Telugu Global
Telangana

రాజగోపాల్‌ మనోడు..అందుకే పోటీ లేదు

బీజేపీ తరపున పోటీ చేస్తున్న రాజగోపాల్‌ రెడ్డి తమ కుటుంబానికి చాలా సన్నిహితుడని అందుకే అక్కడ పోటీ చేయడం లేదని పార్టీ నేతలతో వైఎస్ షర్మిల చెప్పారని టీఆర్‌ఎస్ మీడియా ఆరోపిస్తోంది.

రాజగోపాల్‌ మనోడు..అందుకే పోటీ లేదు
X

తెలంగాణలో టీఆర్ఎస్‌ను దెబ్బతీసేందుకు, కొన్ని వర్గాల ఓట్లను చీల్చేందుకు బీజేపీ డెరెక్షన్‌లోనే వైఎస్‌ షర్మిల, ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌లను రంగంలోకి దిగారని చాలా కాలంగా టీఆర్‌ఎస్ అనుమానం వ్యక్తం చేస్తోంది. దళితులు, క్రిస్టియన్లు బీజేపీకి ఓటేసే అవకాశాలు చాలాచాలా తక్కువ. ఆ ఓట్లు నేరుగా టీఆర్‌ఎస్‌కు వెళ్లకుండా నిరోధించేందుకు, ఆ వర్గాల ఓట్లను చీల్చేందుకే షర్మిల, ప్రవీణ్‌కుమార్‌లను బీజేపీ ప్రయోగించిందని అధికార పార్టీ అనుమానం. చాలా స్వల్ప ప్రభావం మాత్రమే చూపే షర్మిల, ప్రవీణ్‌ కుమార్‌లను బీజేపీ-సీ టీమ్‌గా పెట్టుకుందని టీఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.

తాజాగా మునుగోడు ఎన్నికలో వైఎస్‌ షర్మిల పార్టీ పోటీ చేయకపోవడంపైనా ఇదే అనుమానాన్ని టీఆర్‌ఎస్ వ్యక్తం చేస్తోంది. బీజేపీ తరపున పోటీ చేస్తున్న రాజగోపాల్‌ రెడ్డి తమ కుటుంబానికి చాలా సన్నిహితుడని అందుకే అక్కడ పోటీ చేయడం లేదని పార్టీ నేతలతో వైఎస్ షర్మిల చెప్పారని టీఆర్‌ఎస్ మీడియా ఆరోపిస్తోంది.

తన సిద్ధాంతాలకు పూర్తి వ్యతిరేకి అయిన బీజేపీ తరపున రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తుంటే.. వ్యతిరేకించకపోగా.. రాజగోపాల్ మనోడే అని షర్మిల చెప్పడం బట్టే ఆమె పార్టీ ఎవరి కోసం పనిచేస్తోందో అర్థం చేసుకోవచ్చని టీఆర్‌ఎస్ అంటోంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ జరిపించాలంటూ షర్మిల ఢిల్లీ వెళ్లడం కూడా బీజేపీ కనుసన్నల్లోనే జరిగిందని అధికార పార్టీ ఆరోపిస్తోంది.

First Published:  8 Oct 2022 2:42 AM GMT
Next Story