Telugu Global
Telangana

ప్రజల్లోకి బీఆర్ఎస్‌ను తీసుకెళ్లేందుకు భారీ ప్లాన్

టీఆర్ఎస్ ప్రభుత్వం రెండో టర్మ్ అధికారంలోకి వచ్చి డిసెంబర్ 12కు నాలుగేళ్లు గడుస్తుంది. అప్పటిలోగా ఈసీ కనున బీఆర్ఎస్‌పై తుది నిర్ణయం తీసుకుంటే.. భారీగా విజయోత్సవాలు చేయాలని నిర్ణయించింది.

ప్రజల్లోకి బీఆర్ఎస్‌ను తీసుకెళ్లేందుకు భారీ ప్లాన్
X

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పేరును భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్చుతూ నిర్ణయం తీసుకొని రేపటికి సరిగ్గా రెండు నెలలు. జాతీయ రాజకీయాల్లోకి టీఆర్ఎస్‌ను తీసుకెళ్లాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ దసరా రోజు (అక్టోబర్ 5) పార్టీ జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించి పార్టీ పేరు మార్పు రెజల్యూషన్ పాస్ చేయించారు. అయితే ఇంత వరకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ) పార్టీ పేరు మార్పుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాగా, డిసెంబర్ 8తో గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల తంతు ముగియనుండటంతో.. ఆ తర్వాత బీఆర్ఎస్‌పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.

పేరు మార్పుపై ఈ నెలలోనే తుది నిర్ణయం వెలువడనుండటంతో పార్టీ తరపున భారీగా కార్యక్రమాలు నిర్వహించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రజల్లోకి బీఆర్ఎస్ పేరును తీసుకెళ్లేందుకు అవసరమైన మార్గాలను అన్వేషిస్తున్నారు. రెండు దశాబ్దాలకు పైగా టీఆర్ఎస్ పార్టీ రాజకీయాలు చేస్తోంది. ఉద్యమ పార్టీగా మొదలైన ప్రస్థానం.. ప్రత్యేక రాష్ట్రంలో కూడా విజయవంతంగా కొనసాగుతోంది. మూడో సారి తెలంగాణలో అధికారంలోకి రావాలని టీఆర్ఎస్ దృఢ సంకల్పంతో ఉన్నది. ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయంలో ఉండటంతో బీఆర్ఎస్ పేరును ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లే ప్రయత్నం చేయనున్నది.

అక్టోబర్ 5న పార్టీ పేరు మార్పు నిర్ణయం తీసుకోగా.. ఇప్పటి వరకు ఈసీఐ నుంచి ఎలాంటి గ్రీన్ సిగ్నల్ రాలేదు. ప్రోటోకాల్ ప్రకారం ఇప్పటికే పేరు మార్పుకు సంబంధించిన అభ్యంతరాల స్వీకరణకు పత్రికా ప్రకటనలు కూడా ఇచ్చారు. 30 రోజుల్లోగా దీనికి సంబంధించిన ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా తెలయజేయాలని కోరారు. దీని గడువు డిసెంబర్ 6న ముగియనున్నది. మరోవైపు డిసెంబర్ 8న రెండు రాష్ట్రాల ఎన్నికల తంతు కూడా ముగుస్తుంది. ఆ తర్వాత ఈసీఐ పార్టీ పేరు మార్పపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తున్నది.

టీఆర్ఎస్ ప్రభుత్వం రెండో టర్మ్ అధికారంలోకి వచ్చి డిసెంబర్ 12కు నాలుగేళ్లు గడుస్తుంది. అప్పటిలోగా ఈసీ కనున బీఆర్ఎస్‌పై తుది నిర్ణయం తీసుకుంటే.. భారీగా విజయోత్సవాలు చేయాలని నిర్ణయించింది. ఆ రోజుతో పార్టీ ఐదో ఏడాదిలోకి అడుగు పెడుతుంది. అంతే కాకుండా ఎన్నికలకు సరిగ్గా ఏడాది గడువు ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ పేరు మార్పును ఘనంగా నిర్వహించడం ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు.

అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పార్టీ శ్రేణులు, ఎమ్మెల్యేలు పార్టీ పేరుకు సంబంధించి భారీ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ప్రజలకు టీఆర్ఎస్, బీఆర్ఎస్ వేర్వేరు కాదని.. కేవలం పార్టీ పేరు మాత్రమే మారిందనే సందేశం తీసుకెళ్లడమే ఈ సంబరాల లక్ష్యం కానున్నది. అలాగే, కారు గుర్తులో ఎలాంటి మార్పు ఉండదని.. ప్రజలు ఎలాంటి గందరగోళానికి గురి కాకుండా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులదే అని సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. కారు గుర్తు ఉండటం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా చూడాల్సిన బాధ్యత ఇప్పుడు టీఆర్ఎస్ శ్రేణులపై ఉన్నది. మొత్తానికి డిసెంబర్ నెలలో బీఆర్ఎస్ సంబరాలు వాడవాడలా చేయడానికి పార్టీ రంగం సిద్ధం చేస్తున్నది.

First Published:  4 Dec 2022 1:13 AM GMT
Next Story