Telugu Global
Telangana

గిరిజన యూనివర్శిటీ విషయంలో తెలంగాణకు మొండిచేయి

గిరిజన వర్శిటీకి అవసరాన్ని బట్టి అనే పదం జోడించారు. అంటే అవసరం లేదు అని కేంద్రం అనుకుంటే సరిపోతుందన్నమాట. ప్రస్తుతానికి వర్శిటీ విషయాన్ని దాటవేశారు.

గిరిజన యూనివర్శిటీ విషయంలో తెలంగాణకు మొండిచేయి
X

విభజన చట్టంలోని హామీల అమలుకి కేంద్రం ఏమాత్రం సంసిద్ధంగా లేదని తేలిపోయింది. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి ఏళ్లు గడుస్తున్నా రెండు తెలుగు రాష్ట్రాలపై కేంద్రం కనికరించడంలేదు. ఏపీ ప్రత్యేక హోదా ఎలాగూ గాలికి కొట్టుకుపోయింది. కనీసం గిరిజన వర్శిటీ వంటి విద్యాసంస్థల విషయంలో కూడా తెలంగాణకు మరోసారి మొండిచేయి చూపించింది కేంద్రం. అవసరాన్ని బట్టి తెలంగాణలో గిరిజన విశ్వ విద్యాలయం ఏర్పాటు చేస్తామన్నారు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.

దేశవ్యాప్తంగా రెండే విశ్వవిద్యాలయాలు..

భారత దేశంలో 2020-21 నాటికి 24.10 లక్షల మంది గిరిజన విద్యార్థులు ఉన్నారని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లోక్ సభలో బీబీ పాటిల్ అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. దేశంలో ప్రస్తుతం రెండు గిరిజన విశ్వవిద్యాలయాలు ఉన్నాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ లోని విజయనగరం జిల్లాలో ఒకటి, మధ్యప్రదేశ్‌ లో మరొకటి ఉన్నాయని వెల్లడించారు. ఈ రెండు యూనివర్సిటీల్లో 523 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని తెలిపారు.

అవసరాన్ని బట్టి అంటే..

గిరిజన యూనివర్శిటీ కోసం చాన్నాళ్లుగా తెలంగాణ ప్రభుత్వం పట్టుబడుతోంది. గిరిజన విద్యార్థులకు యూనివర్శిటీ ఎంతో ఉపయోగ పడుతుందని నేతలు పదే పదే కేంద్రానికి గుర్తు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం 2014లో తెలంగాణలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలన్న ప్రతిపాద ఉందని, దాన్ని నెరవేర్చాలని కోరుతున్నారు. కానీ గిరిజన వర్శిటీకి కేంద్రం సుముఖంగా లేదు. అందులోనూ తెలంగాణ రాష్ట్రానికి సాయం చేయడానికి బీజేపీకి మనసు రావడంలేదు. అందుకే గిరిజన వర్శిటీకి అవసరాన్ని బట్టి అనే పదం జోడించారు. అంటే అవసరం లేదు అని కేంద్రం అనుకుంటే సరిపోతుందన్నమాట. ప్రస్తుతానికి వర్శిటీ విషయాన్ని దాటవేశారు. ఎప్పుటిలోగా ఆ హామీ అమలు చేస్తారనే విషయంలో కూడా క్లారిటీ ఇవ్వలేదు.

First Published:  6 Feb 2023 12:43 PM GMT
Next Story