Telugu Global
Telangana

గద్దర్ అంతిమ యాత్రలో విషాదం.. తొక్కిసలాటలో సియాసత్ ఎడిటర్ మృతి

సియాసత్ పత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ కింద పడిపోయారు. అందరూ చూస్తుండగానే ఆయన కార్డియాక్ అరెస్టుకు గురయ్యారు. సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయింది.

గద్దర్ అంతిమ యాత్రలో విషాదం.. తొక్కిసలాటలో సియాసత్ ఎడిటర్ మృతి
X

ప్రజా గాయకుడు గద్దర్ అంతిమ యాత్రలో విషాదం చోటు చేసుకున్నది. అల్వాల్‌లోని మహాబోధి విద్యాలయంలో గద్దర్ అంత్యక్రియలు జరిగాయి. అక్కడకు లక్షలాది మంది ప్రజలు, అభిమానులు తరలివచ్చారు. గద్దర్ పార్దివ దేహాన్ని చూడటానికి వచ్చిన వారిని పోలీసులు కంట్రోల్ చేసే క్రమంలో తోపులాట చోటు చేసుకున్నది. ఆ సందర్భంగా సియాసత్ ఉర్థూ దినపత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ కింద పడిపోయారు.

అందరూ చూస్తుండగానే జహీరుద్దీన్ అలీ ఖాన్ కార్డియాక్ అరెస్టుకు గురయ్యారు. సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయింది. కాసేపటి తర్వాత సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు ప్రకటించారు. గద్దర్‌కు అత్యంత సన్నిహితుల్లో జహీరుద్దీన్ అలీ ఖాన్ ఒకరు. గద్దర్‌కు భేషరతుగా మద్దతు ఇచ్చి, ఎంతగానో ప్రేమించిన వ్యక్తి జహీరుద్దీన్ అలీ ఖాన్.. తన ప్రాణ మిత్రుడి అంతిమ యాత్రకు వచ్చి అత్యంత విషాదకరమైన పరిస్థితుల్లో మృతి చెందడం అందరినీ కలిచి వేసింది.

ఒకవైపు గద్దర్ పార్దివ దేహం ఉంచిన అంతిమ యాత్ర వాహనం వెళ్తుండగానే.. ఎడిటర్ జహీరుద్దీన్ అలీ ఖాన్ పక్కనే ఉన్న మెట్లపై ప్రాణాలు విడవటం అత్యంత బాధకరం. అక్కడే సీపీఆర్ చేయడానికి ప్రయత్నించినా అలీ ఖాన్ బతికి ఉండే వారనే చర్చ జరుగుతున్నది. అయితే అంబులెన్స్ వచ్చే వరకు ఎదురు చూసి.. ఆ తర్వాత సీపీఆర్ చేసినా లాభం లేకపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. వాటిని చూసి ప్రాణ స్నేహితుడి అంత్యక్రియల సమయంలోనే జహీరుద్దీన్ మృతి చెందడం ఘోర విషాదమని చర్చించుకుంటున్నారు.

First Published:  7 Aug 2023 2:25 PM GMT
Next Story