధాలు బయటకొచ్చాయి. మొత్తం 11మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేశారు. వీరిలో రాంచంద్ అనే వ్యక్తితో సినీ నటుడు నవదీప్ కి సంబంధాలు ఉన్నట్టు తేలింది. రాంచంద్ ఇచ్చిన సమాచారం మేరకు నవదీప్ ని కూడా ఈ కేసులో చేర్చారు న్యాబ్ అధికారులు. అయితే నవదీప్ ముందు జాగ్రత్తగా కోర్టుని ఆశ్రయించారు. తనను అరెస్ట్ చేయనీయకుండా కోర్టు ఆర్డర్ తెచ్చుకున్నారు.

హైదరాబాద్ లో ఎప్పుడు డ్రగ్స్ వ్యవహారం బయటపడినా టాలీవుడ్ తో సంబంధాలున్నట్టు తేలుతోంది. గతంలో కూడా పలువురు దర్శక నిర్మాతలు, నటులను కూడా పోలీసులు విచారణకు పిలిపించారు. కానీ అప్పట్లో ఏదీ తేలలేదు. ఇప్పుడు మళ్లీ టాలీవుడ్ పేరు ప్రముఖంగా వినిపించినా, నవదీప్ మాత్రమే తెరపైకి వచ్చారు. న్యాబ్ విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి రావాల్సి ఉంది.

First Published:  19 Sep 2023 5:10 AM GMT
Next Story