Telugu Global
Telangana

అస్సోం సీఎంను నిలదీసిన టీఆర్‌ఎస్ నేత.. అసలేం జరిగింది?

తెలంగాణలో టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య యుద్ధవాతావరణం ఉన్న నేపథ్యంలోనే కార్యక్రమానికి వచ్చిన అస్సోం సీఎం హిమంత బిశ్వశర్మ.. కేసీఆర్‌పై రాజకీయ విమర్శలు చేస్తూ పరిస్థితిని పరోక్షంగా రెచ్చగొట్టారు.

అస్సోం సీఎంను నిలదీసిన టీఆర్‌ఎస్ నేత.. అసలేం జరిగింది?
X

వినాయక నిమజ్జన‌ ఉత్సవాల్లోనూ రాజకీయం రాజుకుంది. భాగ్యనగర్‌ గణేష్ ఉత్సవ్‌ సమితి ఈ కార్యక్రమానికి అస్సోం సీఎంను ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. ఇప్పటికే తెలంగాణలో టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య యుద్ధవాతావరణం ఉన్న నేపథ్యంలోనే కార్యక్రమానికి వచ్చిన అస్సోం సీఎం హిమంత బిశ్వశర్మ.. కేసీఆర్‌పై రాజకీయ విమర్శలు చేస్తూ పరిస్థితిని పరోక్షంగా రెచ్చగొట్టారు.

యాత్రలో పాల్గొన్న అస్సోం సీఎం వీలుచిక్కినప్పుడల్లా మాట్లాడేందుకు ప్రయత్నించారు. చార్మినార్ వద్ద ఏర్పాటు చేసిన వేదికపై రెచ్చగొట్టే ప్రసంగాలకు అస్సోం సీఎం సిద్ధమవుతున్నారని తెలుసుకున్న పోలీసులు వారించారు. ఆ తర్వాత తన వాహనం నుంచే మీడియాతో మాట్లాడుతూ ఆయన సాగారు. అనంతరం మోజంజాహి మార్కెట్ వద్ద ఏర్పాటు చేసిన వేదికపై హిమంత బిశ్వ శ‌ర్మ‌ చేరుకుని రాజకీయ విమర్శలకు దిగారు. అంతకు ముందే గణేష్ ఉత్సవ్ సమితి ప్రధాన కార్యదర్శి, బీజేపీ నేత కూడా అయిన భగవంతరావు.. రాష్ట్ర సీఎంకు వ్యతిరేకంగా రాజకీయ విమర్శలు చేశారు. భక్తి కార్యక్రమంలో ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకోవడంపై అక్కడున్న టీఆర్ఎస్ కార్యకర్తలు అభ్యంతరం తెలిపారు.

వేదికకు సమీపంలో ఏర్పాటు చేసిన 20 అడుగుల సీఎం కేసీఆర్‌, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫ్లెక్సీపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. భాగ్యనగర్‌ గణేష్ ఉత్సవ్ సమితి సభ్యులు కూడా ఫ్లెక్సీని తొలగించాలంటూ డిమాండ్ చేశారు. ఆ సమయంలో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వివాదం మొదలవడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఫ్లెక్సీని కాస్త వెనక్కు జరిపించి సమస్యను పరిష్కరించారు.

కేసీఆర్‌, తలసాని ఫొటోలతో కూడిన‌ ఫ్లెక్సీని తొలగించాలంటూ ఎందుకు డిమాండ్ చేశారంటూ ఉత్సవ్‌ సమితి సభ్యులను నిలదీసేందుకు గోషామహల్‌ టీఆర్‌ఎస్ నాయకుడు నందకిషోర్ వేదిక మీదకు వెళ్లారు. ఆ సమయంలో ఉత్సవ్‌ కమిటీ సభ్యులు.. నందకిషోర్‌కు సర్ధిచెప్పి వేదిక మీదే కూర్చోవాల్సిందిగా కోరారు. అంతలోనే ఉత్సవ్ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావు సీఎం కేసీఆర్‌పై విమర్శలకు దిగారు. పక్కనే అస్సోం ముఖ్యమంత్రి కూడా ఉన్నారు. కేసీఆర్‌ను విమర్శించడాన్ని తట్టుకోలేకపోయిన నందకిషోర్.. దైవ కార్యక్రమంలో రాజకీయ విమర్శలు ఎందుకంటూ నిలదీస్తూ మైక్‌ను కిందకు లాగారు.

దాంతో బీజేపీ కార్యకర్తలు.. నందకిషోర్‌ను బలవంతంగా అక్కడి నుంచి తీసుకెళ్లారు. నందకిషోర్ అస్సోం సీఎం మైక్‌ను లాక్కున్నారని బయటకు వచ్చిన వీడియోలో.. టీఆర్‌ఎస్ నేత అడ్డుకున్నది భగవంతరావు ప్రసంగాన్ని అన్నది స్పష్టంగా అర్థమవుతోంది. మైక్‌ను లాగేసిన నందకిషోర్ ఆ తర్వాత అస్సోం ముఖ్యమంత్రిని నిలదీసే ప్రయత్నం చేశారు. ''మీరు వచ్చిన పనేంటి?. దేవుడికి పూజలు చేసి వెళ్లాలి గానీ.. ధర్మవేదికపై మీ రాజకీయాలా'' అంటూ నిలదీశారు. నందకిషోర్‌ను అనంతరం పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.

వేదికలు ఏర్పాటు చేసిందే ప్రభుత్వం- తలసాని

అస్సోం సీఎం తన పర్యటనలో రాజకీయ విమర్శలు, రెచ్చగొట్టే మాటలు మాట్లాడడాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ తప్పుపట్టారు. చార్మినార్ నుంచి ట్యాంక్ బండ్ వరకు 19 వేదికలను ప్రభుత్వమే ఏర్పాటు చేసిందని, మైకులు కూడా సిద్ధం చేసిందని.. అలాంటి వేదికల మీద నుంచి తిరిగి కేసీఆర్‌పై రాజకీయ విమర్శలు చేయడం ఏమిటని బీజేపీ నేతలను ప్రశ్నించారు. హైదరాబాద్‌లో మత ఘర్షణలు సృష్టించేందుకే అస్సోం సీఎం వచ్చినట్టుగా ఉందని మంత్రి దయాకర్ రావు ఆరోపించారు.

అయితే మొత్తం వ్యవహారంలో భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ్ సమితిపైనా విమర్శలు వస్తున్నాయి. వారు బీజేపీకి వంతపాడుతూ బీజేపీ నేతలను రప్పించి, రాజకీయ విమర్శలు చేస్తుంటే వారించకపోగా.. వారే స్వయంగా ముఖ్యమంత్రిపై విమర్శలు చేయడం ద్వారా పరిస్థితిని రెచ్చగొట్టారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

First Published:  10 Sep 2022 3:10 AM GMT
Next Story