Telugu Global
Telangana

ఫ్రీడమ్ ర్యాలీలో రబ్బర్ బుల్లెట్ రచ్చ..

ర్యాలీ ప్రారంభానికి సూచికగా గాల్లోకి బుల్లెట్ కాల్చి ఫ్రీడమ్ ర్యాలీని మొదలు పెట్టాల్సి ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన తెలంగాణ క్రీడా శాఖ మంత్రి, మాజీ టీజీవో అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపారు.

ఫ్రీడమ్ ర్యాలీలో రబ్బర్ బుల్లెట్ రచ్చ..
X

మహబూబ్‌నగర్‌లో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ నిర్వహించిన ఫ్రీడమ్ ర్యాలీ ప్రారంభించే సమయంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ తుపాకీ కాల్చడం సంచలనంగా మారింది. ర్యాలీ ప్రారంభానికి సూచికగా గాల్లోకి బుల్లెట్ కాల్చి ఫ్రీడమ్ ర్యాలీని మొదలు పెట్టాల్సి ఉంది. ఈ క్రమంలో సహజంగా పోలీసులు తుపాకీతో గాల్లోకి కాల్పులు జరుపుతారు, లేదా నిర్వాహకులే జెండా ఊపుతారు. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన తెలంగాణ క్రీడా శాఖ మంత్రి, మాజీ టీజీవో అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపారు. వెంటనే ర్యాలీ మొదలైంది. అయితే ఆ వీడియో సోషల్ మీడియాలోకి రాగానే రచ్చ మొదలైంది. ఒక మంత్రి తుపాకీ ఎలా కాలుస్తారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. పోలీసుల చేతుల్లోనుంచి తుపాకీ లాక్కొని మంత్రి కాల్చారంటూ ట్రోలింగ్ మొదలైంది. దీంతో వెంటనే మంత్రి శ్రీనివాస్ గౌడ్ వివరణ ఇచ్చారు.

రబ్బర్ బుల్లెట్.. కాదు కాదు బుల్లెట్టే లేదు..

తాను క్రీడామంత్రినని, ఇలా కాల్పులు జరపడానికి తనకు అర్హత ఉంటుందని పేర్కొన్నారు శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. ర్యాలీ ప్రారంభం కావాలంటే, సౌండ్ కోసం రబ్బర్ బుల్లెట్ కాలుస్తారని, తానుకూడా అదే పని చేశానని చెప్పారు. అంతే కాదు తాను ఆల్ ఇండియా రైఫెల్ అసోసియేషన్ మెంబర్‌ నని, తానూ చదువుకున్నవాడినని, నిజమైన బుల్లెట్‌తో కాల్చకూడదన్న సంగతి తనకూ తెలుసని పేర్కొన్నారాయన. తాను పేల్చింది రబ్బర్ బుల్లెట్ కాదు నిజమైన బుల్లెట్ అని తేలితే రాజీనామాకు సైతం సిద్ధమని చెప్పారు. ఆ తర్వాత మరోసారి వివరణ ఇచ్చారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. అసలా తుపాకీలో బుల్లెట్టే లేదని, అది కేవలం డమ్మీ తుపాకి అని చెప్పారు. స్పోర్ట్స్ ఈవెంట్స్ కోసం ఆ డమ్మీ తుపాకీ వాడతారని, అది పేలిస్తే కేవలం సౌండ్ మాత్రమే వస్తుందని బుల్లెట్ బయటకు రాదని అన్నారు.

మొత్తమ్మీద మంత్రి శ్రీనివాస్ గౌడ్ తుపాకీ పేల్చిన వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మంత్రి తుపాకీ పేల్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో వెంటనే ఆయన వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. చివరకు అసలా తుపాకీలో బుల్లెట్టే లేదని, అది కేవలం సౌండ్ కోసమే వాడే డమ్మీ తుపాకీ అని పోలీసులు తేల్చడంతో వివాదం సద్దుమణిగినట్టే అనుకోవాలి.

First Published:  13 Aug 2022 12:54 PM GMT
Next Story