Telugu Global
Telangana

రాజగోపాల్ రెడ్డికి రేవంత్ రెడ్డి సపోర్ట్.. ఎలాగంటే..?

బీజేపీకి సపోర్ట్ గా టీడీపీ ప్రచారం రేవంత్ రెడ్డికి తెలిసి జరిగిందా, తెలియకుండా జరిగిందా అనేది తేలలేదు కానీ, ప్రస్తుతానికి ఈ నింద రేవంత్ రెడ్డి మోయాల్సిందే.

రాజగోపాల్ రెడ్డికి రేవంత్ రెడ్డి సపోర్ట్.. ఎలాగంటే..?
X

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. ప్రచారంలో కాషాయ జెండాలతోపాటు, పసుపు జెండాలు కూడా కనపడుతున్నాయి. బీజేపీకి టీడీపీ మద్దతు తెలుపుతూ ప్రచారం నిర్వహిస్తోంది. చివరి నిముషం వరకు మునుగోడు బరిలో అభ్యర్థిని దింపుతారని భావించినా ఆఖరికి చేతులెత్తేసిన టీడీపీ, ఇప్పుడు బీజేపీతో చేతులు కలిపింది. అడక్కపోయినా సపోర్ట్ ఇస్తామనే సరికి బీజేపీ నేతలు కూడా సరేనన్నారు.

రేవంత్ రెడ్డి ఎటువైపు..?

బీజేపీ, టీడీపీ స్నేహంలో రేవంత్ రెడ్డి పాత్ర ఏమేరకు ఉందనేదే ఇప్పుడు ప్రశ్నార్థకం. చంద్రబాబు సూచనతోనే తాను కాంగ్రెస్ లో చేరానని రేవంత్ రెడ్డి ఓ సందర్భంలో నోరు జారారు. అంటే రేవంత్ కి, చంద్రబాబుకి మధ్య బంధం తెగలేదు అనేమాట వాస్తవం. రేవంత్ ఎప్పుడూ చంద్రబాబుని పల్లెత్తుమాట అనలేదు, అనరు కూడా. అదే సందర్భంలో టీడీపీకి ఏపీలో ఫుల్ సపోర్ట్ ఇచ్చే ఈనాడు, ఆంధ్రజ్యోతి.. యాజమాన్యాలతో రేవంత్ రెడ్డికి సత్సంబంధాలున్నాయి. అంటే తెలంగాణలో టీడీపీ, బీజేపీకి సపోర్ట్ చేసిందంటే.. రేవంత్ రెడ్డి కూడా బీజేపీకి సపోర్ట్ చేసినట్టేననే కామెంట్లు వినపడుతున్నాయి. ఈ ప్రచార పర్వాన్ని ఉదాహరణగా చూపిస్తూ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నాయి వైరివర్గాలు.

తెలంగాణలో టీడీపీ ఇక కోలుకోలేదు, కానీ ఏపీలో మాత్రం బీజేపీ, జనసేనతో కూటమి కడితే ఆ పార్టీకి జవసత్వాలు కూడదీసుకునే అవకాశముంది. అందుకే ఇప్పుడు తెలంగాణలో బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు చంద్రబాబు. మునుగోడు ఉప ఎన్నికను అలా ఉపయోగించుకుంటున్నారు. బీజేపీ, టీడీపీ జెండాల కలయిక మాత్రం ఇటు రేవంత్ రెడ్డికి తిప్పలు తెచ్చిపెడుతోంది. అభ్యర్థి పాల్వాయి స్రవంతి గెలుపుకోసం కష్టపడుతున్న రేవంత్ రెడ్డి, టీడీపీ వ్యవహారంతో వైరి వర్గాల చేతికి చిక్కారు. రాజగోపాల్ రెడ్డికి రేవంత్ రెడ్డి సపోర్ట్ ఉందని, అందుకే టీడీపీ, బీజేపీ కలసి ప్రచారం చేస్తున్నాయని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. ఈ ప్రచారం రేవంత్ రెడ్డికి తెలిసి జరిగిందా, తెలియకుండా జరిగిందా అనేది తేలలేదు కానీ, ప్రస్తుతానికి ఈ నింద రేవంత్ రెడ్డి మోయాల్సిందే. మొత్తమ్మీద చంద్రబాబు స్నేహం మునుగోడు ఎన్నికల ముందు ఇలా రేవంత్ రెడ్డికి చిక్కులు తెచ్చిపెట్టింది.

First Published:  19 Oct 2022 3:39 AM GMT
Next Story