Telugu Global
Telangana

రాజగోపాల్ రెడ్డిపై ఈసీకి టీఆర్ఎస్ నేతల ఫిర్యాదు

ఇదిలా ఉండగా ఇవాళ టీఆర్ఎస్ ప్రతినిధుల బృందం రాష్ట్ర ఎన్నికల అధికారిని కలిసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు.

రాజగోపాల్ రెడ్డిపై ఈసీకి టీఆర్ఎస్ నేతల ఫిర్యాదు
X

మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణలో రాజకీయ కాక రేపుతోంది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. సవాళ్లు - ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి బీజేపీ రూ.18 వేల కోట్ల విలువైన కాంట్రాక్టు ఇచ్చిందని, అందుకే ఆయన ఆ పార్టీలో చేరారని టీఆర్ఎస్ నేత కేటీఆర్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన చేసిన ఆరోపణలపై రాజగోపాల్ రెడ్డి కూడా స్పందించారు. కేటీఆర్ చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేయనని, రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించారు.

ఇదిలా ఉండగా ఇవాళ టీఆర్ఎస్ ప్రతినిధుల బృందం రాష్ట్ర ఎన్నికల అధికారిని కలిసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. రాజగోపాల్ రెడ్డి రూ.18 వేల కోట్ల విలువైన కాంట్రాక్ట్ దక్కించుకొని బీజేపీలో చేరారని, ఇది ఒక క్విడ్ ప్రోకో అని టీఆర్ఎస్ నేతలు లింగయ్య యాదవ్, గాదరి కిషోర్ తదితరులు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

తనపై టీఆర్ఎస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేయడం పట్ల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. ఏది నిజమో, ఏది అబద్ధమో తేల్చుకునే సమయం వచ్చిందన్నారు. బీజేపీ ప్రభుత్వం నుంచి తాను రూ. 18 వేల కోట్ల విలువైన కాంట్రాక్ట్ దక్కించుకొని ఆ పార్టీలో చేరినట్లు కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఆయన తనపై చేసిన క్విడ్ ప్రోకో ఆరోపణలు నిజమని నిరూపించాలని సవాల్ విసిరారు. ఇందుకు 24 గంటల సమయం ఇస్తున్నానని, ఒకవేళ ఆ ఆరోపణలు నిజమని నిరూపించలేకపోతే పరువు నష్టం దావా వేస్తానని రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు.

First Published:  9 Oct 2022 11:26 AM GMT
Next Story