Telugu Global
Telangana

మునుగోడుపై టీఆర్ఎస్ ప్రత్యేక వ్యూహం

నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కీలకమైన కాంగ్రెస్ నాయకులను టీఆర్ఎస్‌లో చేర్పించేలా ప్రయత్నాలు ప్రారంభించారు. మంత్రి జగదీశ్ ఆదేశాల మేరకు ఇప్పటికే టీఆర్ఎస్ నేతలు ఆ పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తున్నది.

మునుగోడుపై టీఆర్ఎస్ ప్రత్యేక వ్యూహం
X

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీని వీడి బీజేపీలో చేరుతారనే వార్తలు వచ్చాయి. అయితే తాను పార్టీని వీడటం లేదని స్పష్టం చేశారు. అదే సమయంలో పరోక్షంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై వ్యాఖ్యలు చేశారు. రేవంత్ టీపీసీసీ అధ్యక్షుడు అయిన దగ్గర నుంచి కోమటిరెడ్డి బ్రదర్స్ అసంతృప్తితో ఉన్నారు. వెంకటరెడ్డి తనకే పీసీసీ పదవి వస్తుందని భావించారు. కానీ, కథ అడ్డం తిరగడంతో మొదటి నుంచి రేవంత్‌పై విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో కోమటిరెడ్డి బ్రదర్స్ పార్టీని వీడతారని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి.

కాగా, రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడానికి అంతా సిద్ధం చేసుకున్నారు. కానీ చివరి నిమిషంలో బుజ్జగింపులతో తాత్కాలికంగా తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. అధికార టీఆర్ఎస్ పార్టీ మాత్రం రాజగోపాల్ ఇవ్వాళ కాకపోయినా.. మరో నెల రోజుల తర్వాత అయినా కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి.. బీజేపీలో చేరతారని భావిస్తోంది. టీఆర్ఎస్ పార్టీ ముందుగానే అలెర్ట్ అయి ఆ నియోజకవర్గంపై ప్రత్యేక వ్యూహాన్ని సిద్ధం చేసినట్లు తెలుస్తున్నది.

ఇప్పటికే ఉపఎన్నికలు వస్తాయనే గట్టుప్పల్‌ను మండలంగా ప్రకటించినట్లు రాజగోపాల్ వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ఆయన వ్యాఖ్యలను ఖండించింది. కానీ తెర వెనుక మాత్రం మునుగోడు లక్ష్యంగా మరిన్ని కార్యక్రమాలు చేపట్టడానికి ప్రణాళిక సిద్దం చేసింది. మునుగోడుపై మంత్రి జగదీశ్ ప్రత్యేక శ్రద్ద చూపిస్తున్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కీలకమైన కాంగ్రెస్ నాయకులను టీఆర్ఎస్‌లో చేర్పించేలా ప్రయత్నాలు ప్రారంభించారు. మంత్రి జగదీశ్ ఆదేశాల మేరకు ఇప్పటికే టీఆర్ఎస్ నేతలు ఆ పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తున్నది.

ఇక ఆ నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న పనులపై కూడా ప్రభుత్వం దృష్టిపెట్టింది. డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టాల్సిన రిజర్వాయర్లను త్వరగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటోంది. అంతే కాకుండా ఆ ప్రాజెక్టు కింద ఉన్న భూనిర్వాసితులకు త్వరగా నష్టపరిహారం అందించాలని భావిస్తోంది. గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు కూడా ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తున్నది. ఆరు నెలలుగా నియోజకవర్గం మొఖమే చూడని రాజగోపాల్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారు. పైగా, కళ్యాణలక్ష్మి చెక్కులు మంత్రి జగదీశ్ కారణంగానే వచ్చాయని ప్రచారం చేస్తున్నారు. ఇలా ఒకవైపు అభివృద్ధి పథకాలు అమలు చేస్తూ.. మరోవైపు రాజగోపాల్ రెడ్డిని టార్గెట్ చేసుకొని ఆరోపణలు చేయడం ద్వారా లబ్ది పొందాలని టీఆర్ఎస్ భావిస్తోంది.

2018 ఎన్నికల్లో అంతర్గత విభేదాల కారణంగా మునుగోడులో ఓడిపోయామని.. ఈసారి మాత్రం గెలుపే లక్ష్యంగా పని చేయాలని టీఆర్ఎస్ అధినాయకత్వం ఆదేశించింది. రాజగోపాల్ రెడ్డి ఇవ్వాళ కాకపోయినా రేపైనా రాజీనామా చేస్తారని.. ఆయన ప్రకటనలు పట్టించుకోకుండా.. టీఆర్ఎస్ ఎన్నికలు ఉన్నాయనే విధంగా నియోజకవర్గంలో పని చేయాలని చెప్తోంది. ముందుగా నియోజకవర్గంలో పూర్తి పట్టు సాధించాలని స్థానిక నాయకులకు సూచించింది. మరి టీఆర్ఎస్ వ్యూహాలు ఏ మేరకు పని చేస్తాయో చూడాల్సి ఉన్నది.

First Published:  25 July 2022 6:56 AM GMT
Next Story