Telugu Global
Telangana

ఫ్రమ్ రేవంత్ టు మోదీ.. వయా కేసీఆర్..

ఆ లేఖలో వరదనష్టంతోపాటు, సీఎం కేసీఆర్ పై కూడా ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

ఫ్రమ్ రేవంత్ టు మోదీ.. వయా కేసీఆర్..
X

ఒకే లేఖతో స్వామికార్యం, స్వకార్యం రెండూ పూర్తిచేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. వరద నష్టాలనుంచి తెలంగాణ ప్రజానీకాన్ని ఆదుకోవాలని, తెలంగాణ వరదలను జాతీయ విపత్తుగా పరిగణించాలని కోరుతూ ఆయన ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. అయితే ఆ లేఖలో వరదనష్టంతోపాటు, సీఎం కేసీఆర్ పై కూడా ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

తెలంగాణలో 11 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, వరద ప్రాంతాల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి ఉందని తన లేఖలో ప్రధానికి వివరించారు రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం వరద పరిస్థితిని అంచనా వేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. కానీ రాష్ట్రంలో ఏమీ జరగలేదంటూ అబద్ధాలు చెబుతూ ప్రజల్ని, రైతుల్ని కేసీఆర్ ప్రభుత్వం మోసం చేస్తోందంటూ మండిపడ్డారు. వందేళ్లలో ఎన్నడూ లేని స్థాయిలో కుంభవృష్టి కురిసి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పత్తి, సోయాబీన్, పప్పు ధాన్యాలు, మొక్కజొన్న, వరి పంటలు పూర్తిగా నీట మునిగి సర్వనాశనమయ్యాయని, కానీ ఎకరం పంట కూడా నష్టం జరగలేదని టీఆర్ఎస్ నేతలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు రేవంత్ రెడ్డి.

ప్రాజెక్ట్ లు కట్టేందుకు లక్షల కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తున్న ప్రభుత్వం, వాటి నిర్వహణకు నయాపైస విదల్చడంలేదని విమర్శించారు రేవంత్ రెడ్డి. గోదావరి పరీవాహకంలోని కడెం ప్రాజెక్టు 5 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహంతో కొట్టుకుపోతుందేమోనని ప్రజలు భయపడ్డారని, కానీ అదృష్టం బాగుండి గండం గట్టెక్కిందని చెప్పారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నింటి పరిస్థితి కొంచెం అటు, ఇటుగానే ఉందన్నారాయన.

కాళేశ్వరంలోని రెండు పంప్ హౌస్ లు మునిగిపోతే ఆయా కంపెనీలు ఇచ్చిన వారంటీతో నష్టం లేదని ప్రభుత్వం చెబుతోందని, అయితే.. మోటార్లతోపాటు ప్యానెల్‌ బోర్డులు, కంప్యూటర్లు, ఇన్వర్టర్లు, విద్యుత్తు సామగ్రి పూర్తిగా దెబ్బతినడంతో రూ.500 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు చెబుతున్నారని అన్నారు రేవంత్ రెడ్డి. వాటిని పునరుద్ధించాలంటే నాలుగేళ్లు పడుతుందని అధికారులు చెబుతున్నారని, ఆ ప్రాజెక్టు మునగడం వెనుక టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి కూడా ఉందని అన్నారు. రక్షణ గోడ కూలిపోవడం నాణ్యతా లోపాలను ఎత్తిచూపిస్తోందని, భారీ ప్రవాహాన్ని తట్టుకునేలా నిర్మించలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయని లేఖలో పేర్కొన్నారు.

ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన పథకాన్ని తెలంగాణలో అమలు చేయట్లేదని, అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా బీమా పథకాలను తీసుకురాలేదని, దీంతో అతివృష్టి, అనావృష్టి వంటి ప్రకృతి విపత్తుల సమయంలో రైతులకు నష్టపరిహారం లభించడం లేదని ఆరోపించారు రేవంత్ రెడ్డి. వరుసగా మూడేళ్లు పంటలు దెబ్బతింటున్నా రాష్ట్ర ప్రభుత్వం మొద్దునిద్ర వీడటం లేదని మండిపడ్డారు.

భారీ వర్షాలకు 857 గ్రామాల్లోకి వరద చేరిందని, భద్రాద్రి పుణ్యక్షేత్రం జలదిగ్బంధంలో చిక్కుకుపోయిందని తెలిపారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో 28 చోట్ల జాతీయ రహదారులు, 86 చోట్ల రాష్ట్ర రహదారులు దారుణంగా దెబ్బతిన్నాయని, వందల సంఖ్యలో కల్వర్టులు కొట్టుకుపోయాయని అన్నారు రేవంత్ రెడ్డి. పరిస్థితి తీవ్రంగా ఉంటే సీఎం కేసీఆర్ కేవలం ప్రగతి భవన్ కు మాత్రమే పరిమితమై తూతూ మంత్రపు సమీక్షలతో కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు రేవంత్ రెడ్డి.

కిషన్ రెడ్డిపై కూడా..

ప్రజలకు నిత్యావసరాలు అందించే పరిస్థితి రాష్ట్రంలో లేదని, తెలంగాణ నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఇంతవరకు వరద పరిస్థితిపై ఆరా తీసిన పరిస్థితి లేదన్నారు రేవంత్ రెడ్డి. బీజేపీ ఎంపీలు సైతం వరదల సమస్యను కేంద్రం దృష్టికి తెచ్చే ప్రయత్నం చేయలేదని ఆరోపించారు. పంట నష్టం అంచనాకు తక్షణమే కేంద్ర బృందాన్ని పంపాలని కోరారు. తక్షణ సాయంగా 2వేల కోట్ల రూపాయలు విడుదల చేయాలని, రైతులకు ఎకరాకు 15వేల రూపాయవలు పరిహారం ఇవ్వాలని, పెట్టుబడి సాయం అందించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ ప్రధానికి లేఖ రాశారు.

First Published:  16 July 2022 8:09 AM GMT
Next Story