Telugu Global
Telangana

టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన చట్టం.. పార్టీకే మైనస్ అయ్యిందా?

ఇప్పుడు ఈ చట్టమే టీఆర్ఎస్ పార్టీకి మైనస్ అయ్యింది. పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో సీన్ రివర్స్ అయ్యింది. ఏకంగా మున్సిపల్ చైర్మన్లు, మేయర్లే టీఆర్ఎస్ పార్టీకి ఝలక్ ఇచ్చారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన చట్టం.. పార్టీకే మైనస్ అయ్యిందా?
X

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తిరుగులేని రాజకీయ శక్తిగా టీఆర్ఎస్ పార్టీ మారిపోయింది. కేవలం అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లోనే కాకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పూర్తి సత్తాచాటింది. రాష్ట్రంలోని మెజార్టీ జెడ్పీలు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు టీఆర్ఎస్ వశం అయ్యాయి. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల్లో కొన్ని చోట్ల పోటాపోటీ మెజార్టీ వచ్చినా.. ఇతర పార్టీల కార్పొరేటర్లు, కౌన్సిలర్ల మద్దతుతో 90 శాతం మున్సిపల్ చైర్మన్లు, మేయర్ల సీట్లను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది.

కాగా, ఇతర పార్టీ నుంచి వచ్చిన వారితో ఎప్పటికైనా ఇబ్బందేనని.. ఒకవేళ సొంత పార్టీలో అసమ్మతి చోటు చేసుకున్నా.. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో అధికారం కోల్పోవలసి వస్తుందని అంచనా వేసుకుంది. దీంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో చైర్మన్లు, మేయర్లపై 4 ఏళ్ల వరకు అవిశ్వాస తీర్మానం పెట్టుకూడదనే కొత్త మున్సిపల్ చట్టాన్ని తీసుకొని వచ్చింది. ఈ కొత్త చట్టం కారణంగా.. కౌన్సిలర్లు, కార్పోరేటర్లతో చైర్మన్లు, మేయర్లకు విభేదాలు వచ్చినా.. అవిశ్వాస తీర్మానం పెట్టే వీలుండదు. ఇది అధికార పార్టీకి కలసి వస్తుందని భావించింది.

అధికార టీఆర్ఎస్ పార్టీ తమకు అనుకూలంగా చట్టాన్ని మార్చుకుందని అప్పట్లో విమర్శలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ చట్టమే టీఆర్ఎస్ పార్టీకి మైనస్ అయ్యింది. పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో సీన్ రివర్స్ అయ్యింది. ఏకంగా మున్సిపల్ చైర్మన్లు, మేయర్లే టీఆర్ఎస్ పార్టీకి ఝలక్ ఇచ్చారు. స్థానిక నాయకత్వం, కౌన్సిలర్లు, కార్పొరేటర్లతో ఉన్న విభేదాల కారణంగా టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్, బీజేపీకి వలస వెళ్లారు. ఎలాగో కొత్త చట్టం కారణంగా తమపై వేటు పడదనే ధీమాతో మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు.

టీఆర్ఎస్ నాయకులు, కార్పొరేటర్లతో ఉన్న విభేదాలతో బడంగ్‌పేట్ కార్పొరేషన్ మేయర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతకు ముందే ఆదిభట్ల మున్సిపల్ చైర్మన్.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. తుక్కుగూడ మున్సిపాలిటీ చైర్మన్ పదవి కాస్తా టీఆర్ఎస్ నుంచి బీజేపీ చేతుల్లోకి వెళ్లింది. ఇలా జీహెచ్ఎంసీని ఆనుకొని ఉన్న కార్పొరేషన్, మున్సిపాలిటీల్లోనే టీఆర్ఎస్‌కు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. వాళ్లందరూ పార్టీ మారినా.. అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం లేకపోవడం కలవర పరుస్తోంది. ఇప్పుడు ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలో మేయర్ ఒక పార్టీలో ఉంటే.. మెజార్టీ సభ్యులు టీఆర్ఎస్‌లో ఉన్నారు. మెజార్టీ ఉన్నా.. వాళ్లు ప్రతిపక్షంగా మారిపోయారు. ఇది ఇబ్బందికరంగా మారింది.

ఈ గొడవలు కేవలం ఈ మూడు ప్రాంతాల్లోనే కాదు. కోదాడ, నల్గొండ, నిర్మల్, సిరిసిల్ల, తాండూరు మున్సిపాలిటీల్లో కూడా ఉన్నాయి. అక్కడ మేయర్, మున్సిపల్ చైర్మన్లతో కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలోని ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నాయకులు రెండు వర్గాలుగా విడిపోవడంతో.. దాని ప్రభావం ఆయా మున్సిపాలిటీలపై కూడా పడుతోంది.

తాండూరులో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి వర్గాలు మొదటి నుంచి ఆధిపత్యం కోసం పోరాడుతున్నాయి. ఇక్కడ మున్సిపల్ చైర్మన్ పదవి మళ్లీ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ముందుగా ఒప్పందం చేసుకున్న మేరకు రెండున్నరేళ్లు ముగిసినందున.. ఇప్పుడు పదవి తమ వర్గానికి చెందిన డిప్యుటీ చైర్ పర్సన్‌కు బాధ్యతలు అప్పగించాలని పైలెట్ వర్గం పట్టుబడుతోంది. అయితే.. పట్నం మాత్రం ఆ వర్గం మాట పెడచెవిన పెడుతున్నారు. ఇప్పుడున్న చైర్ పర్సన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం లేకపోవడంతో పైలెట్ వర్గం కూడా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొన్నది. కోదాడలో కూడా ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య వర్సెస్ మంత్రి జగదీశ్ వర్గాల మధ్య విభేదాలు ఉన్నాయి. కౌన్సిలర్లు కూడా రెండు వర్గాలుగా విడిపోయి గొడవలు పడుతున్నారు. నల్గొండలో కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు రెండు వర్గాలుగా విడిపోయి.. మున్సిపల్ చైర్మన్‌పై తిరుగుబాటు చేస్తున్నారు.

స్వయంగా మున్సిపల్ మంత్రి కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లలో కూడా మున్సిపల్ చైర్మన్‌పై తిరుగుబాటు మొదలైంది. చైర్మన్ భర్త అనవసర జోక్యం చేసుకుంటున్నారంటూ కౌన్సిలర్లు పరిస్థితిని కేటీఆర్ దగ్గరకు తీసుకెళ్లారు. మున్సిపల్ చైర్మన్‌ను మార్చాలంటే అవిశ్వాస తీర్మానం పెట్టడం కష్టం కావడంతో ఏమీ చేయలేని పరిస్థితి నెలకొన్నది. ఇలా టీఆర్ఎస్ తెచ్చిన చట్టం.. ఆ పార్టీకే మైనస్ కావడంతో ఏమి చేయాలోపాలుపోని పరిస్థితి నెలకొన్నది.

First Published:  3 Aug 2022 8:01 AM GMT
Next Story