Telugu Global
Telangana

రేపు టీఆర్ఎస్ఎల్పీ, పార్లమెంటరీ పార్టీ సమావేశాలు.. మోడీకి కౌంటర్ గ్యారెంటీ!

అక్టోబర్ 4న దసరా రోజు పార్టీ పేరు మార్పు కోసం టీఆర్ఎస్ఎల్పీ, పార్లమెంటరీ పార్టీ సమావేశాలతో పాటు రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. మళ్లీ 40 రోజుల తర్వాత ఈ సమావేశాలు జరుగనున్నాయి.

రేపు టీఆర్ఎస్ఎల్పీ, పార్లమెంటరీ పార్టీ సమావేశాలు.. మోడీకి కౌంటర్ గ్యారెంటీ!
X

తెలంగాణ పర్యటనలో ప్రధాని మోడీ చేసిన ఆరోపణలకు సీఎం కేసీఆర్ కౌంటర్ ఇవ్వబోతున్నారా? మోడీ చేసిన అబద్దపు ప్రచారాన్ని తిప్పి కొట్టడానికి పూర్తిగా సన్నద్ధం అవుతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తనకు తానుగా కౌంటర్ ఇవ్వడం కాకుండా ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యవర్గ సభ్యులందరితో కూలంకషంగా చర్చించి.. గట్టి సమాధానం చెప్పాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు నవంబర్ 15న (మంగళవారం) టీఆర్ఎస్ లెజిస్లేటీవ్ పార్టీ, పార్లమెంటరీ పార్టీ సమావేశాలు ఏర్పాటు చేశారు. అలాగే పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం కూడా జరుగనున్నది.

అక్టోబర్ 4న దసరా రోజు పార్టీ పేరు మార్పు కోసం టీఆర్ఎస్ఎల్పీ, పార్లమెంటరీ పార్టీ సమావేశాలతో పాటు రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. మళ్లీ 40 రోజుల తర్వాత ఈ సమావేశాలు జరుగనున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నాయకులకు సమాచారం కూడా అందింది. మునుగోడు ఉపఎన్నిక విజయం, ఫామ్‌హౌస్ ఘటన అనంతరం పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరుగనుండటంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొన్నది.

ఇటీవల తెలంగాణలో పర్యటించిన మోడీ.. నేరుగా సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేశారు. సింగరేణి విషయంలో కూడా అబద్దాలను ప్రచారం చేశారు. స్వయంగా పీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి అసంబద్ద ఆరోపణలు చేయడం రాజకీయ విశ్లేషకులను కూడా ఆశ్చర్యపరిచింది. అప్పటి నుంచి మోడీ ఆరోపణలపై సీఎం కేసీఆర్ స్పందిస్తారని అందరూ ఎదురు చూస్తున్నారు. ఒక ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్ ఇస్తే అంతగా లాభం ఉండదని.. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ముఖ్య నాయకులతో చర్చించి.. ఘాటైన సమాధానం ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారు.

ఇప్పటికే మోడీతో ఢీ అంటే ఢీ అనేలా దూసుకొని వెళ్తున్న కేసీఆర్.. జాతీయ స్థాయిలో కూడా బీఆర్ఎస్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. ఈ విషయంపై కూడా సమావేశాల్లో చర్చ జరిగే అవకాశం ఉన్నది. బీజేపీని రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో ఎలా ఎదుర్కోవాలనే విషయాలపై ఒక ప్రణాళిక సిద్ధం చేయనున్నారు. రాష్ట్ర నాయకుల మాటలకు కౌంటర్లు ఇవ్వడం కంటే.. నేరుగా మోడీ, బీజేపీ అగ్రనాయకత్వాన్ని టార్గెట్ చేస్తే మంచి మైలేజ్ ఉంటుందని కూడా అంచనా వేస్తున్నారు. అంతే కాకుండా సీఎం కేసీఆర్ నేరుగా మోడీనే ఢీకొంటున్నారనే సందేశం ప్రజల్లోకి వెళ్లే అవకాశం కూడా ఉంటుంది.

ముందస్తు ఎన్నికలకు ఏమైనా వెళ్తారా అనే చర్చ కూడా జరుగుతోంది. అయితే సీఎం కేసీఆర్ మనసులో ఏముందో గ్రహించడం అంత తేలికైన విషయం కాదు. బీజేపీని జాతీయ స్థాయిలో ఎలా ఎదుర్కోవాలనే చర్చ జరగడం ఖాయం. అదే సమయంలో ముందస్తుపై కూడా ఎమ్మెల్యేలు, పార్టీ ప్రతినిధుల అభిప్రాయాలు తీసుకునే అవకాశం ఉన్నది. మునుగోడు గెలుపు ఉత్సాహంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఆ నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యపోనక్కరలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా రేపు సాయంత్రం కల్లా కేసీఆర్ ఏమనుకుంటున్నారో తేలిపోనున్నది.

First Published:  14 Nov 2022 8:29 AM GMT
Next Story