Telugu Global
Telangana

ఉమ్మడి నల్గొండ.. ఉప ఎన్నికల సెంటిమెంట్‌లో టీఆర్ఎస్సే విజేత

ఉమ్మడి నల్గొండ జిల్లా వరకు టీఆర్ఎస్‌కి తిరుగులేదని తేలిపోయింది. ఇప్పుడు మూడోసారి ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరో ఉప ఎన్నిక కోసం టీఆర్ఎస్ సిద్ధమైంది, హ్యాట్రిక్ కొట్టడానికి రెడీ అయింది.

ఉమ్మడి నల్గొండ.. ఉప ఎన్నికల సెంటిమెంట్‌లో టీఆర్ఎస్సే విజేత
X

2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో ఇప్పటి వరకు 4 ఉప ఎన్నికలు జరిగాయి. రెండు సార్లు బీజేపీ గెలుపొందగా, మరో రెండు సార్లు టీఆర్ఎస్ విజేతగా నిలిచింది. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వరకు టీఆర్ఎస్‌కి తిరుగులేదని తేలిపోయింది. ఇప్పుడు మూడోసారి ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరో ఉప ఎన్నిక కోసం టీఆర్ఎస్ సిద్ధమైంది, హ్యాట్రిక్ కొట్టడానికి రెడీ అయింది.

నల్గొండలో టీఆర్ఎస్‌దే హవా..

నల్గొండ పార్లమెంట్ పరిధిలోకి వచ్చే ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో, 2018లో జరిగిన ఎన్నికల్లో ఆరింటిలో టీఆర్ఎస్ విజయం సాధించింది. హుజూర్ నగర్ నుంచి మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. అయితే ఆయన నల్గొండ ఎంపీ స్థానానికి కూడా పోటీ చేసి గెలవడంతో.. అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ భార్య పద్మావతి పోటీ చేయగా, టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి ఆమెపై విజయం సాధించారు. దీంతో కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం కోల్పోయినట్టయింది.

ఇక నాగార్జున సాగర్ విషయానికొస్తే.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణంతో అక్కడ 2021లో ఉప ఎన్నికలొచ్చాయి. ఆయన తనయుడు నోముల భరత్ టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఇక్కడ సిట్టింగ్ స్థానాన్ని టీఆర్ఎస్ నిలబెట్టుకుంది.

ఇప్పుడు ముచ్చటగా మూడో ఉప ఎన్నిక. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇక్కడ రాజీనామా చేసి బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా సెంటిమెంట్ ప్రకారం చూసుకుంటే ఇక్కడ టీఆర్ఎస్ ది హ్యాట్రిక్ విజయం అయ్యే అవకాశముంది. కాంగ్రెస్ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కచ్చితంగా టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధిస్తారనే సెంటిమెంట్ కూడా ఉంది. ప్రస్తుత పరిస్థితి చూసినా టీఆర్ఎస్‌కే ఎక్కువ విజయావకాశాలున్నట్టు తెలుస్తోంది. రాజగోపాల్ రెడ్డి రెంటీకీ చెడ్డ రేవడిలా మారారు. అటు కాంగ్రెస్ నేతలు ఆయనతోపాటు కలసి రాలేదు, ఇటు బీజేపీలో ఆయనకు క్యాడర్ లేదు. ఇక కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేస్తే అది మురిగిపోయినట్టేననే ప్రచారం కూడా ఉంది. దీంతో ఇప్పటికైనా తమకు అవకాశం వచ్చిందని, ఇప్పుడైనా అధికార పార్టీ తరపునే ఎమ్మెల్యేని గెలిపించుకుంటామని ఆలోచిస్తున్నారు మునుగోడు ప్రజలు. మునుగోడులో టీఆర్ఎస్ విజయం సాధిస్తే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టినట్టవుతుంది.

First Published:  4 Oct 2022 7:08 AM GMT
Next Story